అక్కడ..భిక్షమెత్తేవారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పిల్లలు కలిసి ఆడుకొంటారు.బ్యాంక్ ఉద్యోగులు, ఇంటి పని మనుషుల పిల్లలు కలిసి పాడుతుంటారు.గుడిసెల్లో ఉండే పిన్నీసులు అమ్మేవాళ్లు, అపార్ట్మెంట్లో ఉండే గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలు కలిసి తింటున్నారిక్కడ! అంతరాలు మరపించిన అద్భుతం
ఈ చదువుల బడి! అది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పరిధిలోని అంగన్వాడీ స్కూల్!
‘సీతాఫలము.. ఎంతో బలము అందులో ఉన్నది తియ్యని గుజ్జు గుజ్జుని తిని.. నాలుగు గింజలు పాతేసి.. పాతేసి..మిగిలిన గింజలు విసిరేసి’..అంటూ పిల్లలు ఆడుతూ పాడుతుంటారు. అల్లరి చేసే పిల్లల క్రమశిక్షణ ఈ ఆటలో చూడముచ్చటగా ఉంటుంది! వినసొంపైన సంగీతం మరింత ఉత్సాహాన్నిస్తున్నది.ఆహ్లాదకరమైన పరిసరాలు.. శుభ్రమైన తరగతి గది.. ధారాళంగా గాలీ, వెలుతురు.. హైదరాబాద్‌లోని బడా కార్పొరేట్ ప్రీప్రైమరీ స్కూళ్ల కంటే అద్భుతంగా ఉన్నది ఈ అంగన్వాడీ స్కూల్! ఆ స్కూల్‌కి పొద్దున తొమ్మిదిన్నర గంటలకు కార్లలో,బైక్‌లపై పిల్లల్ని తీసుకొచ్చి ఆయమ్మకు అప్పగించే దృశ్యాలు ఆశ్చర్యపరుస్తాయి.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): అంగన్వాడీల్లో ఎక్కువగా పేదల పిల్లలే కనిపిస్తారు. చిరిగిన బట్టలు, చింపిరి జుత్తుతో ఉండే పేద పిల్లలే గుర్తుకొస్తారు. కానీ, సరస్వతీనగర్ అంగన్వాడీ స్కూల్‌ను చూసిన తర్వాత మన ఆలోచన మారిపోతుంది. కార్లలో వచ్చి బిడ్డను గేటు ముందు దింపే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు రోడ్లమీద బొమ్మలు అమ్ముకొనే రాజస్థానీ తల్లి కూడా బిడ్డను అందంగా ముస్తాబు చేసుకొని బడికి తీసుకొస్తున్న దృశ్యం కనిపిస్తుంది. తాను వీధుల్లో బొమ్మలు అమ్మేందుకు తీసుకొనిపోయే రిక్షాలోనే తన బిడ్డను తీసుకొస్తుంది. రోడ్ల వెంట భిక్షాటన చేసేవాళ్లు, పిన్నీసులు, రిబ్బన్లు, ఆటబొమ్మలు అమ్మేవాళ్ల పిల్లలు కూడా ముస్తాబై వస్తారు. ఈ అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ముగ్గురు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పిల్లలు ముగ్గురు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మధ్య తరగతి కుటుంబాల పిల్లలు పది మంది, వాచ్మెన్, ఇండ్లల్లో పనిచేసేవారి పిల్లలు పది మంది, భిక్షాటన, బొమ్మలు అమ్ముకొనే రాజస్థానీల పిల్లలు మరో పది మంది ఉన్నారు. వీళ్లంతా.. ఉతికిన బట్టలు కట్టుకొని, నున్నగా తలదువ్వుకొని, చక్కగా పౌడర్ రాసుకొని వస్తారు. చూడముచ్చటగా ముస్తాబైన ఆ పిల్లల ముఖాల్లో తల్లుల ప్రేమే కాదు- అంగన్వాడీ టీచర్ సంధ్యారాణి, ఆయమ్మ విజయలక్ష్మి ప్రేమ కూడా కనిపిస్తుంది. వాళ్లు పిల్లలకు చెప్పే మొదటి పాఠమే శుభ్రత. చేతులు కడుక్కోవడం, దుస్తులు మార్చుకోవడం లాంటి అలవాట్లన్నీ పాడిస్తూ, ఆడిస్తూ పిల్లలకు గుర్తుండిపోయేలా నేర్పిస్తారు.
ఆటలతో చదువులు
ఈ అంగన్వాడీ స్కూల్లో పిల్లల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంచేలా తరగతి గదిని నిర్వహిస్తున్నారు. మూడేండ్ల నుంచి అయిదేండ్ల లోపు పిల్లలు నేర్చుకోవాల్సినవన్నీ ఆటలు, పాటల రూపంలో నేర్పిస్తారు. అక్షరాలు, పదాలు, పద్యాలు, పాటలు నేర్పించడానికి పుస్తకాలే కాదు పెద్ద కలర్ టీవీ, ఆడియో, వీడియో సిస్టమ్ ఉన్నాయి. వీటితో పాటు బోలెడు ఆటబొమ్మలూ ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్యలో నేర్చుకోవాల్సిన అక్షరాలు, పదాలు, పజిల్స్, జంతువులు, పరిసరాలు, వస్తువులన్నీ ఈ బొమ్మల్లో ఉంటాయి. రంగురంగుల బొమ్మలను గీస్తూ రంగుల గురించి తెలుసుకున్నట్టే రకరకాల ఆటలాడుతూ భాషను పెంచుకొంటారు. అంగన్వాడీ టీచర్ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండటమే కాకుండా విద్యావిషయాల్లో మెరుగ్గా ఉండేలా శ్రద్ధ తీసుకొంటున్నారు. సంవత్సరంలో 20 కథలు, 30 పాటలు నేర్పిస్తారు. బయటి ఆటలు ఆడిస్తూ అంకెలు నేర్పిస్తారు. పిల్లల సంభాషణతో పరిసరాల విజ్ఞానం పెంచుతూ, పూర్ణ గణితాన్ని కంఠతా వచ్చేలా చేస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్తో బొమ్మలు గీయడం, రంగులు దిద్దడం, చుక్కలు కలపడం అన్నీ నేర్పిస్తున్నది టీచర్.
ఆరేండ్ల దాకా ఇక్కడికే
ఆటలాడి పిల్లలు అలసిపోతే మధ్యాహ్నం అన్నం పెడతారు. ఆడలేకపోయినా, అన్నం తినకపోయినా చెక్ చేసి ఒంట్లో రోగం కనిపెడతారు. అమ్మానాన్నని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లల ఎదుగుదల, అభ్యాసం బాగున్నాయని ప్రైవేట్ ప్రీప్రైమరీ స్కూల్స్‌కి పంపకుండా మధ్య తరగతి వాళ్లు కూడా తమ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పిల్లలు, అక్షరాలే తెలియని కూలీనాలీ చేసుకొనే వాళ్ల పిల్లల వరకు ఇక్కడికి వస్తున్నారంటే.. చదువే కాదు- శుభ్రత కూడా ఎంత బాగున్నదో అర్థమవుతుంది. పిల్లలు బడికిపోయే వరకు ఇక్కడికే పంపిస్తామని చదువుకొన్న తల్లులంతా చెప్తున్నారు.
దాతలే మార్గదర్శకులు
సీడీపీవో రమ మా అంగన్వాడీ కేంద్రాన్ని 2017లో దత్తత తీసుకొన్నారు. విద్యాబోధన ఎలా ఉండాలి? దానికి కావాల్సిన మెటీరియల్ ఏమిటి? ఎలా నిర్వహించాలి? అనేవి ఆమె గైడ్ చేస్తారు. క్లాస్రూమ్.. చిల్డ్రన్ఫ్రెండ్లీగా ఉండాలన్న ఐడియా ఆమెదే. కావాల్సిన మెటీరియల్‌ని సొంత డబ్బులతో కొనిచ్చారు. కొన్ని ఆటబొమ్మలు, విద్యాబోధనా ఉపకరణాలను కాలనీ సభ్యులు, పేరెంట్స్ ఇచ్చారు. పేపర్, పెన్సిల్, క్రేయాన్స్, కలర్స్ అయిపోతే కాలనీవాళ్లు కానీ, పేరెంట్స్ కానీ వెంటనే కొనిస్తారు.
– కే సంధ్యారాణి, అంగన్వాడీ వర్కర్, ఉప్పల్ సెక్టార్, అల్వాల్ ప్రాజెక్ట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
ప్రైవేట్ కంటే బెస్ట్!
నేను అకౌంటెంట్. మా ఆయన హెచ్‌డీఎఫ్‌సీలో మేనేజర్. మా అమ్మ, అత్తగారు పాపను అంగన్వాడీ స్కూల్‌కి పంపించవద్దన్నారు. పేదలే పోతారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్‌కి పంపించాలని సలహా ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్లో ఇంత ప్రాక్టికల్‌గా నేర్పించరు. ప్రైవేట్ స్కూల్ సిలబస్‌తో పోలిస్తే అంగన్వాడీలో నేర్పే పాఠాలే బాగున్నాయి. మా పాప అంగన్వాడీకి వెళ్లిన తర్వాత చాలా నేర్చుకొన్నది. చిన్న వయసులో ఇంత బాగా నేర్చుకొన్నదని అందరూ ఆశ్చర్యపోతున్నారు! – సంగీత, పేరెంట్
గుడిసెవాసుల పిల్లలకు వీళ్లే అమ్మలు
మేం చిన్న గుడిసెల్లో ఉంటాం. మాకు ఈ అంగన్వాడీ బడే పెద్ద దిక్కు. రోగమొచ్చినా, కష్టమొచ్చినా ముందుగాల చెప్పుకొనేది ఈడనే. నేను హరేక్ మాల్ (పది రూపాయల ఆటబొమ్మలు, వస్తువులు) అమ్ముతా. సీజన్లో బ్యాండ్ వాయిస్త. ఏ పనికి పోయినా మా పిల్లలందరినీ మా గుడెసెలోళ్లంతా ఈడనే వదిలిపెట్టి పోతరు. పిల్లల్ని ఈ అమ్మలే చూసుకుంటరు.
– జమ్మన్న
కేంద్రం వాటా 6 రాష్ట్రం వాటా 22
తల్లీబిడ్డలు, గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి 1న ‘ఆరోగ్యలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తల్లీబిడ్డలు, గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం రోజుకు ఒక్కొక్కరికి కేవలం ఆరు రూపాయలు కేటాయిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ.22 ఖర్చు చేస్తున్నది.ఈ పథకం కింద ఏడు నెలల నుంచి మూడేండ్ల లోపు పిల్లలకు రాష్ట్రంలో నెలకు 16 కోడిగుడ్లు, గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతీనెలా ఒకటో తేదీన అందిస్తున్నారు. మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజూ కోడిగుడ్డును అందిస్తున్నది. గుడ్డుతోపాటు ప్రతిరోజూ పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ అందిస్తున్నది.