హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘అవునూ.. మేం కేసీఆర్ చావును కోరుకుంటున్నాం’ అంటూ నోటిదురుసు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమకారుడు, తె లంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేతగా, పదేండ్లపాటు సీఎంగా చేసిన కేసీఆర్ చావును కోరుకుంటూ వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఆయన కుసంస్కారాన్ని అందరూ ఖండించారు. కాంగ్రెస్ పార్టీపైనా ఆ ప్రభావం పడింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ మాట మార్చారు. తాను కారులో అసెంబ్లీకి వెళ్తుంటే విలేకరి ప్రశ్న అడిగితే.. కేసీఆర్ చావాలని కోరుకుంటున్నట్టు ఏదో ఫ్లోలో అన్నానని సెలవిచ్చారు. కావాలని అనలేదని, తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదంటూ ప్లేట్ ఫిరాయించారు. అయితే కేసీఆర్ను క్షమాపణ కోరలేదు. ఏదో జరిగిపోయిందన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం.