Roof Cooling | వేడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఎయిర్ కండీషనర్లు, కూలర్లు ఉన్నప్పటికీ అవన్నీ కృత్రిమమైనవే అని ప్రజలు భావిస్తున్నారు. సహజంగా చల్లదనం కలిగించే ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాతకాలపు నిర్మాణ విధానమైన మట్టి కుండల పైకప్పులు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనానికి, తక్కువ ఖర్చుతో చల్లని వాతావరణాన్ని కలిగించడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మట్టి కుండల పైకప్పులు లేదా క్లే పాట్ రూఫింగ్ అన్నది పాతకాలపు విధానం అయినప్పటికీ, ఇవి ఇప్పుడు ఆధునిక జీవనశైలికి కూడా అనువుగా మారాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ప్రకృతితో కలిసిపోయే ఈ పద్ధతి పచ్చని భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నది. సహజంగా చల్లదనం కలిగించే ఈ తరహా ఇళ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఖర్చులను తగ్గిస్తాయి. ప్రకృతిని అభిమానిస్తూ… సహజ శీతలతను ఆస్వాదించడానికి ఇది చక్కటి మార్గం.
మట్టి కుండలను లేదా మట్టి పలకలను ఉపయోగించి నిర్మించే పైకప్పులను మట్టి కుండల పైకప్పులు అంటారు. పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పైకప్పులు ఎక్కువగా కనిపించేవి. ఇవి సహజ పదార్థాలతో తయారవుతాయి కాబట్టి పర్యావరణానికి హానికరం కావు.
మట్టి కుండల ప్రత్యేకత వాటి నిర్మాణంలోనే ఉంటుంది. మట్టి ఒక సహజ ఇన్సులేటర్. ఇది వేడిని నెమ్మదిగా గ్రహించి, నెమ్మదిగా విడుదల చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంటి లోపలికి వేడి త్వరగా చేరదు. ఇంకా, కుండల మధ్య ఉండే చిన్న గ్యాప్‌లు గాలి ప్రసరణకు సహాయపడతాయి. గాలి ప్రసరిస్తూ ఉండడం వల్ల వేడి బయటకు పోయి, లోపల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధానంతో ఎయిర్ కండీషనర్ అవసరం లేకుండా సహజంగా చల్లదనం లభిస్తుంది.

Pot Roof
మట్టి కుండల పైకప్పులను నిర్మించేటప్పుడు ముందుగా బలమైన సిమెంట్ లేదా కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. ఆపై ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి కుండలను వరుసగా అమర్చుతారు. కొన్ని సందర్భాల్లో కుండలను తలకిందులుగా అమర్చి, మధ్యలో గాలికి ఖాళీ ఉండేలా చేస్తారు. ఇది హీట్ ఇన్సులేషన్‌ను మరింత పెంచుతుంది. కొన్ని ఆధునిక డిజైన్లలో కుండలతో పాటు మట్టి పలకలు, జూట్ మెటీరియల్స్ కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో పైకప్పు మరింత బలంగా, అందంగా మారుతుంది.
ఇవి వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. మట్టి సహజ సిద్ధ పదార్థం కావడం వల్ల ఇది పర్యావరణానికి హాని చేయదు. కాంక్రీట్ లేదా ఇతర ఆధునిక కూలింగ్ సిస్టమ్స్‌తో పోలిస్తే ఈ విధానంలో ఖర్చు తక్కువగా ఉంటుంది. సహజ గాలి ప్రసరణ వల్ల లోపల గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. సరైన నిర్వహణ ఉంటే ఈ పైకప్పులు చాలా సంవత్సరాలు నిలుస్తాయి. అయితే ఈ పైకప్పులు నిర్మించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నాణ్యత గల మట్టిని ఉపయోగించడం, వర్షపు నీరు పోవడానికి సరైన డ్రైనేజ్ ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే లీకేజీ సమస్యలు రావచ్చు.
ప్రస్తుతం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ నేపథ్యంలో మట్టి కుండల పైకప్పులు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. నగరాల్లో కూడా చాలామంది ఈ మాడల్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ సంప్రదాయం విధానం స్మార్ట్ లివింగ్‌కు ఉదాహరణగా మారింది.