అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టింది. పంటలెండి కడుపు మండుతున్న రైతులపైనే అక్కసు పెట్టుకున్నది. కండ్లముందే పంటలెండుతుంటే కడుపుమండి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీళ్లు వదిలారన్న కక్షతో 14 మంది రైతులపై రేవంత్ సర్కార్ వనపర్తి జిల్లా అమరచింత పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలపైనా గద్వాలలో కేసులు నమోదు చేసింది. రైతులను అరెస్టు చేసి జైల్లో పెట్టేందుకు వారి ఇండ్ల వద్దకు పోలీసులను పంపి కసి తీర్చుకునేందుకు సర్కార్ కుట్రకు తెరతీసింది.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంటలకు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని 10 రోజులపాటు ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతాంగమే గత నెల 19న సాయంత్రం 6 గంటలకు డిస్ట్రిబ్యూటరీని తెరిచి తూములను ఓపెన్ చేసి కాలువలకు నీళ్లు వదులుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే
అధికారులు వచ్చి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ ఘటనలో ప్రభుత్వం ఏకంగా 14 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పె ట్టడం.. గురువారం ఉదయం నుంచి వారి ఇండ్ల చుట్టూ పోలీసులు తిరుగుతుండటంతో ఆ కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఇరిగేషన్ శాఖ ఈఈ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీంతో రైతులు కృష్ణారెడ్డి (వీరరాఘవాపూర్), రాజు(మోట్లంపల్లి), కురుమూర్తి(నందిమల్ల), జీఎస్ గోపి(అమరచింత), జబ్బార్, షరీఫ్(ములమల్ల), శేఖర్‌రెడ్డి(గుంటిపల్లి), దేవేందర్, టీ సమరసింహ, సద్దల భాను, వేణు, ఏటీ భాస్కర్, ఏటీ లక్ష్మణ్ (ఆరెపల్లి), ములమల్ల నరేశ్‌తోపాటు మరికొందరు అంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నిరసనకారులు రోడ్డు బ్లాక్ చేసి, అధికారులతో వాగ్వాదానికి దిగి, ఫోన్లు లాక్కొని, దుర్భాషలాడారని చేశారని, సాయంత్రం 6 తర్వాత కంట్రోల్ రూమ్ తలుపులు పగులగొట్టి, తాళా లు విరగ్గొట్టి, గేట్లను బలవంతంగా తెరిచారని, దానివల్ల స్క్రూ రాడ్లు వంగిపోయాయని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. రైతులపై బీఎన్ఎస్ 132, 308(2), 352, 221, 126(2), 329(3), 189(2), 191(2), 324(4) ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ & సెక్షన్-3 పీ డీపీపీ యాక్ట్ కేసులను నమోదు చేశారు. ఇప్పటిదాకా గోప్యంగా ఉంచి.. అదనుచూసి జైలుకు పంపాలని చూస్తున్నట్టు తెలిసింది.
వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతోనే నాడు రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీంతో గత నెల 19వ తేదీన సా యంత్రం 6 గంటలకు జూరాల ఎడమ కాలు వ హెడ్ రెగ్యులేటర్‌కు రక్షణగా ఉన్న గేటు తాళం పగులగొట్టి రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఏ ఒక్క అధికారి కూడా అక్కడ లేరు.
కనీసం నీళ్లు విడుదల చేయాలని ప్రాధేయపడటానికి రైతులు ప్రయత్నించినా అధికారులు ఫోన్లు ఎత్తకపోవడంతో రైతులు ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రాజెక్టులో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఉల్టా రైతులపైనే కేసులు నమోదు చేయడం దారుణమని మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహించే మక్తల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీంతో మంత్రి ప్రోద్బలంతోనే రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు న మోదైనట్టు రైతాంగం ఆరోపిస్తున్నది.
రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అదే సమయంలో రైతు లు జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. జమ్మిచేడు, ధరూర్ వద్ద రోడ్డుపై ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపైనా గద్వాల పోలీస్ యంత్రాంగం కేసులు నమోదు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రోద్బలంతో కాంగ్రెస్ రైతులను వదిలి బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన రైతులపై కేసును నమోదు చేయాలని వీడియోలను సాక్ష్యంగా పెట్టుకోవాలని అధికార పార్టీ నేతలు పురమాయించినట్టు తెలుస్తున్నది.
గద్వాల పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు సతీమణి బా సు శ్యామలతోపాటు అతిక్ రెహమాన్, ముని, బీచుపల్లి, మోనేశ్, సత్యరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమో దు చేశారు. అరెస్టు చేసేందుకు పోలీస్ యం త్రాంగం యత్నిస్తుండటంతో ఆందోళన చెంది న రైతు నాయకులు కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు. గద్వాల, అమరచింతలో రైతు లు, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు కావ డం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.