Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని.. పంట కొనుగోళ్లలోనూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని హరీశ్‌రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని ప్రశ్నించారు.
మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయన్నారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని తెలిపారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందనా ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారని తెలిపారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని సూచించారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Harish Rao Letter1

Harish Rao Letter2

Harish Rao Letter3

Harish Rao Letter4