హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నేటి డిజిటల్ ప్రపంచంలో గూగుల్ పేరు లేకుండా, సాయం తీసుకోకుండా కోట్లమందికి రోజు గడవటంలేదు. మనిషి జీవితంలో ఈ సెర్చ్ ఇంజిన్ అంతలా భాగమైంది. జీ మెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్, గూగుల్ మీట్ వంటి మాధ్యమాల ద్వారా పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు ప్రజల జీవితాలపై చెరగని ముద్రవేస్తున్నది. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఏ సందేహం వచ్చినా, సమాచారం కావాలన్నా గూగులమ్మను తట్టడం సర్వసాధారణమైపోయింది. మనిషి జీవితంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషిస్తున్న గూగుల్‌కు ఇక కాలం చెల్లిపోయినట్టేనా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తున్నది. అందుకు ప్రధాన కారణం సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రావటంతోనే సంచలనాలు సృష్టిస్తున్న ‘చాట్ జీపీటీ’. ఇది ఓ కొత్తతరం సెర్చ్ ఇంజిన్. దీనిని ప్రారంభించిన వారంలోనే దాదాపు 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకొన్నారు. మరి ఇందులో అంతలా ఏమున్నది? దీనిని చూసి గూగుల్ ఎందుకు వణికిపోతున్నది? దాని ప్రత్యేకతలు ఏమిటి? పనితీరు ఎలా ఉంటుంది? దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలేమిటి? నెటిజన్లకు ఒనగూరే ప్రయోజనాలేటి? ఇలాంటి విషయాల గురించే ఈ కథనం..
ప్రస్తుత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్లలో గూగుల్ నంబర్ వన్. కొంతకాలంగా ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తూ సాంకేతిక రంగాన్ని సమూలంగా మార్చివేస్తున్నది. ఆ టెక్నాలజీ ఆధారంగా పుట్టుకొచ్చిందే చాట్ జీపీటీ. అందులో చాట్ అనగా మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఈ చాట్ బోట్‌కు ముందుగా శిక్షణ ఇస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి కలపటం ద్వారా మనకు సాధారణ మనిషి ఇచ్చిన విధంగానే సమాధానాలు ఇచ్చేలా చాట్ జీపీటీని తీర్చిదిద్దారు. ఏఐ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్న శానిఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ అనే కంపెనీ దీనిని ఆవిష్కరించింది. ఈ కంపెనీలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌తోపాటు మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్సాప్ తదితర మొబైల్ అప్లికేషన్స్, అన్ని ప్రముఖ సంస్థలు, బ్యాంకులు కూడా చాట్బాట్స్తోనే నడుస్తున్నాయి. ఆయా చాట్‌బాట్‌తో నెటిజన్లు ఎప్పుడో ఒకసారైనా సంభాషించే ఉంటారు. మనం మెసేజ్ చేస్తే ఆటోమెటిక్‌గా సమాధానం వస్తూ ఉంటుంది. అయితే అందులో పరిమితులున్నాయి. దానిలో ముందస్తుగా లోడ్ చేసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు వస్తుంటాయి. వాటి సాయంతో కంప్యూటర్ మనతో చాట్ చేస్తుంటుంది. కానీ, దీనికి చాట్ జీపీటీ కాస్త బెటర్ వర్షన్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఇంటర్నెట్ నుంచి పెద్ద డాటాసెట్ను ఉపయోగించి ట్రైనింగ్ ఇచ్చిన మనిషి తరహాలోనే యూజర్లకు సహాయం చేయడానికి రూపొందించిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సాధారణ మనిషిలాగానే విశ్లేషించి సమాధానం ఇస్తుంది. అలా అని సంక్లిష్ట భావనలు, భావోద్వేగాలను అర్థం చేసుకోగల సామర్థ్యం దీనికి లేదు. మనం అడిగిన ఒక ప్రశ్న ఆధారంగా.. తర్వాత మనం అడిగే అవకాశమున్న ప్రశ్నలను సిద్ధం చేసుకొని వాటికి సమాధానాలను కూడా చూపడం దీని మరో ప్రత్యేకత.
చాట్ జీపీటీ కూడా గూగుల్ తరహాలోనే సెర్చ్ ఇంజిన్. అయితే గూగుల్‌ను ఏదైనా ప్రశ్న అడిగితే అది దానికి సంబంధించిన లింక్స్‌ను మాత్రమే మనకు చూపుతుంది. అందులో ఏది కావాలో మనమే వెతుకోవాలి. కానీ, చాట్ జీపీటీ అందుకు భిన్నం. మనం ఒక ప్రశ్న అడిగితే అది సూటిగా సుత్తిలేకుండా ఏకంగా సమాధానమే చెప్తుంది. లింక్స్ ఇవ్వడం, వెతుకోమనడం అనే ప్రశ్నే లేదు. గ్రమెటిక్ మిస్టేక్స్, వాక్య నిర్మాణం సరి చేయడం, వివిధ భాషల్లోకి అనువాదం, ప్రశ్నలకు సమాధానమివ్వడం, ప్రోగ్రా మ్స్ రాసివ్వడం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు చూపటం దీని ప్రత్యేకత. ఇది రీట్రైనింగ్ అవసరం లేకుండా కొత్త టాపిక్‌లు, టాస్‌లను స్వతహాగా నేర్చుకోగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. అత్యంత క్లిష్టంగా ఉండే పైథాన్ కోడ్‌ను కూడా మనం ఇచ్చే సూచనలకు అనుగుణంగా రాసి పెట్టగల సామర్థ్యం చాట్ జీపీటీ సొంతం. వ్యక్తులు, వ్యాపార సంస్థల మధ్య జరిగే కాంట్రాక్టు పేపర్ల ముసాయిదాలను, షరతులు, నిబంధనలు చెబితే చాలు.. అందుకు అనుగుణంగా ఒప్పంద పత్రాలను రాసివ్వగలదు. అందుకే చాట్ జీపీటీ భవిష్యత్తులో గూగుల్‌ను మట్టికరిపిస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు కూడా కోత పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మాన్యుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డాటా ఎంట్రీ, అనాలసిస్, ట్రావెల్, రిటైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున కోత పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు.
పబ్లిక్ బీటా టెస్టింగ్ కోసం మాత్రమే చాట్ జీపీటీ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ ఏఐ కంపెనీ గత డిసెంబర్ 1న విడుదల చేసింది. అందుబాటులోకి వచ్చిన వారంలోపే దాదాపు 10 లక్షల మంది, నెలలోపు 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకొన్నారు. చాట్ జీపీటీని కంప్యూటర్లోనో, ల్యాప్ట్యాప్లోనో వినియోగించుకోవాలంటే ముందుగా OPENAI.COM లోకి వెళ్లి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందుకు మన మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇస్తే.. ఫోన్ నంబర్‌కు ఓ ఐడీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఓ యాక్టివేషన్ లింక్‌ను మెయిల్‌కు పంపిస్తుంది. అది క్లిక్ చేస్తే చాట్ జీపీటీ లాంచ్ అవుతుంది. దానిని ఓపెన్ చేస్తే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. దానిలో మనకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేస్తే వెంటనే సమాధానం వస్తుంది. ప్రస్తుతానికి చాట్ జీపీటీ సేవలను ఉచితంగా వాడుకోవచ్చు. ప్రస్తుతం రిసెర్చ్ ప్రివ్యూ మాత్రమే ఉచితంగా లభిస్తుందని ఓపెన్ ఏఐ కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో సబ్స్రిప్షన్ చార్జీలు పెట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. చాట్ జీపీటీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మొబైల్ యాప్‌ను విడుదల చేయలేదు. అయినప్పటికీ కొందరు డెవలపర్లు నకిలీ యాప్ వర్షన్లను సృష్టించడం అప్పుడే మొదలు పెట్టారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో పెట్టి వాటిని వాడినందుకు చార్జీలు విధిస్తూ మోసాలకు తెరలేపారు.