పెబ్బేరు, అక్టోబర్ 8 : వనపర్తి జిల్లా పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో గురువారం 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 16 మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి విద్యార్థినులకు భోజనంలో చికెన్ వడ్డించారు. తిన్న కొన్ని గంటల్లోనే తీవ్ర కడుపు నొప్పి, విరేచనాలకు గురయ్యారు.
విషయం బయటకు పొక్కకుండా వార్డెన్, ఆమె భర్త కొందరు విద్యార్థినులను దవాఖానకు తీసుకెళ్లారు. ఎవరైనా అడిగితే వైరల్ ఫీవర్‌గా చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం వెలుగుచూడటంతో స్థానిక నాయకులు, ప్రజలు దవాఖానకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది హాస్టల్లోనే ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు.
కడుపునొప్పితో మెలికలు తిరుగుతూ వారు పడుతున్న బాధను చూసి చలించిన మున్సిపల్ చైర్మన్ విద్యార్థినులను తన వాహనంలో దవాఖానకు తరలించారు. కళాశాలలో వైద్య శిబిరం నిర్వహించగా.. 22 మందికి వైరల్ ఫీవర్ ఉన్నదని తెలిసింది. అయితే ఈ శిబిరం గురించి తనకు తెలియదని వార్డెన్ పేర్కొన్నారు. రాత్రి వడ్డించిన చికెన్వల్లే ఈ అనర్థం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.