Asara Pensions | ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే.. 1,826 మందికి రికవరీ నోటీసులు
వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
- ఆసరా సొమ్ము తిరిగివ్వాలని హుకుం
- ఆసరా పింఛన్ల తొలగింపు షురూ
- కొత్తగా ఇస్తామని పాతవాటికి పాతర
- అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధులు బలి
Asara Pensions | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తాము అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తాన్ని రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామన్న హామీని నెరవేర్చకపోగా, ప్రస్తుతం వస్తున్న పెన్షన్లకే ఎసరు పెడుతున్నదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యంతో జరిగిన తప్పిదాలకు వారిని బాధ్యులను చేయకుండా పండుటాకులపై విరుచుకుపడుతున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. రెండేసి పింఛన్లు తీసుకుంటున్నారంటూ పలువురు వృద్ధులకు నోటీసులు జారీ చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. పింఛన్లు తొలగించనున్న 1,826 మంది జాబితాను ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు.
ఇప్పటివరకు పొందిన పింఛన్ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని, లేదంటే ప్రభుత్వ పథకాలన్నింటిని నిలిపివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉన్న తాము ఈ వయస్సులో డబ్బులు తిరిగి ఎలా చెల్లించగలమని నోటీసులు అందుకున్న వృద్ధులు లబోదిబోమంటున్నారు.
ఎవరికైనా నిబంధనలకు విరుద్ధంగా రెండేసి పింఛన్లు వస్తున్నట్టయితే వాటిని గుర్తించి నిలిపివేయాల్సిన అధికారులు ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు హడావుడిగా నోటీసులు జారీ చేయడం ఏమిటని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పొరపాటు, నిర్లక్ష్యం కారణమని, మొదట వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెండు పింఛన్లు ఇవ్వం : మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పింఛన్ అందుతున్నది. అయితే, ఆమె కూతురు డీ రాజేశ్వరి వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తూ మరణించడంతో మల్లమ్మకు ఫ్యామిలీ పెన్షన్ కింద నెలకు రూ.24,073 వస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే వ్యక్తి రెండు రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని స్పష్టంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలీ పెన్షన్ రెండింటినీ 1,826 మంది పొందుతున్నట్టు ట్రెజరీ శాఖ ఈ మధ్యనే గుర్తించి వారందరికీ రికవరీ నోటీసులు అందజేసిందని తెలిపారు. ప్రభుత్వం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తున్నదని, అర్హులందరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందులో భాగంగానే లీకేజీలను అరికట్టడంతోపాటు ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ చేస్తున్నట్టు వెల్లడించారు.
మంచానపడిన మల్లమ్మ
కేటీఆర్ ట్వీట్తో మల్లమ్మ ఇంటికి అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ): ‘పింఛన్ల రిక‘వర్రీ” పేరుతో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురించడం, దానిపై స్పందించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు దాసరి మల్లమ్మ పరిస్థితిపై విచారణ జరిపారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశాల మేరకు అదనపు డీఆర్డీవో రంగారావు సిబ్బందితో మల్లమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అసలు మల్లమ్మ ఏంచేస్తున్నది? ఆమెకు అండగా ఎవరున్నారు? వారి కుటుంబ పరిస్థితి ఏమిటి? అని ఆరా తీశారు.
మల్లమ్మ మంచాన ఉండటం గమనించారు. ఉలుకూపలుకూ లేని పరిస్థితిని పరిశీలించి నివేదిక తయారుచేశారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్టు డీఆర్డీవో విద్యాచందన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వాస్తవంగా తన కూతురు ఉద్యోగం చేసి మరణించడంతో మల్లమ్మకు ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఇలాంటి కేసులు జిల్లాలో 200 వరకూ ఉన్నట్టు అంచనా. మల్లమ్మ ఏడాది క్రితం పక్షవాతంతో దవాఖానలో చేరడంతో వైద్యానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయిందని, దీనికి నెలనెలా పరీక్షలు చేయించుకోవడంతో గతంలో వచ్చిన పింఛన్ పూర్తిగా ఖర్చు అయిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పింఛన్ మందులకే సరిపోతున్నదని వాపోతున్నారు. పక్షవాతం, చెవుడు, వయోభారంతో బాధపడుతున్న మల్లమ్మకు రికవరీ నోటీసులు జారీ చేయడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య
రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చిన పింఛన్ పైసలను రేవంత్రెడ్డి సర్కార్ తిరిగి రికవరీ చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య. కొత్తగూడెం మున్సిపాలిటీలో 42 మందికి ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. నోటీసు అందించిన ఏడురోజుల్లో తీసుకున్న పింఛన్ మొత్తం చెల్లించకపోతే ప్రభుత్వం నుంచి పొందుతున్న అన్నిరకాల లబ్ధిని నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనం.
-కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

