హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్టీ నాయకులను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. మీ సేవ అనిర్వచనీయమని, మీలాంటి నిస్వార్థ సేవాతత్పరుల వల్ల మరింత మందికి సేవలు అందించే భాగ్యం తనకు కలుగుతుందంటూ ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో తోట చంద్రశేఖర్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వయంగా తోట చంద్రశేఖర్ కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. వంద మందికి పైగా ఈ రక్తదానం క్యాంపులో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని రక్త బంధంతో పెనవేశారంటూ తోట చంద్రశేఖర్ బృందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ అభినందిస్తూ, స్వయంగా సంతకం చేసిన ప్రశంసా లేఖను పంపారు. ఈ రక్త బంధాన్ని మరిన్ని ఏండ్ల పాటు కొనసాగిస్తూ మానవాళికి సేవ చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది.