హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఒకేరోజు ఇద్దరు అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్టారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో కాగా, మరొకరు జీహెచ్ఎంసీలో టౌన్‌ప్లానింగ్ అధికారి. రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఒక ఫిజియోథెరపీ సెంటర్ నిర్వాహకుడి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆమెతోపాటు హెల్త్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, అతడి ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యను అరెస్టు చేశారు. మెహిదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న సునీత సోమవారం ఖైరతాబాద్ జోన్ కార్యాలయం బయట లంచం తీసుకొని, తన కారులో పెట్టిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రూ.6.5 లక్షలు స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేశారు.