హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు శుభముహుర్తాలు కలిసివస్తున్నాయి. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నాయి. ఏప్రిల్లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి ఇబ్బందులు పడ్డ సంస్థకు, ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతున్నది.
దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74% నమోదైంది. శుభముహూర్తాలు కొనసాగిన రోజుల వరకు ఆదాయం మెరుగ్గా ఉంటుందని, దీన్ని రానున్న వానకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది.