హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నింటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చే అవకాశం ఉన్నదనే అంశంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ వివరాలు సేకరిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన కేంద్రాలు కాగా, 3,989 కేంద్రాలు మినీ అంగన్వాడీలుగా ఉన్నాయి.
మినీ అంగన్వాడీల్లో 3,160 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 42 పట్టణ ప్రాంతాల్లో, 787 కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని ఉన్నతీకరించేందుకు ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న జనాభా, లబ్ధిదారుల సంఖ్య తదితర 13 అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ నెల 15లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను స్త్రీ, శిశు సంక్షేమశాఖ కోరింది.