e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home Top Slides ముసురుకున్న వాన

ముసురుకున్న వాన

ముసురుకున్న వాన
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
  • జైనూర్‌లో 10.18 సెంటీమీటర్లు నమోదు
  • 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మూడ్రోజులు భారీనుంచి అతిభారీ వర్షసూచన
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక

రాష్ర్టాన్ని ముసురు ముంచెత్తుతున్నది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుతున్నది. గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ర్టాన్ని వాన వదలట్లేదు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకూ ముసురు కురుస్తూనే ఉన్నది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో చలి వణికిస్తున్నది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, వాతావరణంలో మార్పుల కారణంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రలో రాగల మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది.

- Advertisement -

ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు, తూర్పు- పశ్చిమ ద్రోణి బలహీపడింది. గురు, శుక్రవారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో అతి భారీనుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పలు జిల్లాల్లో ప్రమాదకరస్థాయిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు పొంగి వరదలు వస్తాయని తెలిపింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్‌డీఎంఏ రిలీఫ్‌ కమిషనర్‌, సంబంధిత జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హెచ్చరికలు జారీచేసింది.

పొంగిన వాగులు, వంకలు

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరద చేరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సాత్నాల, మత్తడివాగు, పీపీ రావు, వట్టివాగు, ర్యాలీవాగు, నీల్వాయి గొల్లవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. వాగులు నిండుగా ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి శివారులోని గుండ్ల వాగు ప్రాజెక్టు పాల నురుగులతో అలుగుపోస్తున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 24 ఫీట్లు కాగా.. పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతున్నది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ శివారులోని మున్నేరు వాగు మత్తడి పోస్తున్నది. గార్ల మండలంలోని పాఖాల ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా రామప్ప చెరువు నీటిమట్టం 36 అడుగులకుగాను 30 అడుగులకు చేరింది. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు ప్రాజెక్టు మత్తడి పోస్తున్నది. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి భారీగా వరద వస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కులు

ఎగువన వర్షాలకుతోడు రాష్ట్రంలో కురుస్తున్న వానలతో పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్నది. శ్రీశైలం జలాశయానికి బుధవారం సాయంత్రం 6 గంటలకు 1,51,412 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి 50,558 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. జూరాలకు వరద తగ్గుముఖం పట్టింది. ఆర్డీఎస్‌కు 1,250 క్యూసెక్కులు, సుంకేసులకు 1,560 క్యూసెక్కులు నీరు చేరుతున్నది. మూసీకి 1,880 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా.. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. సింగూరుకు 3,429 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. కాళేశ్వరం సరస్వతీ బరాజ్‌కు 9 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 51,750 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఎల్లంపల్లికి 45 వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది.

ముసురుకున్న వాన
ముసురుకున్న వాన
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముసురుకున్న వాన
ముసురుకున్న వాన
ముసురుకున్న వాన

ట్రెండింగ్‌

Advertisement