చెదురుతున్న డాలర్ డ్రీమ్స్!
భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ఐటీ రంగంలో ఏర్పడిన సంక్షోభం టెకీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త ఉద్యోగాలు దొరక్క ముఖ్యంగా తెలుగు యువత టెన్షన్ పడుతున్నది.
- అమెరికా ఐటీ రంగంలో సంక్షోభం
- లేఆఫ్స్ ప్రకటిస్తున్న దిగ్గజ కంపెనీలు
- పడిపోయిన కొత్త ఉద్యోగాల సృష్టి
- జాబ్స్ దొరక్క తెలుగువాళ్ల అవస్థలు
- ఏజెన్సీలకు చిక్కి అక్రమంగా జాబ్స్
- కేసుల పాలై జైలుకెళ్తున్న విద్యార్థులు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ఐటీ రంగంలో ఏర్పడిన సంక్షోభం టెకీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త ఉద్యోగాలు దొరక్క ముఖ్యంగా తెలుగు యువత టెన్షన్ పడుతున్నది. కొందరు విద్యార్థులు నకిలీ కంపెనీలకు చిక్కి కేసులపాలై జైలుకెళ్లాల్సిన పరిస్థితులు తెలెత్తున్నాయి. మరికొందరు కుటుంబాలు గడవడం కోసం చోరీలు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. చదువు, ఉద్యోగం నిమిత్తం 2022-23లో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. ఇందులో సుమారు 50 వేల మంది తెలుగువాళ్లు ఉన్నట్టు అంచనా. కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసి, మరికొన్ని కోర్సులు చదివి జాబ్ కొట్టి డాలర్స్ సంపాదించడం వీరి కల. కొవిడ్ కాలానికి నేటికీ మధ్యలో దాదాపు 85 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. లక్షల కొద్దీ ప్యాకేజీలు పొందారు.
కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను ఆపేసింది. పారిశ్రామిక రంగం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు ఆర్థికంగా చితికిపోయాయి. ఫలితంగా రుణాలివ్వడం ఆపేశాయి. 4% ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి పెంచేశాయి. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై పడింది. ఐటీ కంపెనీలకు ఒకసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటంతో ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం ప్రారంభించాయి. వేతనాలను తగ్గించేశాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్ (ఎక్స్).. ఇలా పెద్ద కంపెనీలు వేల మందిని ఉద్యోగులను తొలగించాయి. ఈ పరిణామాలన్నీ భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తిచేసినా ఉద్యోగాలు లభించడం లేదు.
కుటుంబం గడవడం కోసం నానాపాట్లు
అమెరికాలో రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం కొందరు హోటళ్లతోపాటు పెట్రోల్ బంకుల్లోనూ పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చాలని భయపడుతున్నారు. అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ని విడుదల చేస్తుంది. దీని ద్వారా మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలి. లేదంటే ఆ దేశాన్ని విడిచిపెట్టాలి.
అమెరికాలో తెలుగు భాషది 11వ స్థానం
2016 నాటికి అమెరికాలో తెలుగు వాళ్ల సంఖ్య 3.2 లక్షలు ఉండగా, 2024 నాటికి 12.3 లక్షలకు చేరింది. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నది. తొలి రెండు స్థానాల్లో హిందీ, గుజరాతీలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 భాషలు వాడుకలో ఉండగా, అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. ఏటా 60-70 వేల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. వీరితోపాటు సుమారు 10 వేల మంది హెచ్ 1బీ వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం పొందుతున్నారు.
నకిలీ కంపెనీలు నడుపుతూ జైలుకు..
ఐటీ రంగ సంక్షోభాన్ని, నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ కంపెనీలు సృష్టించి విద్యార్థులతో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఇలా ఎంఎస్ లేదా ఓపీటీ విద్యార్థులతో బలవంతంగా పనిచేయిస్తున్న నలుగురు తెలుగువాళ్లను (చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలె) తాజాగా ప్రిన్స్టన్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో సుమారు 100 అక్రమంగా పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. ఒకే ఇంట్లో 15 మంది యువతులను గుర్తించారు. ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లో నివాసాల్లో, అపార్ట్మెంట్లలో పెద్ద సంఖ్యలో యువతీ, యువకులతో బలవంతంగా పనిచేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి లాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు, పింటర్లు సహా కీలపత్రాలను సీజ్ చేశారు.
మూన్‌లైటింగ్ ఉద్యోగులతో..
అమెరికాలో ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేస్తున్నారు. ఆ అవకాశం లేనివాళ్లకు కొత్త ఉద్యోగం రావడం లేదు. ఇప్పుడు చాలా మందికి జాబ్స్ పోతున్నాయి. కొత్తవి రావడం లేదు. డిపెండెంట్ వీసాపై(హెచ్-4) వచ్చిన వారికి కూడా ఇప్పుడు వర్క్ పర్మిట్ ఇస్తున్నారు. తొలుత భర్త వర్క్ పర్మిట్ వీసా (హెచ్-1బీ)పై వచ్చి ఉద్యోగం చేస్తూ.. డిపెండెంట్ వీసాపై వచ్చిన భార్యకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నాడు. అలాంటి వాళ్లకు ఉద్యోగం రావడం లేదు.
-సందీప్ రాజనాల, అమెరికాలో ఐటీ ఉద్యోగి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

