బీజేవైఎం నేషనల్ మాజీ ట్రెజరర్ పీఎం సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. సాయి ప్రసాద్ ఐదు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండగా వాటిలో పొంగులేటి హర్షారెడ్డి కో డైరెక్టర్‌గా ఉన్నడు. మేకర్స్-ఐ, బయోనిక్ హామ్, జటాయు డ్రోన్స్, మరో రెండు కంపెనీల్లో వాళ్లిద్దరూ భాగస్వాములుగా ఉన్నరు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీజేపీ-కాంగ్రెస్ మధ్య పెనవేసుకొన్న అనైతిక బంధం మరోసారి ఇంకోరూపంలో బయటపడింది. బీజేపీ నాయకుడిని కాపాడటానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు వార్తలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ‘వ్యక్తిగత అవసరాల’ కోసం ఓ ఆడబిడ్డను, అందునా సొంతపార్టీకి చెందిన దళితబిడ్డను ఓ బీజేపీ నాయకుడు అంగడి సరుకుగా వాడుకోవాలనుకొన్నాడు. ఆ కీచకుడి వేధింపులను తట్టుకోలేని ఆ బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే, గత మూడు రోజులుగా ఆ యువతి న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఇటు ప్రధాన మీడియా గానీ పట్టించుకున్న పాపానపోలేదు. ఎందుకిలా? అని లోతుల్లోకి వెళ్తే, సంచలన విషయాలు బయటపడ్డాయి.
బీజేపీ అనుబంధ సంస్థలో కీలకంగా ఉన్న ఆ నిందితుడు, రాష్ట్రంలో నంబర్-2గా పిలిచే మంత్రి కుమారుడు.. ఇద్దరూ పలు కంపెనీల్లో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. ఇంకేముంది? సరిగ్గా రెండేండ్ల కిందట ఈడీ కేసులో తనను కాపాడిన సాయాన్ని గుర్తుచేసుకొన్నారో ఏమో.. ఇప్పుడు ఆ బీజేపీ నాయకుడిని, అందునా మంత్రి కొడుకు కంపెనీల్లో వాటాదారుగా ఉన్న ఆ నిందితుడిని ఈ కేసులో కాపాడటానికి ప్రభుత్వ పెద్దలు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐదారు నెలల కిందట కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసులో ఏ-1పై ముఖ్యనేత ఉదాసీనంగా వ్యవహరించి బీజేపీ మంత్రి కుమారుడికి కాపుగాస్తే, ఇప్పుడు ఈ కేసులో సదరు నేత తన పలుకుబడిని వాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా బీజేపీ నాయకుడి కోసం కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత పనిచేయడం, రాష్ట్రంలో ఇరుపార్టీల రహస్యబంధాన్ని బయటపెడుతున్నదని చర్చ జరుగుతున్నది.
భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మాజీ జాతీయ కోశాధికారి, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పీఎం సాయిప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అదే బీజేపీకి చెందిన మహిళామోర్చా సోషల్‌మీడియా కన్వీనర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2024 డిసెంబర్ నుంచి పలు సందర్భాల్లో సాయిప్రసాద్ తనను బెదిరించి, లైంగికంగా వేధించినట్టు ఆమె వాపోయారు. కుల ంపేరుతో దూషించాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఫిర్యాదు చేసి మూడురోజులు గడిచినప్పటికీ, నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడం, ప్రధాన మీడియా కూడా ఈ అంశాన్ని తొక్కిపెట్టడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అసలేం జరిగి ఉంటుంది? అనే కోణంలో లోతుగా విశ్లేషిస్తే, కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయిప్రసాద్‌కు, పారిశ్రామికవేత్త పొంగులేటి హర్షకు.. ఉమ్మడిగా మూడు కంపెనీల్లో వాటాలున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సాయిప్రసాద్‌ను కాపాడే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం లోని కీలక వ్యక్తులు ముమ్మరం చేసినటట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీఎం సాయిప్రసాద్, పొంగులేటి హర్షారెడ్డి ఇద్దరు వ్యాపార భాగస్వాములని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లో పొంగులేటి ఇండ్లపై ఈడీ దాడుల విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈడీ దాడులు జరిగి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే వాచ్‌ల కేసు, ఈడీ కేసుల నుంచి రక్షించింది పీఎం సాయిప్రసాదేనని తెలిపారు. పొంగులేటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఈడీ కేసును ఢిల్లీలో ఆయనే డీల్ చేశాడని, అందుకే ఇద్దరి మధ్య బంధం అంత బలంగా ఉన్నదని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. కాగా, తొలుత రౌడీషీటర్‌గా పలు కేసుల్లో నిందితుడైన సాయిప్రసాద్ అతితక్కువ కాలంలోనే బీజేపీ అనుబంధ సంస్థకు జాతీయ కోశాధికారిగా ఎదిగారని, ప్రముఖుల ‘వ్యక్తిగత అవసరాలను’ తీర్చడంలో ఈయన కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, 2007లో కాంగ్రెస్ అనుబంధ సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ)లో సాయిప్రసాద్ కీలక పాత్ర పోషించారు. అనంతరం బీజేపీలో చేరి అతి తక్కువ కాలంలోనే బీజేవైఎం జాతీయ కోశాధికారి స్థాయికి చేరారు. సాధారణంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు బీజేపీలో పెద్ద పదవులు ఇవ్వరు. కానీ, సాయిప్రసాద్ విషయంలో ఇది భిన్నంగా జరుగడమూ కొత్త చర్చకు తెరలేపింది.
