BFHI | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలోని జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ’ గుర్తింపు దక్కింది. శిశువులకు పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించటం, కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగే లా అవగాహన కల్పించటం ద్వారా తల్లి పాల ను ప్రోత్సహించే దవాఖానలకు ‘బేబీ/బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్’ (బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్ అందజేస్తారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటెడ్ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం తల్లిపాల వినియోగం, శిశుమరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
ఖమ్మం ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడిటేషన్ రావడం హర్షణీయం. దవాఖాన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రభుత్వ దవాఖానలు ఈ గుర్తింపు సాధించటం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా నవజాత శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయి. – ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.
శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ 10 ప్రమాణాలను నిర్దేశించింది. మన దేశంలో తల్లిపాలను ప్రోత్సహించేందుకు ‘బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా’ (బీపీఎన్ఐ) 30 ఏండ్లుగా పనిచేస్తున్నది. కేంద్రప్రభుత్వం బీపీఎన్ఐతో కలిసి ‘మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్’ (మా) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. యూనిసెఫ్, బీపీఎన్ఐ, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) కలిసి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తల్లిపాలను ప్రోత్సహిస్తున్న దవాఖానలను గుర్తిస్తాయి. ఆయా సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం దవాఖానల్లో తనిఖీలు నిర్వహించి ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తాయి. ఉత్తమ సేవలు అందిస్తున్న దవాఖానలకు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటేషన్ ఇస్తాయి. ఈ సర్టిఫికెట్ కాలపరిమితి మూడేండ్లు.