Vijayashanthi | ‘విజయ అశాంతి గారూ… మీరు మళ్లీ వచ్చారు కదా! ఏమనిపిస్తున్నది?’
‘మళ్లీ మళ్లీ వస్తాను. నా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. సినిమాల్లో హీరో గెంతినట్టు రాజకీయాల్లో గెంతడం నాకు బాగా నచ్చిన ఫీట్… నిరంతరం పార్టీల మధ్య ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే రాజకీయాలు అర్థమవుతాయి.’
‘బాగా చెప్పారు. లలిత జువెలరీ గుండాయన కూడా సరిగ్గా ఇదే చెప్పారు. నాలుగు షాప్స్ తిరిగి ధరలు తెలుసుకోండి. ఆ తరువాతే కొనండి… అంటా రు. మీరు కూడా నాలుగు పార్టీలు తిరిగి ఈ పార్టీలో స్థిరపడ్డారు. ఐతే ఆ గుండాయన నాలుగు షాప్స్ తిరగమంటే మీరు ఒక అడుగు ముందుకు వేసి నాలుగు పార్టీల్లో రెండేసి సార్లు తిరిగారు.’
‘బాగా లెక్క పెట్టారు. ఐతే మీరు అన్న ఒక మాటతో నేను ఏకీభవించను. నాలుగు పార్టీలు తిరిగి ఈ పార్టీలో స్థిరపడ్డారు అన్నారు. ఈ పార్టీలో ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు.
‘అంటే… ఇక్కడి నుంచి కూడా!?’
‘ముందే చెప్పాను కదా?
‘పువ్వును విడిచి ఎందుకు బయటకు వచ్చారు?’
‘మీరు అడుగుతున్నది మొదటి సారి విడిచి రావడం గురించా? రెండో సారి గురించా?’
‘రెండోసారి గురించి?’
‘నేను ప్రధాని పదవికి పోటీకి వస్తానేమో అని వాళ్ల భయం. అందుకే దూరం పెడుతున్నారని గ్రహించి బయటకు వచ్చాను.’
‘మీరా… ప్రధానా?… ఆ మధ్య బండిని పార్టీ బండి నుంచి కిందకు తోసేశాక ఓ మహిళా నాయకురాలు ఇలానే అన్నారు. బండికి ప్రమోషన్ ఇచ్చి ప్రధానిని చేయవచ్చు. అందుకే తొలగించారని. ఇప్పుడు మీరూ అలానే…’
‘బండి కన్నా నన్ను ఎక్కువ మంది గుర్తు పడతారు. నన్ను లేడీ అమితాబ్ అనేవారు..
‘అమితాబే రాజకీయాల్లో బోల్తా పడి నా వల్ల కాదు అని చెంపలు వేసుకుని దారికి వచ్చారు. ఇక లేడీ అమితాబ్?’‘హస్తంలో పీఎం ఛాన్స్ లేదు కదా? మరి?’
‘పీఎం ఛాన్స్ లేకపోతే సీఎంను అవుతాను’ ‘హస్తంలో ఐదు రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకున్న అందరికీ సీఎం పోస్ట్ ఆశించే అర్హత ఉంటుంది.
‘హీరోయిన్గా నటించేప్పుడు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్… ఆ తరువాత …’‘నేను అడిగింది సినిమాల్లో హిట్స్ గురించి కాదు. రాజకీయాల్లో గెలువడం గురించి?’
‘మీరు అడిగాక గుర్తుకు వస్తున్నది. బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత హస్తం మిత్రులతో సొంత పార్టీ పెట్టాను. గులాబీలో చేరాను. టికెట్ ఇచ్చారు. గెలిచాను. బయటకు వచ్చి హస్తంలో చేరాను. మళ్లీ కమలంలో చేరాను. మళ్లీ హస్తంలోకి వచ్చాను.’
‘అంటే గులాబీ వల్ల ఒక్కసారి గెలిచారు. అంతే కదా?’
‘ప్రజలు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు?’
‘కానీ ఓటు మాత్రం వేయరు అంటారు.’
‘కాదు నేను పీఎం, సీఎం పదవులకు పోటీ అని ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వాళ్లే ఓడిస్తున్నారు అని నా అనుమానం.’
‘తాను సీఎంను అవుతాను అనే భయంతోనే తమ పార్టీ పోటీ చేసేందుకు సింబల్ ఇవ్వడం లేదు అని పాల్ గోల చూస్తున్నట్టుగానే ఉంది, మీ భయం. బయటకు వచ్చి చేసేదేమీ లేదు. అలా భ్రమల్లోనే ఉండండి…’
n మురళి