వెల్దండ : వింత దూడకు గేదె జన్మనిచ్చింది. కానీ ఆ దూడ గేదె కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు ఉడుత మల్లేశ్ ఓ గేదెను పెంచుకుంటున్నాడు. ఆ గేదెకు ప్రసవం సమయం రావడంతో.. గురువారం రాత్రి బాగా ఇబ్బంది పడింది. దీంతో రైతు మల్లేశ్.. వెల్దండ పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాడు.
రాత్రి 2 గంటలకు సిబ్బంది గ్రామానికి చేరుకొని గేదెకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. అయితే గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఒక తల, 8 కాళ్లు, రెండు శరీర భాగాలతో పుట్టింది. దూడ ప్రాణాలు కడుపులోనే పోయాయి. జన్యుపరమైన లోపాలతో గేదె కవలలకు జన్మనిచ్చే ఆస్కారం ఉంటుందని వెల్దండ పశువైద్యాధికారి శ్యాంసుందర్ తెలిపారు. పిండ దశలో కవలల దూడలకు శరీర అవయవాలు సరిగ్గా విభజన జరగనప్పుడు శరీర భాగాలు ఇలా అత్తుకొని పుడుతుంటాయని చెప్పారు.