Metaverse | అనంత విశ్వంలో ఈ భూమి ఓ రేణువే కావచ్చు. కానీ దానిమీద బతికే మనిషి జీవితం మాత్రం వాస్తవమే కదా! కాలచక్రంతో పోలిస్తే అర్భక మానవుడి ఆయువు తక్కువే కావచ్చు. ఆ కాస్త సమయమూ విలువైనదే కదా! అందుకే మనిషి తన చిన్నపాటి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు ఎన్నో కలలు కంటాడు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నంలో అద్భుతాలు సాధిస్తాడు. దానికి మేధస్సే ఆయుధం. చేపను చూసి నావను తయారుచేసుకున్నా, పక్షిని చూసి రెక్కల విమానాన్ని రూపొందించుకున్నా… తన సృజనతో ప్రతి సవాలునూ దాటేస్తూ వచ్చాడు. ఆ ప్రయాణంలో ఇప్పుడు మరో మజిలీ చేరుకున్నాడు. భౌతికంగా తన పరిమితులన్నీ చెరిగిపోయే ఓ ఊహాలోకాన్ని నిర్మించుకుంటున్నాడు. అదే మెటావర్స్! అక్కడ మన ‘అవతారం’ ఉంటుంది. తోటి వ్యక్తులతో సంభాషించాలన్నా, జీవితకాలపు కలను నెరవేర్చుకోవాలన్నా, అందాల భవనాన్ని నిర్మించుకోవాలన్నా… అక్కడ సాధ్యమే! ఇప్పటికే ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. బడా సంస్థలన్నీ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు, పరిశోధనలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ కొత్తలోకం తీరేమిటో, అందులో ఉన్న లాభాలు, అనూహ్యమైన ప్రమాదాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.
వందేండ్ల క్రితం టెలివిజన్ గురించి చెబితే బడాయిలా అనిపించేది. యాభై ఏండ్ల క్రితం సెల్‌ఫోన్ లాంటి ఓ సాధనాన్ని ఊహించనైనా ఊహించలేం. అదే ఇప్పుడు, ఇవన్నీ లేని జీవితాన్ని కలలోనైనా ఊహించలేం. సాంకేతికత తీరే అది. ఇది అసాధ్యం అనుకున్నది సులువుగా కండ్ల ముందు నిలుపుతుంది. మెటావర్స్ కూడా ఇంతే! మన భౌతికమైన పరిధులన్నీ చెరిపేస్తూ మనసుకు ఎలా తోస్తే అలా విహరించే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ తరహా ఊహలు మనిషికి కొత్తేమీ కాదు. సూక్ష్మ శరీరాలతో కాలానికీ, ప్రాంతానికీ అతీతంగా ప్రయాణించే కథలు మనం వింటూనే వస్తున్నాం. కానీ సాంకేతికంగా ఇది సాధ్యమే అని ఊహించి రాసింది మాత్రం 1992లోనే. నీల్ స్టీఫెన్సన్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ‘స్నో క్రాష్’ అనే నవలలో కథానాయకుడు మెటావర్స్ ప్రపంచంలో తిరగడం గురించి చెప్పుకొచ్చాడు. ఆ పేరే ఇప్పుడు స్థిరపడిపోయింది. 2003లో అమెరికాకు చెందిన లిండెన్ ల్యాబ్ సంస్థ ‘సెకండ్ లైఫ్’ అనే డిజిటల్ లోకానికి ప్రాణం పోసింది. అది సాఫ్ట్వేర్ రంగం ఎగిసిపడుతున్న సమయం. ఒకవైపు కుబేరుడికే అసూయ పుట్టించే జీతాలు, మరోవైపు కెరీర్ పరుగులతో అలసిపోతున్న మనసులు. ఆ ఒత్తిడితో విసిగిపోయిన జనాలకు సెకండ్ లైఫ్ ఆలోచన తెగ నచ్చేసింది. తనకంటూ ఓ అవతారాన్ని ఏర్పాటు చేసుకుని… నచ్చిన బట్టలు వేసుకుని, మెచ్చిన మేడలు కట్టుకునే అత్యద్భుత ఊహాలోకానికి జేజేలు కొట్టారు. కానీ చాలా ఏండ్లపాటు దాన్ని ఒక ప్రయోగంగానో, కాలక్షేపపు అనుభవంగానో భావించారు.
‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు సిరీస్ గురించి వినే ఉంటారు. ఐఫోన్లో మెమోజీ అనే సాంకేతికతతో ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనల్ని పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. మెటావర్స్ సాంకేతికతకు ఇది తొలిమెట్టు మాత్రమే. మనల్ని పోలిన లేదా మనకు ఇష్టమైన ఓ రూపాన్ని సృష్టించుకుని మెటావర్స్‌లోకి అడుగుపెడతారు. ఇక బయటినుంచి ఆ పాత్రను నడిపించవచ్చు. మైక్రోఫోన్, మౌస్, కెమెరా లాంటి సాధారణ పరికరాలతోనే దాన్ని మాట్లాడించవచ్చు లేదా ప్రోగ్రామింగ్ చేసి వదిలేయవచ్చు.
ఇక వర్చువల్ రియాలిటీ పరికరాలు ఉంటే మెటావర్స్ పాత్ర మరింత సజీవంగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో స్పర్శానుభూతిని కలిగించే జాకెట్లు కూడా రానున్నాయి. భూగోళానికి రెండు వైపులా ఉన్న ఇద్దరు మిత్రులు ఈ జాకెట్లు ధరించి మెటావర్స్‌లో కలుసుకుని ఆలింగనం చేసుకోవచ్చు. కంట్లో కేవలం కాంటాక్ట్ లెన్స్ లాంటి అద్దాలు పెట్టుకుని… మెటావర్స్ దృశ్యాలను నేరుగా, స్పష్టంగా చూడగలిగే ప్రయోగాలు ప్రాథమికంగా విజయవంతం అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆన్లైన్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఎలా అయితే వస్తున్నదో… అలా మెటావర్స్ ద్వారా కుర్చీలో కూర్చునే జీవితాన్ని నడిపించే అవకాశమూ రానుంది.
ఓ వినోదంగా చూస్తే మెటావర్స్ పరిధి పరిమితమే! కానీ కాస్త సృజన జోడిస్తే దాని ఉపయోగాలు అనంతం…
జూమ్ జూమ్
కార్పొరేట్ ప్రపంచంలో చర్చలు, సమావేశాలదే ముఖ్యపాత్ర. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రణాళికలు రూపొందించేందుకు మేధోమథనమే మార్గం. ప్రస్తుతానికి ఆన్లైన్ సమావేశాలు ఇందుకు ఓ మార్గంగా ఉన్నాయి. వీటిలో ముఖాముఖి మాట్లాడుకునే అనుభూతి కలగదు. బోర్డ్ రూమ్‌లో కనిపించేంత స్థాయి భావోద్వేగాలు ఉండవు. కానీ మెటావర్స్‌లో అలా కాదు. అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది.
ప్రపంచ యాత్ర
లోకమంతా చుట్టి రావాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు? కాకపోతే కొంతమందికి ఉన్నచోటు నుంచి కదలాలంటే కంగారు. మరికొందరికి ఖర్చులు అడ్డు పడతాయి. కానీ మెటావర్స్‌లో మీ కండ్ల ముందు… వెన్నెల్లో తాజ్‌మహల్ సాక్షాత్కరిస్తుంది, పిరమిడ్ల మధ్య నడిచిన అనుభూతి కలుగుతుంది, అమెజాన్ అడవే పలకరిస్తుంది. అంతేకాదు, మిత్రులంతా కలిసి ఒకేసారి ఈ త్రీడీ ప్రదేశాల్లో విహరిస్తూ హడావుడి చేయవచ్చు.
