హైదరాబాద్ : భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ఈ దేశంలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కునూ లాక్కునే అధికారం ఎవరికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు ఎన్నడూ గొప్పవారు కారని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశం
ఎందరో వ్యక్తులను చూసింది, ఎందరో వచ్చారు.. పోయారు. వాటన్నింటినీ తట్టుకుని భారతదేశం ఎంతో బలంగా నిలబడింది. సగర్వంగా ముందుకు సాగుతోంది.
అలాంటిది వ్యవస్థలను పక్కనపెట్టి, ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఇంతటి తాపత్రయం ఎందుకు? అని కేటీఆర్ నిలదీశారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హక్కుల కంటే ఆ ఒక్క వ్యక్తి ఎలా గొప్పవాడయ్యాడని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశ మూల సిద్ధాంతాలను, ఆత్మను తుంగలో తొక్కుతూ సమాంతర వ్యవస్థలను నిర్మించాలని చూసే వారికి కాలం చెల్లిందని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ పునరుద్ఘాటించారు.