హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆసియా గేమ్స్‌లో పతకాల మోగించిన భారత ఆర్చర్లు, వరల్డ్ స్టార్లు హైదరాబాద్ గడ్డపై తమ బాణాలతో అభిమానులు అలరించిన వేళ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ గురువారం సందడిగా మొదలైంది. సాగర తీరాన పీపుల్స్‌ప్లాజా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేంజ్లో ప్రపంచ మేటి ఆర్చర్లు తమ గురితో అదరగొట్టారు. ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ మెగా లీగ్‌లో తెలంగాణ జట్టు కాకతీయ నైట్స్ ఓటమి అంచుల్లోంచి తేరుకొని అద్భుత ఆటతో శుభారంభం చేసింది. మొదటి రోజే షూటాఫ్‌కు దారి తీసిన మ్యాచ్‌లో కాకతీయ జట్టు 2-0 (4-4)తో మైటీ మరాఠాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
మరాఠాస్ తొలి రెండు సెట్లు గెలిచి 4-0తో ఆధిక్యం అందుకున్నా.. అద్భుతంగా పుంజుకున్న కాకతీయ తర్వాతి రెండు సెట్లను గెలిచి స్కోరు 4-4తో సమం చేసింది. విజేతను తేల్చుందుకు నిర్వహించిన షూటాఫ్‌లో నైట్స్ ఆర్చర్లు నికో వీనర్, నీరజ్ చౌహాన్ టార్గెట్ ఫేస్‌పై ఉన్న ఇన్నర్ ఎక్స్ రింగ్‌ను గురిపెట్టి కొట్టడంతో ఆ జట్టునే విజయం వరించింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ 5-3తో గత సీజన్ ఫైనలిస్ట్ పృథ్వీరాజ్ యోధాస్‌ను ఓడించింది. ఆ జట్టు కాంపౌండ్ ఆర్చర్లు ఓజస్ దియోతలే, ప్రపంచ నంబర్‌వన్ ఎల్లా గిబ్సన్ ఆరంభంలోనే వరసగా 10 పాయింట్ల బాణాలు విసిరి రాజ్‌పుతానా విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆసియా గేమ్స్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్, తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత ప్రాతినిథ్యం వహిస్తున్న చోళ చీఫ్స్ జట్టు తొలి రోజు నిరాశ పరిచింది. చికిత తన నాలుగు బాణాల్లో రెండు పర్ఫెక్ట్ 10 పాయింట్లు రాబట్టినా మిగతా ఆర్చర్లు కీలక సమయాల్లో తడబడటంతో చోళ జట్టు 3-5తో చీరో ఆర్చర్స్ చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో కాకతీయ నైట్స్- చోళ చీఫ్స్, రాజ్‌పుతానా రాయల్స్ -చీరో ఆర్చర్స్, మైటీ మరాఠాస్ -పృథ్వీరాజ్ యోధాస్ తలపడతాయి.
రికర్వ్, కాంపౌండ్ మెన్, విమెన్ ఆర్చర్లు కలిసి ఆడుతున్న ఏపీఎల్‌లో ఒక్కో జట్టులో నలుగురు ఆర్చర్లు (కాంపౌండ్ 2, రికర్వ్ 2) బరిలోకి దిగుతారు. లైనప్‌లో కనీసం ఒక విదేశీ ఆర్చర్ ఉండటం తప్పనిసరి. ఒక సెట్లో జట్టులోని నలుగురు ఆర్చర్లు రెండు చొప్పున 8 బాణాలు సంధిచాలి. ప్రతీ బాణానికి 15 సెకండ్ల సమయం ఇస్తారు. మొత్తంగా 2 నిమిషాల్లో 8 బాణాలు సంధించాలి. ప్రతి సెట్లో ఎక్కువ స్కోరు సాధించిన జట్టుకు 2 సెట్ పాయింట్లు లభిస్తాయి. సమమైతే చెరో పాయింట్ వస్తుంది. మొదటగా 5 సెట్ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గరిష్టంగా నిర్వహించే నాలుగు సెట్ల తర్వాత స్కోరు టై అయితే ప్రత్యేక టైబ్రేకర్‌తో విన్నర్‌ను తేలుస్తారు. ఒక్కో జట్టుకు నాలుగు షాట్లు ఇస్తారు. ఇందులో బోర్డు మధ్యలోని పసుపు చుక్కను కొడితే ఒక హిట్ పాయింట్ లభిస్తుంది. వేరే ఎక్కడ కొట్టినా మిస్ అయినట్టు లెక్క. షూటాఫ్‌లో ఎక్కువ హిట్స్ కొట్టిన జట్టు గెలుస్తుంది. ఒకవేళ నాలుగు షాట్ల తర్వాత కూడా స్కోరు సమంగా ఉంటే సడన్ డెత్ షాట్లో హిట్ కొట్టిన జట్టును విజయం వరిస్తుంది.

లీగ్ ఆరంభానికి ముందు ఇటీవల ఆసియా గేమ్స్‌లో పతకాలు నెగ్గిన భారత ఆర్చర్లను సన్మానించారు. రెండు స్వర్ణాలు గెలిచిన చికితతో పాటు కుంకుమ్, ధీరజ్, జ్యోతి సురేఖ తదితర ఆర్చర్లను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అర్జున్ ముందా, ఏపీఎల్ డైరెక్టర్ అనిల్ కామినేని, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించడంతో పోటీలు ఆరంభమయ్యాయి.