విద్యాలోకం
తరగతి గదిలో కూర్చుని చరిత్ర పాఠాలు బట్టీపట్టాలంటే విసుగే. కానీ పక్కనే కూర్చుని పానిపట్టు యుద్ధాన్ని చూస్తున్న అనుభూతి కలిగితే! భౌతికశాస్త్రంలో కొరుకుడుపడని సూత్రాలను త్రీడీ రూపంలో కండ్లకు కడితే! మెటావర్స్‌లో తరగతి గదులు కాస్తా విజ్ఞానశాలలుగా మారిపోతాయి. ఇప్పటికే త్రీడీ రూపాల సాయంతో పాఠాలు చెబుతున్న ప్రయత్నం మొదలైంది. మెటావర్స్‌తో ఏకంగా అనుభూతి చెందుతూ నేర్చుకునే వెసులుబాటు వస్తుంది.
వ్యాయామం
ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టకుండా శారీరక శ్రమ చేయడం అంత సులభం కాదు. కానీ కొండను ఎక్కుతూనో, కత్తియుద్ధం చేస్తూనో, మైదానాల్లో పరుగులు తీస్తూనో.. ఎన్ని క్యాలరీలైనా ఖర్చు చేసుకోవచ్చు కదా! మెటావర్స్‌తో ఇది సాధ్యమవుతుంది. వినోదం, ఉద్వేగం, వ్యాయామం.. అన్నిటినీ ఒక చోటికి చేరుస్తుంది.
రియల్ ఎస్టేట్
సొంత ఇల్లు ఓ కల. కానీ దాన్ని నెరవేర్చుకోవడం అంత సులభం కాదు. అందుకోసం బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. ఇక ఓపిక లేక బోల్తాపడుతూ ఉంటారు. కానీ మెటావర్స్ సాయంతో కుర్చీలోంచి కదలకుండానే అందుబాటులో ఉన్న ప్రతి ఇంటినీ అణువణువూ పరిశీలించవచ్చు. నిర్మాణంలో ఉన్న సొంత ఇంటిని వర్చువల్ అద్దాల సాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. బిల్డర్‌కు తగిన సూచనలూ అందించవచ్చు.
షాపింగ్
ఆన్లైన్లో షాపింగ్ ఇప్పుడంత వింతేమీ కాదు. కానీ ఒక షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టడం, అక్కడ మీరు నడుస్తూ ఉంటే ఇరువైపులా రకరకాల వస్తువులు కనిపించడం, వాటిలో ఏదో ఒకదాన్ని చేతిలోకి తీసుకోగానే ధర, తయారీ, ముడిసరుకు తదితర వివరాలన్నీ కనిపించడం, నచ్చిన వస్తువును బుట్టలో వేసుకోవడం, తిరిగి కౌంటర్ దగ్గరికి రావడం తరహా అనుభూతి కలిగితే అదే మెటావర్స్ షాపింగ్.
వీడియో గేమ్
మెటావర్స్ వస్తున్నదంటే ఆన్లైన్ ఆటగాళ్లకు పండగే. ఇప్పటికే ‘యాక్సి ఇన్ఫినిటీ’ అనే వీడియోగేమ్తో ఈ అనుభూతి సాధ్యం అవుతున్నది. ఇందులో యాక్సిస్ అనే పాత్రలతో ఆటంతా సాగుతుంది. బాగా ఆడితే SLP, AXS అనే క్రిప్టోకరెన్సీ లభిస్తుంది. దాంతో యాక్సిస్లను పెంచుకోవచ్చు. లేదా ఇతరులకు అమ్ముకోవచ్చు కూడా! ఈ ఆటను రూపొందించిన ‘స్టూడియో స్కై’ అనే వీడియో కంపెనీ ‘యాక్సి ఇన్ఫినిటీ’తో వేలకోట్లు సంపాదించింది.
ప్రదర్శనలు
ఆ మధ్య మెటావర్స్‌లో జస్టిన్ బీబర్ ఇచ్చిన సంగీత ప్రదర్శన సంచలనం సృష్టించింది. ‘వేవ్’ అనే మెటావర్స్‌లో ఈ ప్రదర్శన నిర్వహించారు. వంటికి సెన్సర్లు అమర్చుకుని ఒక స్టూడియోలో బీబర్ పాడిన పాటను, ఆడిన ఆటను ఎంతోమంది అభిమానులు మెటావర్స్‌లో చూసి సంబరపడ్డారు. ఎలాంటి తొక్కిసలాటలు లేవు. స్టేజీకి దూరంగా ఉన్నామనే బాధా లేదు. ఇకపై సురభి నాటకాల దగ్గరినుంచి సంగీత కచేరీల వరకూ ఎలాంటి ప్రదర్శన, కళనైనా ఇలా ఆస్వాదించవచ్చు.
