వరంగల్, అక్టోబర్ 26 (నమస్తేతెలంగాణ): బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియోలజీ, స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ తదితర కోర్సులకు ప్రవేశం కల్పించనున్నట్టు వెల్లడించింది.
శుక్రవారం నుంచి నవంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్టు వర్సిటీ పేర్కొంది. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఎన్ఆర్యూహెచ్ఎస్.టీఈఎల్ఏఎన్జీఏఎన్ఏ.జీవోవీ.ఐఎన్లో చూడాలని యూనివర్సిటీ తెలిపింది.