Group-1 Notification | వరంగల్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్లో మహిళలకు పోస్టులు భారీగా తగ్గిపోయాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మహిళలకు ఉద్యోగం దకాలంటే పురుషులకంటే రెట్టింపు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లు తొలగించడం, పోస్టులన్నింటినీ జనరల్ క్యాటగిరీగా చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 18 విభాగాల్లో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీల క్రమాన్ని ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (వీహెచ్, హెచ్‌హెచ్, ఓహెచ్, ఎంహెచ్), ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ క్యాటగిరీలుగా పేర్కొన్నది. మహిళలకు ప్రత్యేకంగా ఎక్కడా రిజర్వు చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కారు 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో జనరల్ క్యాటగిరీకి 278 పోస్టులు, మహిళలకు 225 పోస్టులు రిజర్వ్‌చేశారు.
తాజా నోటిఫికేషన్‌లోని 563 పోస్టులను ప్రస్తుత విధానం ప్రకారం భర్తీ చేస్తే మహిళలకు 109 పోస్టులు మాత్రమే దక్కే అవకాశం ఉన్నది. హారిజాంటల్ పద్ధతిలో 33.333(33 1/3) శాతం మహిళా రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ రిజర్వేషన్లను ప్రత్యేకంగా మారింగ్ చేయకుండా అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నది. ఈ ఆదేశాల ప్రకారం ఏ క్యాటగిరీలో అయినా మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళకు కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ, ఒక క్యాటగిరీలో రెండు పోస్టులే ఉంటే ఆ రెండింటిని జనరల్ క్యాటగిరీతో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. గ్రూప్ -1 నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం పలు విభాగాల్లోని పోస్టులు మూడు కంటే తకువగా ఉన్నాయి. దీంతో వీటన్నింటిలో మహిళా రిజర్వేషన్ ఉండదు.
గ్రూప్ -1 నోటిఫికేషన్లో పేర్కొన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మల్టీజోన్-1లో 20, మల్టీజోన్- 2లో 25 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే మహిళలకు మల్టీజోన్-1లో 7, మల్టీజోన్- 2లో 8 చొప్పున 15 పొస్టులు దకాలి. రిజర్వేషన్ క్యాటగిరీల ప్రకారం పరిశీలిస్తే మల్టీజోన్-1లో మహిళలకు ఓసీ క్యాటగిరీలో రెండు, ఎస్సీ క్యాటగిరీలో ఒక పోస్టు మాత్రమే ఉండనున్నది. మల్టీజోన్ -2లో మహిళలకు ఓసీ క్యాటగిరీలో 2 పోస్టులు.. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల్లో చెరొక పోస్టు ఉంటుంది. మిగతా రిజర్వేషన్ క్యాటగిరీల్లో పోస్టుల సంఖ్య 2, అంతకంటే తకువ ఉండటంతో ఆయా పోస్టుల్లో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ ఉండదు. వీటన్నింటినీ జనరల్ క్యాటగిరీలోనే భర్తీ చేస్తారు.
మొత్తంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో మహిళలకు ఏడు పోస్టులు మాత్రమే కచ్చితంగా దక్కనున్నాయి. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) 115 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్-1 పరిధిలో 52 ఉద్యోగాలు ఉన్నాయి. 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 17 పోస్టులు రావాలి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 13 ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉన్నది. మల్టీజోన్-2 పరిధిలో 63 పోస్టుల్లో 33 శాతం ప్రకారం 20 పోస్టులు మహిళలకు దక్కాలి. నోటిఫికేషన ప్రకారం 17 పోస్టులే దక్కనున్నాయి. మహిళా రిజర్వేషన్ కోటా కంటే మిగిలిన పోస్టులను ఆయా రిజర్వేషన్లోని జనరల్ క్యాటగిరీలో భర్తీ చేయనున్నారు. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీవో) పోస్టులు 48 ఉన్నాయి. వీటిలో 33 శాతం లెక్కన మహిళలకు 16 పోస్టులు దక్కాలి. నోటిఫికేషన ప్రకారం 9 పోస్టులే మహిళలకు దక్కే అవకాశం ఉన్నది.
మల్టీజోన్-1 పరిధిలోని 12 పోస్టుల్లో ఓసీ క్యాటగిరీలో ఒక్కటే పోస్టు ఉన్నది. మల్టీజోన్-2 పరిధిలో ఓసీలో 4, ఈడబ్ల్యూఎస్, బీసీ-ఏ, బీసీ-బీ, ఎస్సీ, ఎస్టీలో ఒక్కటి చొప్పున మహిళలకు పోస్టు దకనున్నాయి. మిగతా పోస్టులన్నీ జనరల్ క్యాటగిరీలోనే భర్తీ చేయనున్నారు. రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్టిక్ట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టులన్నీ మహిళా కోటా లేకుండా ఆయా రిజర్వేషన్‌కు సంబంధించిన జనరల్ క్యాటగిరీలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెడికల్ అండ్ హెల్త్ ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో బీసీ క్యాటగిరీలో మహిళలకు ఒక పోస్టు సైతం దకే అవకాశం లేదు.
టీఎస్పీఎస్సీ తాజా గ్రూప్ -1 నోటిఫికేషన్లో 16 పోస్టులను క్యారీఫార్వర్డ్ చేసినట్టు ప్రకటించారు. వీటిలో ఓపెన్ క్యాటగిరీకి చెందినవి 7 పోస్టులు.. బీసీ-బీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, హియరింగ్ హాండిక్యాప్డ్ (హెచ్‌హెచ్) క్యాటగిరీలో 4, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (వీహెచ్) క్యాటగిరీలో 2 చొప్పున పోస్టులు ఉన్నాయి. క్యారీఫార్వర్డ్ చేసిన ఈ పోస్టులు జనరల్ క్యాటగిరీకి చెందినవా? వీటిలో మహిళలకు రిజర్వు చేసిన పోస్టులు ఎన్ని అనేది స్పష్టత లేదని నిరుద్యోగులు చెప్తున్నారు. ఏదైనా క్యాటగిరీలో రిజర్వ్ చేసిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనప్పుడు వాటిని తదుపరి ఇచ్చే నోటిఫికేషన్‌తో అదే రిజర్వేషన్ అభ్యర్థులతో భర్తీ చేయడాన్ని క్యారీఫార్వర్డ్ అంటారు. ఇకడ క్యారీఫార్వర్డ్ చేసిన పోస్టులు ఏ క్యాటగిరీకి చెందినవి అనేది స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.