అకస్మాత్తుగా మనకు భూమిలాంటి మరో ప్రపంచం దొరికితే ఏమవుతుంది? అక్కడ ఉన్న వనరులన్నీ మనం ఆస్వాదించవచ్చు. మెటావర్స్ కూడా అంతే! పైన చెప్పుకొన్న రంగాలే కాకుండా, మన జీవితంలోని ప్రతి అంశాన్నీ మెటావర్స్‌తో అనుసంధానించి ఉన్నచోటు నుంచే మన ‘అవతారం’తో కావాల్సిన పనులు చేసుకోవచ్చు. ఉద్యోగులను అజమాయిషీ చేయడం మొదలుకొని, పొలం పనుల పర్యవేక్షణ వరకూ సాంకేతికతతో సకలం సాధ్యమే!
సామాజిక మాధ్యమం అంటే ఏదో ఒక్క సంస్థ మాత్రమే కాదు కదా! ఒక వ్యవస్థకు మనం ఎంచుకున్న పేరు. మెటావర్స్ కూడా అంతే. అది ఒక సాంకేతికత. దాన్ని నిజం చేసేందుకు రకరకాల సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ప్రతి సంస్థా తనదైన త్రీడీ లోకాన్ని నిర్మిస్తుంది. డీసెంట్రలాండ్, శాండ్బాక్స్, సోమ్నియమ్ స్పేస్, మెటాహీరో అలాంటి కొన్ని వేదికలు. వీటి ద్వారా మనం రకరకాల సేవలు వినియోగించుకోవడమే కాకుండా… దానిలో కొంతభాగాన్ని కొనుక్కోవచ్చు కూడా. ఒక ఊళ్లో కొంత భూమిని ఎలా అయితే కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటామో… అలాగే ఈ మెటా లోకాల్లో కూడా ఓ భవనం, ఆ భవనానికి కావాల్సిన వస్తువులు, లోపల అందమైన పెయింటింగ్స్, తిరిగేందుకు వాహనాలు, మన అవతారం ధరించేందుకు రకరకాల దుస్తులు, ఆభరణాలు.. అన్నీ సమకూర్చుకోవచ్చు. మెటావర్స్ లోకంలో ఉండే ఈ ఆస్తులను ‘నాన్ ఫంజిబుల్ టోకెన్స్’ (NFT) అని పిలుస్తారు. ఒకసారి వీటిని ఆ లోకంలోకి ప్రవేశపెట్టాక, అవి స్థిరాస్తిలా పనిచేస్తాయి. వాటిని ఎక్కడ ఉంచుతున్నాం, ఎవరికి బదలాయిస్తున్నాం అనే విషయాలన్నీ ఓ క్రమపద్ధతిలోనే సాధ్యమవుతాయి. ఇందుకు బ్లాక్‌చెయిన్ లాంటి అధునాతన సాంకేతికత సాయపడుతుంది. మెటావర్స్‌లో ఈ NFTలది చాలా పెద్ద వ్యాపారం. వాటిని కొనేందుకు ఇష్టపడేవారు ఉంటారు. ఉదాహరణకు విఘ్నేశ్ సుందరేశన్, ఆనంద్ వెంకటేశ్వరన్ అనే ఇద్దరు భారతీయులు కలిసి 50 కోట్ల రూపాయల విలువ చేసే NFT డిజిటల్ చిత్రాలను కొనుగోలు చేశారు. అందరూ ఈ NFTల గురించి ఇంతలా తాపత్రయపడుతున్నారు కాబట్టే, కొలిన్స్ నిఘంటువు ‘2021 సంవత్సరపు పదం’గా దీన్ని పేర్కొంది.
