హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో చిన్నాభిన్నమైన ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి సాయమందించడంలో విద్యాశాఖ అధికారులు ఉదారంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి షరతులు, పరిమితుల్లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారు. ప్రైవేటు స్కూల్లో టీచర్లు, సిబ్బందిగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ దరఖాస్తుచేసుకుంటే.. ఇద్దరినీ అర్హులుగా ఎంపికచేశారు. ఇద్దరికీ సహాయాన్ని అందించనుండటంతో నెలకు రూ.4వేల సాయం, 50 కేజీల బియ్యం అందనున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 25 వేల పైచిలుకు కుటుంబాలు లబ్ధిపొందనున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఆపత్కాలంలో తమకో ఆసరా దొరికిందని హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నేను నా భార్య ప్రైవేటు స్కూల్లోనే పనిచేస్తున్నాం. పాఠాలు చెప్పడం తప్ప, మరే ఇత ర వ్యాపకాలు లేవు. కరో నా, లాక్డౌన్తో ఏమీ తోచని పరిస్థితి నెలకొన్నది. నెల, రెండు నెలలు అనుకుంటే ఏడాది గడిచిపోయింది. మా పాఠశాల యాజమాన్యం కొద్దిగా ఆదుకున్నది. సీఎం కేసీఆర్.. మానవతా దృక్పథంతో మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం సంతోషదాయకం. ప్రభుత్వమిచ్చే సాయానికి భార్యాభర్తలం ఇద్దరం దరఖాస్తు చేసుకున్నాం. ఇద్దరం ఎంపికయ్యాం.
– నాగేశ్వర్రావు, నాగలక్ష్మి, ఖమ్మం
నేను ఎంఏ, బీఈ డీ, నా భార్య ఎం కాం, బీఈడీ చది వాం. కరీంనగర్లోని ఓ కాన్వెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నాం. కరోనాతో మా పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు, నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడ్డాం. తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేనేత పవర్లూమ్స్ నడిపిన. నాభార్య కండెల మిషన్ నడిపింది. ప్రభుత్వపరంగా మమ్మల్ని ఆదుకోవడం సంతోషం. ఇద్దరికీ ప్రభుత్వ సాయంతో కొంతలోకొంత చేయూత కలుగనున్నది.
– దూడం శ్రీనివాస్, కరీంనగర్
నేను ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసిన నా వయస్సు 42 ఏండ్లు. వయోపరిమితి మించడంతో ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు వదులుకున్నా. ప్రైవేటు స్కూల్ టీచర్ ఉద్యోగం తప్ప మరే ప్రత్నామ్నాయం లేదు. నేను నా భార్య ఇద్దరం స్కూల్ టీచర్లుగానే పనిచేస్తున్నాం. కరోనా.. ఊహించని పరిస్థితి కండ్లముందే కదలాడటం, స్కూల్ మూతపడటంతో భవిష్యత్ ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందన్న ఆలోచన కూడా తట్టలేదు. ఎట్టకేలకు సర్కారు మమ్మల్ని ఆదుకోవడం సంతోషం. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రైవేటు టీచర్లను పట్టించుకోవడం గొప్పవిషయం. – ఎం ముకుందర్రెడ్డి, కరీంనగర్