మహబూబ్నగర్ : జూరాల గేట్ల ( Jurala gates ) ను తెరిచారని రైతుల మీద రహస్యంగా కేసులు ( Cases ) నమోదు చేయడాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) తీవ్రంగా ఖండించారు. నీళ్లివ్వడం చేతగాక రైతులపై కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. డీఈతో ఫిర్యాదు చేయించి గత నెల 20న కేసు నమోదు చేయడం ఈ సర్కారు చేతగానితనానికి నిదర్శనమని ఆరోపించారు.
14 మంది రైతులు కృష్ణారెడ్డి, రాజు, కురుమూర్తి, గోపి, జబ్బార్, షరీఫ్, శేఖర్ రెడ్డి, దేవేందర్, సమరసింహ, సద్దల భాను, వేణు, భాస్కర్, లక్ష్మణ్, నరేష్ మీద నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో రెండు రోజుల కర్ణాటక పర్యటనకు వెళ్లి నీళ్లు తీసుకువస్తామన్న మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఏం సాధించిందని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి నీళ్లు తీసుకు రాలేక రైతుల మీద కేసులు పెట్టిస్తారా? అంటూ మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో కరంటు బిల్లులు కట్టలేదని ఒక్క గట్టు మండలంలోనే రైతుల మీద మూడు వేల కేసులు నమోదు చేయగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని గుర్తు చేశారు. సాగునీరు ఇవ్వకుండా రైతుల పొలాలు ఎండబెట్టి, రైతుల మీద పెడుతున్న కేసులు కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తంలా మారడం ఖాయమని హెచ్చరించారు.