హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(డీఎస్‌హెచ్) పరిధిలోని 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టుల తుది జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) సోమవారం విడుదల చేసింది. నేడు(మంగళవారం) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఎంపికైన వారిలో అనస్తీషియా(226), గైనకాలజీ(247), పీడియాట్రిక్స్(219) ఉన్నట్టు పేర్కొన్నారు. 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్టు), 607 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది ఎంహెచ్ఎస్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగిలిన 924 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మే నెలలో పూర్తి కానున్నట్టు అధికారులు వెల్లడించారు.