ఓ మెటావర్స్‌లో కొంతభాగాన్ని (భూమి) సొంతం చేసుకోవడం, అందులో ఉపయోగపడే NFTలను కొనుక్కోవడం ఓ వేడుక మాత్రమే కాదు… పెట్టుబడి కూడా! ఉదాహరణకు మనం మెటావర్స్‌లో కొంతభాగాన్ని తీసుకుని, దాన్ని అద్దెకు ఇవ్వవచ్చు. తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఆలోచన ఉండాలనే కానీ మెటావర్స్‌లో మన అస్తిత్వాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు మన అభిమాన నటుడిని నేరుగా కలవడం, తనతో గడపడం సాధ్యం కాకపోవచ్చు. అదే మెటావర్స్‌లో అయితే తన ‘అవతారం’తో కాసేపు సమయం గడపవచ్చు. తన ఇంట్లోకి ప్రవేశించవచ్చు. భవిష్యత్తులో సెలబ్రిటీలు ఇలా కూడా సంపాదించే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన ‘స్నూప్ డాగ్’ అనే గాయకుడు శాండ్బాక్స్ మెటావర్స్ లోకంలో ఓ స్థలాన్ని కొన్నాడు. అక్కడ ‘స్నూప్వర్స్’ పేరుతో వర్చువల్ కట్టడాలను నిర్మిస్తున్నాడు. అందులోకి ప్రవేశించి, తన ప్రదర్శనలు చూసేందుకు టికెట్ల అమ్మకం కూడా మొదలైంది. ఒక్కో టికెట్ ఖరీదు కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే! విచిత్రం ఏమిటంటే… ఈ స్నూప్వర్స్లో ఓ కట్టడాన్ని కొనుక్కునేందుకు తన అభిమాని ఒకరు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించారు!
మెటావర్స్‌లో వేర్వేరు సంస్థలు ఉన్నట్టే… వాటిలో ప్రతిదానికీ ఒక్కో కరెన్సీ ఉంటుంది. ఉదాహరణకు డీసెంట్రలాండ్లో నగదును ‘మానా’ అని పిలుస్తారు. శాండ్బాక్స్ మెటావర్స్ కరెన్సీ- శాండ్, సోమ్నియమ్ నగదు పేరు ‘క్యూబ్’. ఈ డిజిటల్ ద్రవ్యాలకు పాశ్చాత్యదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటి క్రయవిక్రయాలకు కాయిన్ మార్కెట్, కాయిన్‌బేస్, కాయిన్ కోడెక్స్ లాంటి ఎన్నో ఆన్లైన్ వేదికలు ఉన్నాయి.
మెటావర్స్ వినియోగదారులకే కాదు.. విద్యావంతులకు కూడా అవకాశమే! ఈ సాంకేతికతతో ఎన్నో రకాల ఉపాధి మార్గాలు సాధ్యం అవుతాయి. వర్చువల్ పరికరాలను రూపొందించే శాస్త్రవేత్తలు; బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లు; NFTలను డిజైన్ చేసే పరిశోధకులు; డిజిటల్ కళాకారులు; మెటావర్స్‌లో సైబర్ రక్షణ చూసుకునే నిపుణులు; అక్కడి డేటాని నియంత్రించేవాళ్లు; ఆ లోకాన్ని తీర్చిదిద్దేవాళ్లు… ఇలా సరికొత్త ఉపాధికి మెటావర్స్ వేదిక కానుంది. ఇప్పటికే ఈ రంగంలో నిపుణులకు గిరాకీ పెరిగిపోయిందనీ, వాళ్లకు మంచి జీతాలు లభిస్తున్నాయని సమాచారం!
