వరంగల్ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీజీ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో సర్వీస్ కేటగిరి అభ్యర్థులకు ఈసారి అవకాశం కల్పించారు.
సర్వీస్, నాన్ సర్వీస్ సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.