సొంతపార్టీ ఆడబిడ్డపై కీచకపర్వం సాగించిన సాయిప్రసాద్.. సెలబ్రిటీలతో సంబురాలు చేసుకోవడం మాత్రం ఆపట్లేదని ఆయన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టులను బట్టి అర్థమవుతున్నది. సోమవారం తనపై ఫిర్యాదు నమోదైన రోజే సాయిప్రసాద్ ముంబైలో ఉన్నట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసానికి వెళ్లిన సాయిప్రసాద్ ఆ రోజు అక్కడే డిన్నర్ చేశారు. అంతేకాదు, సల్మాన్‌తో ఫొటోలకు పోజులిచ్చారు. అంతేనా, సల్మాన్ ఇచ్చిన ఆతిథ్యం గుర్తుండిపోతుందంటూ సాయిప్రసాద్ తన ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చారు. కాగా, సల్మాన్‌ఖాన్ మాత్రమే కాదు బీజేపీ అగ్రనేతలు, ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, విదేశాంగమంత్రి జైశంకర్, జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ నుంచి.. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను సాయిప్రసాద్ ప్రత్యేకంగా తన సోషల్‌మీడియా పేజీల్లో పోస్ట్ చేశారు. ఇదిలాఉండగా, గత ఆగస్టులో జరిగిన సాయిప్రసాద్ పెండ్లికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా హాజరై అభినందనలు తెలిపిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని నాచారం కార్తికేయనగర్‌లో జటాయు డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐఎన్: యూ29308టీజీ2019పీటీసీ136897) పేరిట ఓ కంపెనీ కొనసాగుతున్నట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులను బట్టి తెలుస్తున్నది. ఈ కంపెనీలో ప్రస్తుత నిందితుడు సాయిప్రసాద్ ఒక డైరెక్టర్‌గా (డీఐఎన్: 07894000) కొనసాగుతుండగా, మరో డైరెక్టర్‌గా (డీఐఎన్: 06550993) పొంగులేటి హర్షారెడ్డి ఉన్నారు. ఇక, జూబ్లీహిల్స్‌లోని కాల్ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐఎన్: యూ29309టీజీ2019పీటీ 136837)లో హర్షారెడ్డి ఒక డైరెక్టర్‌గా (డీఐఎన్:06550993) వ్యవహరిస్తుండగా, మరో డైరెక్టర్‌గా (డీఐఎన్: 07894000) సాయిప్రసాద్ కొనసాగుతున్నారు. ఇక, షేక్‌పేట కేంద్రంగా రిజస్టర్ అయ్యి ఉన్న మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐఎన్: యూ74999టీజీ2018పీటీ 122995)లో సాయిప్రసాద్ డైరెక్టర్‌గా (డీఐఎన్: 07894000) కొనసాగుతుండగా, ఆయనతో కలిసి హర్షారెడ్డి ఈ కంపెనీకి గతంలో డైరెక్టర్‌గా (డీఐఎన్:06550993) వ్యవహరించారు. ఇప్పుడు ఈ బంధం కారణంగానే సాయిప్రసాద్‌ను.. కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ మాత్రం మంత్రే సాయిప్రసాద్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నది.