రాబోయే కాలం మెటావర్స్‌దే అని సాంకేతిక లోకం నమ్ముతున్నది. ఫేస్బుక్ వ్యవస్థాపకులు జుకర్‌బర్గ్ తన సంస్థకు మెటా అని పేరు పెట్టడానికి కారణం ఇదే. తన ఆధీనంలో ఉన్న సామాజిక మాధ్యమాలకు మెటావర్స్ సూత్రాలను అమలుపరచాలనే ఆలోచన తనకు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి ఒక పరీక్షలో ఓ ఘోరం జరిగింది. నీనా జేన్ పటేల్ అనే వ్యక్తి తన అవతారంతో మెటాలోకి అడుగుపెట్టిన వెంటనే… అక్కడ కొందరు ఆమె ప్రతిరూపాన్ని లైంగికంగా వేధించారు. అత్యాచారం చేసి, ఫొటోలు తీసి ఆమెకు పంపారు. తన కళ్ల ఎదుటే… తన రూపానికి జరిగిన ఈ ఘోరాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యింది నీనా. ఈ ఘటన తన మనసు మీద చాలా ప్రభావాన్ని చూపించిందని వాపోయింది. ఇది మెటావర్స్కు మరోవైపు. ఆ స్వర్గపుటంచుల వెనుకే పాతాళమూ ఉందని గుర్తుచేసే మలుపు. ఇలాంటి మరికొన్ని భయాలు కూడా వినిపిస్తున్నాయి.
♦ చాలామందికి తమ రూపం పట్ల ఎంతోకొంత న్యూనత ఉంటుంది. మరింత తెల్లగానో, ఎత్తుగానో ఉంటే బావుండేదని అని అనిపిస్తుంది. అలాంటివాళ్లు తమకు ఇష్టమైన రీతిలో అందమైన అవతారాలను సృష్టించుకుంటూ… తమ మీద తామే ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది.
♦ భౌతిక ప్రపంచంతో పోలిస్తే మెటావర్స్‌లో రకరకాల సంపదలను, సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. క్రమంగా వాటి ఆకర్షణలో మునిగిపోయి ఆ ఊహా ప్రపంచంలోనే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్స్, టీవీ సీరియళ్లను మించిన వ్యసనంగా మెటావర్స్ మారే ప్రమాదం ఉంది.
♦ మెటావర్స్ కోసం వర్చువల్ కళ్లద్దాల లాంటి పరికరాలు ఉపయోగించాలి. ఈ కృత్రిమ పద్ధతుల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజూ అదే పనిగా త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి చూడండి!
♦ మెటావర్స్ మరో లోకం అనే మాటను పక్కనపెడితే… ఈ లోకాన్నే రెండుగా విభజించబోతున్నది. సాంకేతికత మీద పట్టున్నవాళ్లు, ఖరీదైన NFTలు కొనుక్కోగలిగేవాళ్లు ఒక వర్గంగా ఉండిపోతే, మిగతా జనం మరోవైపు మిగిలిపోతారు. నైపుణ్యాల పరంగా కూడా ఇది తీవ్రమైన వైరుధ్యాలకు దారితీస్తుంది.
♦ కంప్యూటర్ కనిపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అది భద్రలోకం కాదు. హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలతో మన డబ్బులు, వ్యక్తిగత వివరాలు అన్నీ ప్రమాదంలోనే ఉంటున్నాయి. అలాంటిది మెటావర్స్‌లోకి మోసగాళ్లు చొరబడితే!
♦ ఎంత అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించినా… మెటావర్స్‌లో కనిపించే అవతారాలు, వస్తువులు కృత్రిమంగానే ఉంటున్నాయి. ఇవి జీవితానికి దగ్గరగా అతి సహజంగా తోచేందుకు మరో దశాబ్దమన్నా పడుతుందని అంచనా!
మెటావర్స్ రూపకల్పనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్ర తక్కువేమీ కాదు. వీటి వినియోగదారుల్లోనూ మనవాళ్లు ఎక్కువే కనిపిస్తున్నారు. ఒక్క జనవరిలోనే మెటావర్స్ గురించి మన దేశంలో నాలుగు లక్షల ఆన్లైన్ చర్చలు జరిగినట్టు ఓ తాజా నివేదిక వెల్లడించింది. దీన్నిబట్టే మనదేశంలో ఈ మాట ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. హార్డీ సంధు మెటావర్స్‌లో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చిన భారతీయ గాయకుడిగా వార్తల్లో నిలిచాడు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా దలేర్ మెహంది కూడా పార్టీనైట్ అనే మెటావర్స్ వేదిక మీద పాటలు పాడాడు. తమిళనాడుకు చెందిన దినేశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెటావర్స్‌లో తన పెండ్లి రిసెప్షన్ ఏర్పాటుచేశాడు. అలాగని ఇవేవీ తూతూమంత్రంగా సాగుతున్న వేడుకలు కాదు. భోపాల్‌కు చెందిన అభిజిత్, సంస్రతి జంట చేసుకున్న మెటావర్స్ పెండ్లికి 500 మంది అవతారాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమానికి ఐటీసీ, మ్యాట్రిమోనీ.కామ్ వంటి దిగ్గజాలు ప్రకటనలు ఇవ్వడం విశేషం!
ఒకప్పటి సంగతి. ఏదైనా సాంకేతికతను లోకం అంతా ఆమోదించిన తర్వాతే, మన దేశీయ సంస్థలు రంగంలోకి దిగేవి. ఇప్పుడలా కాదు! భవితకు బాటలు వేస్తున్నది పక్కా భారతీయ కంపెనీలే. ఇప్పటికే టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి సంస్థలన్నీ మెటావర్స్ రూపకల్పనలో ఉన్నాయి. రకరకాల స్టార్టప్‌లు కూడా మొదలవుతున్నాయి. బాలీవుడ్ ప్రపంచానికి ఉన్న ఆకర్షణను ఉపయోగించుకుంటూ ‘బాలీ హీరోస్’ పేరుతో NFTలను రూపొందిస్తున్నారు. నిజ జీవితంలో కనిపించే ప్రాంతాల ఆధారంగా ‘లోక’ అనే వీడియో గేమ్ తయారవుతున్నది. హైదరాబాదుకు చెందిన ‘నెక్ట్స్ మీట్’ సంస్థ త్రీడీ సమావేశాలకు కావాల్సిన పరిజ్ఞానం సృష్టిస్తున్నది. జియో లాంటి బడా కంపెనీలు ఈ తరహా స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. మనం చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా చదువుకున్న ‘టింకిల్ డైజెస్ట్ ‘ గుర్తుండే ఉంటుంది. వాటిలోని సుపండి, షంబు షికారి లాంటి పాత్రలు సరదాగా ఉంటాయి. ఆ కథలను, పాత్రలను మెటావర్స్ ద్వారా అనుభూతి చెందే అవకాశం వస్తే! తెలుగువాడైన అభినవ్ వర్మ స్థాపించిన ‘ఐకాన్జ్’ అనే సంస్థ ఈ కలను నిజం చేసే ప్రయత్నంలో ఉంది. దీనికి రానా దగ్గుబాటి అండదండలు ఉండటం విశేషం.
ఇదీ మెటావర్స్ గురించి ఓ ప్రాథమిక పరిచయం. చెప్పుకొన్నంత సరళమైన లోకమేమీ కాదిది. ఇందులో సంక్లిష్టమైన సాంకేతికతలు ఎన్నో ఉన్నాయి. ఆ రంగంలో అనుభవజ్ఞులు మాత్రమే అర్థం చేసుకోగలిగే పదాలు కనిపిస్తాయి. అందుకే మెటావర్స్‌ను సామాన్యులు అంగీకరిస్తారా లేకపోతే ఈ బుడగ త్వరలో పేలిపోతుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇదో సరికొత్త ప్రపంచం. పట్టు సాధిస్తే ఓ కొత్త కెరీర్ అందిస్తుంది. జాగ్రత్తగా అడుగుపెడితే వింత అనుభూతులు కలిగిస్తుంది. ఔనన్నా, కాదన్నా మన నాగరికతలో మరో మజిలీగా నిలుస్తుంది.
Google Play Pass | రూ.99కే గూగుల్ ప్లే పాస్.. దీని వల్ల ఏంటి ఉపయోగం?
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు
అతి తక్కువ ధరకే ఐఫోన్ ఎస్ఈ 3 2022 ఫోన్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
ప్రపంచంలోనే తొలి ఎన్ఎఫ్టీ వెండింగ్ మెషిన్ ఏర్పాటు.. ఎక్కడ ఉందో తెలుసా?