మనం ఎవరితో సమయాన్ని గడుపుతామో, వారి ఆలోచనలు, ప్రవర్తన మన వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మన చుట్టూ ఉండేవారు మనల్ని ప్రోత్సహించే వారుగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ, టాక్సిక్ వ్యక్తులు మన సర్కిల్లో ఉన్నప్పుడు, అది మన మానసిక ప్రశాంతతను క్రమంగా దెబ్బతీస్తుంది. టాక్సిక్ వ్యక్తులు అంటే కేవలం శత్రువులు మాత్రమే కాదు; వారు స్నేహితులు, బంధువులు లేదా సహోద్యోగులు కూడా కావచ్చు. వారి విషయంలో నొప్పింపక, తానొవ్వక తప్పించుకోగలిగితేనే సంతోషంగా ఉండగలుగుతాం.
టాక్సిక్ వ్యక్తుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు : ఎప్పుడూ విమర్శించడం: మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడం. ఎమోషనల్ బ్లాక్మెయిల్: తమ పనులు చేయించుకోవడానికి మిమ్మల్ని దోషిగా ఫీల్ అయ్యేలా చేయడం. అసూయ: మీ విజయాలను చూసి సంతోషించకపోగా, వాటిని తక్కువ చేసి మాట్లాడటం. నెగెటివిటీ: ప్రతి విషయంలోనూ ప్రతికూలతను వెతకడం, మీ ఉత్సాహాన్ని నీరుగార్చడం.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఇలా.. ఆత్మవిశ్వాసం తగ్గడం: నిరంతరం విమర్శించే వ్యక్తుల మధ్య ఉండటం వల్ల, ‘నేను దేనికీ పనికిరాను’, ‘నేను సరిగ్గా చేయలేను’ అనే భావన మనలో బలపడుతుంది. ఇది మనం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అధిక ఒత్తిడి-ఆందోళన: టాక్సిక్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ మాట అంటే వారు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల మెదడు ఎప్పుడూ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఎనర్జీ డ్రెయిన్: కొంతమందితో మాట్లాడిన తర్వాత మనం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీనినే ‘ఎమోషనల్ డ్రైనింగ్’ అంటారు. వీరి ప్రతికూల ఆలోచనలు మనలోని ఉత్సాహాన్ని పూర్తిగా హరించేస్తాయి. ఒంటరితనం: టాక్సిక్ సర్కిల్లో ఉన్నవారు తరచుగా మనల్ని ఇతరుల నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మనకు నిజంగా సాయం చేసే వ్యక్తులకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
టాక్సిక్ వ్యక్తుల వల్ల కలిగే నిరంతర ఒత్తిడి మన మెదడు నిర్మాణం, పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనిని సైకలాజికల్ న్యూరోలాజికల్ కోణంలో పరిశీలిస్తే కొన్ని మార్పులు కనిపిస్తాయి..
మెదడులోని ‘అమిగ్డాలా’ భాగాన్ని మన బాడీకి ఉండే ‘అలారం సిస్టమ్’ అని చెప్పవచ్చు. టాక్సిక్ వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, మనం ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం లేదా విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతుంటాం. ప్రభావం: దీనివల్ల అమిగ్డాలా ఎప్పుడూ ‘హై అలర్ట్’ లో ఉంటుంది. ఫలితంగా చిన్న విషయాలకే చిరాకు పడటం, భయం వేయడం; ఎప్పుడూ ఆందోళనగా ఉండటం జరుగుతుంది.
నిరంతరం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ప్రభావం: శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగితే నిద్రలేమి, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. ఇది మెదడులోని కొత్త కణాల ఉత్పత్తిని కూడా అడ్డుకుంటుంది.
హిప్పోకాంపస్ అనేది మన జ్ఞాపకశక్తికి, నేర్చుకునే సామర్థ్యానికి సంబంధించిన ముఖ్యమైన భాగం. ప్రభావం: దీర్ఘకాలికంగా టాక్సిక్ వాతావరణంలో ఉండటం వల్ల, అధిక కార్టిసాల్ ప్రభావంతో హిప్పోకాంపస్లోని కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల విషయాలను గుర్తుంచుకోవడం కష్టమవడం, ఏకాగ్రత తగ్గడం వంటివి జరుగుతాయి.
ఈ భాగం మనకు నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి సాయపడుతుంది. ప్రభావం: ఒత్తిడి వల్ల ఈ భాగం సరిగ్గా పనిచేయదు. ఫలితంగా మనం సరిగ్గా ఆలోచించలేకపోవడం, భావోద్వేగాలను అదుపు చేసుకోలేక త్వరగా ఏడవడం లేదా కోప్పడటం వంటివి జరుగుతాయి.
మెదడు కొత్త పరిస్థితులకు అలవాటు పడే గుణాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. నిరంతర ప్రతికూలత వల్ల మెదడు కేవలం నెగెటివ్ ఆలోచనలు చేయడానికి మాత్రమే ‘వైర్’ అవుతుంది. అంటే, మనకు తెలియకుండానే మనం కూడా ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం లేదా నిరాశావాదంతో ఉండటం అలవాటు చేసుకుంటాం. టాక్సిక్ వ్యక్తులు కేవలం మన మూడ్‌ని మాత్రమే కాదు, మన మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తారు. అందుకే ఆ వ్యక్తులకు దూరంగా ఉండటం అనేది మన మెదడును రక్షించుకోవడానికి అవసరమైన ప్రాథమిక చికిత్స.
టాక్సిక్ వ్యక్తుల ప్రభావం నుంచి బయటపడి, మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. స్పష్టమైన హద్దులు నిర్ణయించుకోండి: టాక్సిక్ వ్యక్తులు తరచుగా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటారు. మనకు ఇష్టం లేని పనిని చేయమని వారు ఒత్తిడి తెస్తే, సున్నితంగా, స్పష్టంగా ‘లేదు’ అని చెప్పండి. వారితో గడిపే సమయాన్ని తగ్గించండి. వారి ఫోన్ కాల్స్‌కి, మెసేజ్‌లకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని గుర్తించండి. మీ స్పందనను నియంత్రించుకోండి: టాక్సిక్ వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టి, మీ నుంచి ఒక నెగటివ్ రియాక్షన్‌ను ఆశిస్తారు. వారు మిమ్మల్ని విమర్శించినప్పుడు, కావాలని గొడవకు దిగినప్పుడు కోపగించుకోకుండా శాంతంగా ఉండండి. మీరు స్పందించకపోతే, వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆపేసే అవకాశం ఉంది. వారితో మాట్లాడేటప్పుడు కేవలం ‘అవును’, ‘కాదు’, ‘సరే’ వంటి చిన్న సమాధానాలతో ముగించండి. మీ గురించి ఎక్కువ విషయాలు చెప్పకండి.
మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి: వారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఆ మాటలు నిజం కాదని మీకు మీరు చెప్పుకోవాలి. మీలోని మంచి లక్షణాలను, మీరు సాధించిన విజయాలను గుర్తుచేసుకోండి. మీకు నచ్చిన పనుల్లో (పుస్తకాలు చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి) నిమగ్నం అవ్వండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పరచుకోండి: ఒంటరిగా పోరాడటం కష్టం. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల తోడ్పాటు అవసరం. మిమ్మల్ని ప్రోత్సహించే, మీ ఎదుగుదలను కోరుకునే స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. టాక్సిక్ వ్యక్తుల వల్ల మీరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటే, కౌన్సిలింగ్ లేదా థెరపీ తీసుకోవడం వల్ల గొప్ప మార్పు వస్తుంది. వారు మీకు ఈ పరిస్థితిని ఎదుర్కొనే శాస్త్రీయ పద్ధతులను నేర్పిస్తారు. గుర్తుంచుకోండి, మీ మానసిక ప్రశాంతత కంటే ఏ వ్యక్తీ ముఖ్యం కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే, మీ చుట్టూ ఉన్న చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే.