అది ఎవరు?
రాబోయే శతాబ్దంలో విరుచుకుపడే అవకాశమున్న మహమ్మారుల వివరాలతో పాటు వాటి విరుగుడు కూడా రాసి ఉన్న బంగారు పళ్లెం దక్కడంతో రుద్ర అండ్ టీమ్ అందరూ సంతోషించారు. ఇంతలో నవరత్నాలు అన్నీ కలిసి మరో మణిగా మారాయి. ఆ మణి కాంతిలో ఓ దైవవాణి ఇలా మాట్లాడింది.
చతుర్మహా వరాలు (ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా-8)
అద్భుతం వీరాధివీరా.. ద్వాపర యుగంలో మహిమాన్విత వరాల్లో ఒకటిగా పిలిచే శమంతకమణిని ప్రసన్నం చేసుకొని లోక వినాశనానికి కారణమయ్యే భయంకర వ్యాధులకు విరుగుడును సాధించావు. ఇట్లాగే మరో చతుర్మహా వరాలను సాధించే అవకాశం ఇప్పుడు నీకు ఉంది. ఈ పెట్టెలోనే దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. మేధోశక్తితో ముందుకు ధైర్యంగా అడుగేస్తావో.. లేక, శమంతకమణి ప్రసాదించిన దానితో సంతృప్తి చెందుతావో నీ ఇష్టం. మరో విషయం.. ధైర్యంగా అడుగు ముందుకేసి, ఓడిపోయావో.. శమంతకమణి ప్రసాధించిన బంగారు పళ్లెం కూడా సాధారణ కంచంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో!! సాహసం చేశావో సర్వం శుభం! అయితే, అతి విశ్వాసం కొన్నిసార్లు అనర్థదాయకం కూడా అవుతుంది.. నీ నిర్ణయాన్ని చంద్రకాంతులు భూమిమీద పడేకంటే ముందే తెలియజేయి’ అంటూ ఆ దివ్యవాణి ఆగిపోయింది.
దైవవాణి మాటలతో రుద్ర సహా టీమ్ సభ్యులందరూ నిశ్చేష్టులయ్యారు. హెడ్కానిస్టేబుల్ రామస్వామి మినహా మిగతా సభ్యులు తమకు తోచిన సలహాలు, సూచనలను ఇవ్వసాగారు. అయితే, మెజారిటీ సభ్యులు మాత్రం.. ఇక్కడితో ఆగిపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలో మౌనంగా ఉండిపోయిన రామస్వామిని చూస్తూ.. ‘బాబాయ్.. మీరు ఏం మాట్లాడరేంటీ?’ అన్నాడు రుద్ర. దీర్ఘంగా నిట్టూర్చిన రామస్వామి రుద్రతో ఇలా అన్నాడు. ‘సార్.. భగవద్గీతలో నిష్కామ కర్మను అనుసరించినట్టుగానే మీరు శమంతకమణి విషయంలో చేశారు. మనకు దక్కినది మనదని భావించకుండా, దానివల్ల లోకానికి మేలు జరిగితే అదే నిజమైన సంపద అని ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టే మీరు ఆచరించారు. అది కండ్లారా చూసిన నేను.. ఇప్పుడు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకొంటున్నా. అది కొందరికి నచ్చవచ్చు. మరికొందరికి నచ్చకపోవచ్చు’ అంటూ వేదాంతధోరణిలో మాట్లాడుతున్న రామస్వామిని చూస్తూ రుద్ర సహా అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు.
రామస్వామి కొనసాగించాడు. ‘సార్.. సాగర మథనంలో హాలాహలం ఉద్భవించినప్పుడు లయకారకుడైన ఆ పరమశివుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బిచ్చగాడినైన నేను ఖాళీ చేతులతోనే ఉన్నా. ఏమైనా అయితే అదే ఖాళీ చేతులతోనే వెళ్తా. అయితే, అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పి, కావాల్సినది లభిస్తే.. లోకకల్యాణమే కదా! అని అనుకొనే పరమశివుడు ఆ విషాన్ని తాగాడు. ఇప్పుడు కూడా మనం అదే చేద్దాం. ధైర్యంగా ముందుకు పోదాం. ఒకవేళ, విజయలక్ష్మి వరిస్తే, చతుర్మహా వరాలతో లోకాన్ని స్వర్గసీమగా మార్చొచ్చు. దురదృష్టవశాత్తూ అనుకొన్నట్టు జరుగకపోతే, మనకు పోయేది ఈ బంగారు పళ్లెమే కాదా! ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మనదగ్గర ఏమీలేదు కదా. అంటే కొత్తగా కోల్పోయేదేదీ లేదు’ అంటూ ఆగిపోయాడు. ఆ మాటలు వినగానే, రుద్రతో పాటు మిగతా టీమ్ సభ్యులకు ఏదో దివ్యమాయ కమ్మేసినట్టు అనిపించింది. ఇంతలో చంద్రకాంతులు భూమిమీద ప్రసరించడం ప్రారంభించాయి. రుద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకే వెళ్లబోతున్నట్టు ఆ మణి ముందు ప్రకటించాడు. అంతే ఆ మణి నుంచి దైవవాణి మళ్లీ ఇలా వినిపించసాగింది.
‘కార్యసాధకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. మంచిది. ఇక, తరువాయి కార్యాన్ని ప్రారంభించాలంటే ఈ మణిని ఆ పెట్టె మీద ఉంచుము. అనంతరం ఈ మణి అదృశ్యమయ్యి ఆ పెట్టె తెరుచుకొంటుంది. అందులో మహిమాన్విత పత్రం ఒకటి దొరుకుతుంది. కాలంతో రూపాన్ని మార్చుకొనే అలాంటి మరికొన్ని పత్రాలతో ప్రయాణిస్తూ.. లక్ష్యాన్ని చేరుకో.. సాధ్యపడకపోతే వచ్చినదారిన తిరిగిపో!’ అంటూ దైవవాణి ఆగిపోయింది. అర్థమయ్యీకానట్టు ఉండిపోయిన రుద్ర.. మరుక్షణంలో తేరుకొని, దైవవాణి చెప్పినట్టే ఆ మణిని పెట్టెపై పెట్టగానే.. దేదీప్యమైన కాంతులతో పెట్టె తెరుచుకొని మణి అదృశ్యమయ్యింది. అందరూ ఆశ్చర్యంతో పెట్టె లోపల తొంగి చూడగానే ఓ పత్రం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని రుద్ర చదివాడు.
‘పంచభూతాలతోనే మనిషి ప్రయాణం. అవిలేని నాడు ఈ ప్రాణికోటే లేదు. వాటిని సంరక్షించాలనే మా తాపత్రయం. అందుకే పంచ మహా వరాలను సాధించే మార్గాన్ని ద్వాపర యుగంలోనే నిర్ణయించాం. సజ్జనుల చేతికి వీటిని చేర్చాలనే ఇన్ని ఆటంకాలను సృష్టించాం. అందులో మొదటిదైన శమంతకమణి వరప్రసాదాన్ని ఇప్పటికే సాధించిన మీకు అభినందనలు. ఇక, మీరు సాధించాల్సిన చతుర్మహా వరాలు.. అక్షయాన్న పాత్ర, జల కలశం, భూకవచం, జ్ఞాన మణి. వాటిని దక్కించుకోవాలంటే, ఈ శ్లోకంలో దాగున్న నాలుగు ఆయుధాల పేర్లు చెప్పు. శ్లోకం ప్రారంభించగానే, ఒకవైపు మంటలు అంటుకొని ఈ పత్రం మసికావడం మొదలవుతుంది. మొత్తం పత్రం కాలిపోయే లోపు, ప్రశ్నను చదవడమే కాదు.. సమాధానమూ చెప్పాలి. ఇదిగో శ్లోకం.. ‘పార్ధుని పాణిలో ఒకటి శౌర్యానికి ప్రతీక. యాదవేంద్రుని కరంలో రెండుతో మరొకటి ధర్మానికి రక్షణ. ఒకటి నాదమై, మరొకటి వేగమై, ఇంకొకటి చక్రమై, మిగతాది శస్త్రమై.. ఆ చతుర్మహా అస్ర్తాలేంటో తెలియునా??’ అంటూ రుద్ర చదవడం పూర్తవ్వగానే 70 శాతం మేర పత్రం కాలిపోయింది. ఏంచేయాలో తెలియక, రుద్ర ఆలోచిస్తూనే.. ఆ నాలుగు అస్ర్తాల పేర్లు వెంటనే చెప్పాడు. అంతే, పత్రం పునఃరూపంలోకి మారిపోయి, కొత్తగా మరికొన్ని రాతలు కనిపించాయి. అదిపక్కనబెడితే, రుద్ర చెప్పిన నాలుగు అస్ర్తాల పేరేంటో మీరు చెప్పగలరా?
– రాజశేఖర్ కడవేర్గు
సమాధానం
పార్ధుడు అంటే అర్జునుడు అతని అస్త్రం.. గాండీవం, ఇక యాదవేంద్రుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన మూడు అస్ర్తాలు.. సుదర్శన చక్రం, సారంగం, పంచజన్యం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

