మాదాపూర్, ఫిబ్రవరి 22: బ్లడ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నదని యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు అన్నారు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించింది మాత్రమే కాదని, మానసిక బలం, ఆర్థిక మద్దతు, అవగాహన అవసరమని చెప్పారు. మాదాపూర్యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం డెక్కన్ హేమటో లింక్ 2025 పేరుతో రెండు రోజుల అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జీఎస్ రావు మాట్లాడుతూ..గ్లోబొకాన్ 2020 నివేదిక ప్రకారం.. దేశంలో ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, వాటిలో బ్లడ్‌క్యాన్సర్ కేసులు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నాయని తెలిపారు. లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు.
క్యాన్సర్ చికిత్సలో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న చికిత్స విధానాలు రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని అన్నారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ హెమటాలజిస్ట్, డాక్టర్ గణేశ్ జైశేత్వర్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్‌లో 12 సంవత్సరాలుగా 500కు పైగా విజయవంతమైన ఎముక మజ్జ మార్పిడిని, వేలాదిమంది రక్త క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించి కొత్త జీవితాన్ని అందించినట్టు తెలిపారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టార్గెటెడ్ థెరఫీలు సీఏఆర్- టీసెల్ థెరపీ, జెల్లీ వంటి విధానాలు చికిత్స స్వరూపాన్ని మార్చేశాయని చెప్పారు.
బ్లడ్ క్యాన్సర్‌లో అధునాతన ఆశాజనకమైన చికిత్స సీఏఆర్- టీ సెల్ థెరపీ అని, ఇది క్యాన్సర్‌పై దాడి చేయడానికి రోగిలో రోగనిరోధక కణాలను పునరుత్పత్తి చేస్తుంది అని వివరించారు. ప్రసాద హాస్పిటల్, హైటెక్ సిటీలో అవసరమైన ప్రతి బ్లడ్ క్యాన్సర్ రోగికి ప్రపంచస్థాయి చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. బ్లడ్ క్యాన్సర్ మరణశిక్ష కాదని, ముందస్తు రోగ నిర్ధారణ అని చెప్పారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం, యువ వైద్యులు పాల్గొన్నారు.