యాదాద్రి వైభవం
యుద్ధ ప్రకటన చేశాడు కానీ, విష్ణువర్ధనుడు ఆకస్మికంగా దాడి చేస్తాడని త్రిభువనుడు ఊహించలేదు. సంసిద్ధంగా లేని యుద్ధం కాబట్టి సరిహద్దు రక్షణ దుర్గాన్ని కోల్పోవలసి వచ్చింది. అటవీ ప్రాంతంలో మార్గమధ్యంలో రాత్రికి విశ్రమించిన త్రిభువనమల్లుడికి నిద్రపట్టడం లేదు.
ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక ధారావాహిక
జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే ఎన్నో మలుపులు. శత్రు రాజ్యం నుంచి కవ్వింపులు. పోరు తప్పదని అర్థమైపోతుంది. ఆ సంక్షోభ సమయంలో నారసింహుడు తన భక్తుడిని రక్షించుకున్న తీరు అమోఘం.
యుద్ధ ప్రకటన చేశాడు కానీ, విష్ణువర్ధనుడు ఆకస్మికంగా దాడి చేస్తాడని త్రిభువనుడు ఊహించలేదు. సంసిద్ధంగా లేని యుద్ధం కాబట్టి సరిహద్దు రక్షణ దుర్గాన్ని కోల్పోవలసి వచ్చింది. అటవీ ప్రాంతంలో మార్గమధ్యంలో రాత్రికి విశ్రమించిన త్రిభువనమల్లుడికి నిద్రపట్టడం లేదు.
ఇవే ఆలోచనలు..
మనం ప్రారంభించకపోయినా, మరొకడు యుద్ధానికి దిగితే.. అందులోకి అందరూ లాగబడతారు. అప్పుడు అది ప్రారంభించినవాడి చేతుల్లోంచి వెళ్లిపోయి, ఆరని కార్చిచ్చులాగా
మారిపోతుంది. ఆలోచనల మధ్యలో తన తాత్కాలిక శిబిరం నుంచి బయటికి వచ్చాడు త్రిభువనుడు. బయట కాపలా ఉన్న దళపతులు.. ప్రభువులవారు అలా ఆకస్మికంగా రావడం చూసి ఆశ్చర్యపడ్డారు.
“ప్రభూ!” అన్నారు ఆదేశాల కోసం.
త్రిభువనమల్లుడు వాళ్లకేసి చూశాడు.
“మేము నదీతీరం దాకా వెళ్లొస్తాం!”.
“ప్రభూ! ఈ సమయంలో మీరు ఒంటరిగా వెళ్లడం శ్రేయస్కరం కాదు. రక్షక భటులు, దళపతులూ వెంట లేకుండా..” అనంతపాలుడు ఈ మాటలంటూ ముందుకొచ్చాడు.
“రాజ్యానికి రక్షణ కల్పించాల్సిన రాజు, రక్షక దళాల నిర్బంధంలో బందీగా ఉండాలా అనంతపాలా!” అన్నాడు త్రిభువనుడు.
“రాజు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటుంది”.
“అనంతపాల సేనానీ, వాదాలు అవసరం లేదు. మమ్మల్ని మేము రక్షించుకోగలం..” అంటూ తల పంకిస్తూ, ముందుకు అడుగువేశాడు. దూరంగా ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపిస్తోంది.
“చూశావా అనంతపాలా.. ఎవరో దుఃఖిస్తున్నారు. వారి కష్టమేమిటో కనుక్కోవలసిన అవసరం లేదా?”.. ఆ ధ్వని వస్తున్న దిశగా నడుస్తూ అడిగాడు.
“ప్రభూ! మేమూ మీతో వస్తాము. మీరు అందుకు అనుమతించాలి”.
“సేనాధిపతీ, సైన్యమూ వెంటరావడం ఎందుకు? మేము వెళ్తున్నది యుద్ధానికి కాదు. వారి కష్టాలను తెలుసుకుందామని. ఈ దేశాన్నేలే మహారాజునని తెలిస్తే.. వారు అసలు విషయాలు చెప్పరు. వారిలో ఒకడిగా కలిసిపోయి వారి ఆవేదనకు కారణాలు కనుక్కుంటాను” అన్నాడు త్రిభువనుడు.
ఆ మాటతో అందరూ ఆగిపోయారు. అనంతపాలుడు ప్రభువుకేసి తేరిపార చూశాడు. నిజమే!
ఆయన ఒంటిమీద పంచె, ఉత్తరీయం తప్ప ఏమీ లేదు.
ఒక సామన్యుడిగా ఉన్నాడు.
ఇంక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆయనకు దారి ఇస్తూ అందరూ పక్కకు తప్పుకొన్నారు.
మసక చీకటిలోనే ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్న చోటుకు వెళ్లాడు.
ఒక చెట్టుకింద గుంపు కనబడింది.
ఆడవాళ్లు, మగవాళ్లు.. పిల్లా జెల్లా కలిసి దాదాపు ఓ యాభై మంది ఉన్నారు.
బిగ్గరగా ఏడుస్తున్న ఒక ఆడ మనిషిని పట్టుకొని ఓదారుస్తున్నారు.. పక్కనున్నవాళ్లు.
“మీరంతా ఎవరు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది?”. త్రిభువనుడి మాటలు వింటూనే వారంతా ఆయనకేసి చూశారు.
“మీరు ఎవరు?” అందులో ఒక పెద్దమనిషి అడిగాడు.
“నేను కూడా మీలానే.. భువనగిరి
సామ్రాజ్యంలో ఒక పౌరుణ్ని! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” ఆ యువతిని అడిగాడు.
“ఏడుపు కాక ఇంకేం మిగిలింది మాకు. అయినా కోటలో కూర్చున్న వాడికి బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందయ్యా! ఆయనను నమ్ముకొని మేం అన్యాయమై పోయాం”.
ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు.
“అదేమిటి? మన రాజుగారు త్రిభువనమల్లుడు ప్రజల రక్షణకే ప్రాధాన్యమిస్తాడు కదా! ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యం
అంటాడు కదా!”.
తన ఉనికి బయట పడకుండా అన్నాడు
త్రిభువనుడు.
“అనడం, అనుకోవడం వేరు. అది జరిగేలా చూడటం వేరు. యుద్ధాన్ని ఆపలేకపోయాడు కదా! మన రాజుగారు”. అందులో ఒక
పెద్దాయన అన్నాడు.
“చూడండయ్యా! మీరెవరో పెద్దవారిలా ఉన్నారు. రాజధాని నగరానికి వెళ్లినప్పుడు అక్కడి వారికి మా పరిస్థితి చెప్పండి. దేశానికి సరిహద్దు ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలే బూడిదై పోయాయని చెప్పండి. ప్రజలకు, వారి ఆస్తులకు , ప్రాణాలకు రక్షణ లేదనీ.. జీవితాలన్నీ గాల్లో దీపాలు చేశాడని ఆ
పుణ్యాత్ముడికి తెలియాలి” అంటూ దుఃఖం ఆపుకోలేక పోయిందొక మహిళ.
“ఏం జరిగింది?” అని మాత్రం అనగలిగాడు త్రిభువనుడు.
“ఏం జరగలేదు? అని అడగండి. దుర్గాన్ని నేలమట్టం చేసేశారు. గ్రామాలను తగులబెట్టారు. ఇండ్లనూ, ధాన్యపు రాశులనూ కాల్చేశాక, ఇక తినడానికి, ఉండటానికి ఏమీలేక ఇక్కడికొచ్చి పడ్డాం. అయినా ఆపద రాకుండా పరిపాలించాల్సినవాడు, ఆపదలో ఆదుకోలేనివాడు.. ఉన్నా లేకున్నా ఒకటేగా..” మరొకడన్నాడు.
“తప్పు.. రాజుగారిని అలా అనకూడదు” ఇంకొకాయన ఆ మాటలకు అడ్డు చెప్పాడు.
“ఏం చేయమంటావన్నా.. యుద్ధం అనేది ఎంత భయంకరమైనదో వీళ్లకు ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధం అనేది ఆదేశించిన వాడికి ఆవేశం.. అనుభవించినవారికి ఆవేదన! సైనికులు తెగించి పోరాడతారు. విజయమో, వీరస్వర్గమో అనుకుంటారు. చనిపోతే బతుకు ఉండదు. బతికి ఉంటే బాధ ఉండదు. కానీ, సైనికుల భార్యలు, పిల్లలు.. సైనికులు కాని సాధారణ పౌరులు వీళ్లందరి గతి ఏమిటి? ఊరికి ఊరు తగులబడి పోతుంటే ఉరికి పోయి ప్రాణాలు నిలుపుకోవడం కంటే.. ఊపిరిపోవడం ఉత్తమం అనుకుంటాం”.
“తప్పమ్మా! దేవుడు మనకు ఊపిరి ఇచ్చింది.. ఉన్నంత వరకూ గౌరవంగా ధైర్యంగా బతకమని!” అన్నాడు త్రిభువనుడు.
“కానీ, యుద్ధం అనేది దేవుడిచ్చింది కాదుగా!” అడిగిందామె.
“కాదు.. అహంకారంతో, ఆక్రమణ కాంక్షతో మేమూ మనుషులమే అని మరిచిన తెంపరితనంతో.. కొందరు కల్పించిన యుద్ధాలనే అగ్ని జ్వాలలకు అందరూ బలి అయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. నీళ్లలో పడ్డప్పుడే ఈత కొట్టాలి. ఆపదలో ఉన్నప్పుడే ధైర్యంతో ఉండాలి. మనుషులు విఫలం
అవుతారేమో.. మనం నమ్ముకున్నవాడు ఎప్పుడూ మనల్ని ఓడిపోయేలా చేయడు” అన్నాడు త్రిభువనుడు.
“చేశాడు కదా! మేం నమ్ముకున్న మా
మహారాజు!”.
“కానీ, ఆయన కూడా మరొక శక్తిని
నమ్ముకున్నాడు”.
“అవును. ఇప్పుడాయన నరసింహస్వామికి మహా భక్తుడట. ఆయన నమ్మిన వాడు ఆ దేవుడు. ఆయనకే అన్యాయం చేస్తే మనలాంటి సామాన్యులకు న్యాయం ఎవరు చేస్తారు?” దుఃఖంతో ఉన్న ఆ స్త్రీ ప్రశ్నించింది.
“మనం నమ్ముకున్న నరసింహుడు తోడుండగా, ఎప్పుడూ అన్యాయం జరగదమ్మా! పిల్లవాడు పిలిస్తేనే స్తంభం పగలగొట్టుకొని వచ్చినవాడు, పిల్లల్లాంటి మనం తలిస్తే.. మనల్ని కాపాడకుండా వదిలేస్తాడా? నమ్మకం అనేది గాలికి రెపరెపలాడే దీపంలా ఉండకూడదు. రాతి స్తంభంలా ఉండాలి. ఆయన తప్ప వేరే శరణమేదీ మనకు లేదనుకోవాలి. కష్టాలు ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కన్నీళ్లు ఆరిపోయేవే తప్ప ఎప్పటికీ కారిపోయేవి కాదు. మన బాధలు త్రిభువనమల్ల చక్రవర్తికి తెలియనివి కావు. కన్న కొడుకు కనిపించని వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న దేవుడే ఆయనను కరుణించాడు. ఈ సమయంలో కూడా..” అని చెప్తున్న త్రిభువనుడి
మాటలకు అడ్డొస్తూ..
“అన్నీ దేవుడే చూసుకుంటాడంటే, ఈ రాజ్యాలు, రాజరికాలు, సైన్యాలూ ఎందుకన్నా?” అన్నది ఆ స్త్రీమూర్తి.
“మంచిమాట అన్నావు. దేవుడిని నమ్ముకోవడం అంటే చేయాల్సిన విధులూ, బాధ్యతలూ అన్నీ వదిలేసి ఆధారపడటం కాదు. మట్టి, నీరూ
కలిస్తేనే విత్తనం మొలకెత్తుతుంది. శక్తి ఉన్నవాడికి భక్తి ఉంటే, అది నలుగురికీ ఉపయోగపడే మహాశక్తి అవుతుంది. మనం చేయవలసింది నూటికి నూరుపాళ్లు చేసిప్పుడు.. ఆ చేసింది సక్రమంగా జరగాలంటే, మంచి ఫలితం రావాలంటే, ఆ ఫలాలు అందరికీ అందాలంటే.. శక్తీ – భక్తీ కలిసిపోయి పనిచేయాలి” అన్నాడు త్రిభువనమల్లుడు.
ఆయన మాటలు అక్కడున్న అందరిలోనూ ఆలోచనలు కలిగించాయి.
“మీరన్నారు, బాగుందయ్యా! మరి మన రాజుగారు కోటలో కూర్చొని ఉన్నారు కదా! వారికి కదా చెప్పాలి. మాకు చెప్తే ఏం లాభం?” అడిగాడొక పెద్దాయన.
“నేను రాజధాని నుంచే వస్తున్నాను. కోటలో నాకు సన్నిహిత బంధువులున్నారు. వారి ద్వారా నాకు కొంత సమాచారం తెలిసింది. రాజుగారే స్వయంగా యుద్ధరంగానికి బయలుదేరారు. కొద్ది రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది”.
ఆ తెల్లవారుజామున ఆ ప్రదేశంలో ఆయన మాటలు తెరలు తెరలుగా ప్రతిధ్వనించాయి.
‘యుద్ధం ఆగిపోతుంది’ అన్న ఒక్కమాటతో వారందరిలో కొత్త ఆశలు చిగురించాయి.
‘యుద్ధం ఆగిపోతుందట!’
“ఇదిగో.. రాజధాని నుంచి ఇక్కడిదాకా వచ్చిన ఈ పెద్దమనిషి చెప్తున్నాడు. మీ నోటి పుణ్యాన అట్లనే కావాలె!” సంతోషంగా అన్నాడొకాయన.
“యుద్ధం ఆగిపోకపోతే.. ఎప్పటికీ అట్లనే ఉంటదా? కానీ, మనం గెలుస్తామా? అది చెప్పు అన్నా! మనం గెలుస్తామా?” రెట్టించి అడిగిందా మహిళ.
ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు త్రిభువనుడు.
గెలుస్తామా? గెలువలేక పోతామా?
ప్రయత్నం చేస్తాం. ఫలితం విరుద్ధంగా వస్తే ఏం చేస్తాం?
“గెలిచి తీరుతాం.. తల్లీ! ఇది నా మాట. నేను బతికి ఉన్నంత కాలం ఇచ్చిన మాటమీదే ఉంటాను. మాట తప్పాల్సిన పరిస్థితే వస్తే.. అప్పుడు నేనుండను!”.
త్రిభువనుడి మాటలు విని అక్కడున్న యాభై మందీ హర్షధ్వానాలు చేశారు.
ఆయన మాటలతో అందరికీ పోయిన ధైర్యం తిరిగొచ్చింది.
అప్పుడన్నది ఆ తల్లి.. కన్నీళ్లతో!
“అన్నా! మీ మాట నిజం కావాలె. నీకు రాజధాని పట్నంలో పలుకుబడి ఉన్నదంటున్నావు కదా! ఇదిగో.. నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు. పదహారేండ్ల పసివాడు. వీణ్ని తీస్కపో అన్నా! రాజుగారికి చెప్పి సైన్యంలో పెట్టించు. వీడుకూడా కొట్లాడుతడు. రాజ్యాన్ని గెలిపిస్తడు. రారా! మామవెంట వెళ్లు నాయనా..” అంటూ కొడుకును ముందుకు తోసింది.
కొడుకు చేతిని తీసుకొని త్రిభువనుడి చేతిలో ఉంచింది. ఆ దృశ్యం చూస్తూ తల
తిప్పుకున్నాడు త్రిభువనుడు.
రాతి గుండె తనది..
తను వేసే ఒక్క వేటుకు తలలు వరుసగా తెగి పడుతున్నా చలించని కఠినాత్ముడు తను!
కానీ, ఆ తల్లి మాటలకు హృదయం తల్లడిల్లిపోయింది. తన కంట చిప్పిల్లిన కన్నీరు.. మరొకరికి కనబడరాదని తల తిప్పుకొన్నాడు.
దేశాన్ని కాపాడేది దేశాన్నేలే రాజు మాత్రమే కాదనీ, ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషీ.. అని తెలుసుకున్నాడు.
ఈ తల్లి ఆత్మస్థయిర్యం ముందు ఎన్ని
అక్షౌహిణుల సైన్యం నిలబడగలదు?
ఈ సోదరికి తాను ధైర్యం ఇద్దామనుకున్నాడు. కానీ, ఈ మాతృమూర్తి తనకే ధైర్యం ఇచ్చింది.
“అమ్మా! నీకు వందనం! నీ నిబద్ధత – ధైర్యం మాకు ఆదర్శం. కానీ, ఈ పసివాడిని సైన్యంలో చేర్చుకోరమ్మా. అది నియమం. ఈ దేశం గెలుస్తుంది.. అని చెప్పడానికి ‘నా కన్న కొడుకు గెలిపిస్తాడు’ అని అన్నావు కదమ్మా! ఆ ఒక్కమాట చాలు. ఎందుకంటే ఈ రాజ్యాన్నేలే ప్రభువు కూడా నీ కొడుకులాంటి వాడేనమ్మా!” అంటూ వారికి నమస్కరించి వెనుదిరిగాడు.
అప్పుడొచ్చారు గుర్రాలమీద వేగంగా!
అనంతపాలుడు, ఇతర దళపతులు.
గ్రామస్తులు ఆశ్చర్యపోయి చూస్తుండగా,
వారందరూ గుర్రాలు దిగి, త్రిభువనుడికి
అభివాదం చేశారు.
ఆ వాతావరణం చూశాక ఈ మనిషి మామూలు పెద్దమనిషి కాదని వారికి అర్థమైంది.
అంతకుముందు మాట్లాడిన మాతృమూర్తి ముందుకొచ్చి..
“అయ్యా! మీరెవరు? చాలా పెద్దవారిలా ఉన్నారు. నా మాటలకు ఏమీ అనుకోకండి. తెలియక..” అనబోయింది.
ఆమె మాట ముగించక ముందే, త్రిభువనుడు ఆమెకు దగ్గరగా వచ్చి, దగ్గరికి తీసుకున్నాడు.
“అమ్మా! తల్లి కొడుకును ఆశీర్వదించాలి కానీ, మన్నించమని అడక్కూడదు. యుద్ధానికే
వెళ్తున్నాను..” అన్నాడు.
“ఒక్క క్షణం నాయనా!” అంటూ ఆ తల్లి చెట్టుకు కట్టి ఉన్న ఒక మూటను తీసుకొచ్చి, జాగ్రత్తగా ముడులు విప్పింది.
అందులో అన్నం కుండ!
“ఎప్పుడు తిన్నావో..” అంటూ ముద్ద కలిపి నోటికి అందించింది.
“తండ్రీ నరసింహా! ఇదే నీ ప్రసాదం” అంటూ కండ్లకద్దుకొని తిన్నాడు.
(మిగతా వచ్చేవారం)
– అల్లాణి శ్రీధర్
allanisreedharthewriter@gmail.com
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

