హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్’ అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి 11 మెట్రో సిటీలలో విస్తరించిన ‘స్ట్రీట్ కాజ్’ సామాజిక దృక్పథంతో విశేష సేవలందిస్తున్నది. 45 వేల మంది యువ సైన్యం 2009 నుంచి 13 లక్షల మందికిపైగా వ్యక్తులకు, వెయ్యికిపైగా జీవజాలానికి సేవలందించారు. ఈ ఎన్జీవో ప్రతినిధులు ఇటీవల కేటీఆర్‌ను కలిశారు. తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సమసమాజానికి ఏదో చేయాలన్న వారి తపన చూసిన కేటీఆర్ తనవంతుగా వారికి ఆర్థిక సాయం అందజేస్తానని ఇంటర్వ్యూ రోజు హామీ ఇచ్చారు. శనివారం స్ట్రీట్ కాజ్ ఎన్జీవో ప్రతినిధులకు చెక్కును అందజేసి మాట నిలుపుకొన్నారు. స్ట్రీట్కాజ్ ప్రతినిధులు, వలంటీర్లు కేటీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.