అన్నదమ్ముల పాక ప్రావీణ్యం.. తిమ్మాపూర్ గ్రామానికి జీవనాధారం
వంటపై ఒకరి ఆసక్తి ఓ కుటుంబానికి వారసత్వమైంది. ఆ కుటుంబం నేర్పిన విద్య.. ఓ గ్రామానికి జీవనాధారమైంది. అలా జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ నేడు నలభీమ వారసులకు కేరాఫ్‌గా పేరొందింది.
ఒక పొయ్యి వెలిగించిన ప్రస్థానం.. నేడు వందల కుటుంబాలకు జీవనజ్యోతిగా మారింది. ఏడున్నర దశాబ్దాల క్రితం ఓ భూస్వామి ఇంట్లో మొదలైన ఓ యువకుడి ప్రస్థానం, కాలక్రమంలో కళగా, వృత్తిగా, కుటుంబ వారసత్వంగా విస్తరించింది. ఆ గ్రామానికే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. కేవలం కడుపు నింపే వంటకాలను కాదు, తరతరాలకు ఉపాధినిచ్చే నైపుణ్యాన్ని, వందల కుటుంబాలకు బతుకుదెరువును అందించింది. ఒకరి ఆసక్తి ఓ కుటుంబానికి వారసత్వమైంది. ఆ కుటుంబం నేర్పిన విద్య.. ఓ గ్రామానికి జీవనాధారమైంది. అలా జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ నేడు నలభీమ వారసులకు కేరాఫ్‌గా పేరొందింది. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకూ రుచులు పంచుతూ, వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ… పొయ్యి పొగలోనే ప్రగతి బాటలు వెతుకున్న ఆ గ్రామం కథ ఇది!
డెబ్బై ఐదేండ్ల క్రితం… తిమ్మాపూర్ (జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం)లో వ్యవసాయ పనులు, కుల వృత్తులు చేసేవాళ్లే ఉండేవాళ్లు. ఈ ఊరిలో రాజేశుని పెద్ద నారాయణ అనే 18 ఏండ్ల యువకుడు మెగిలిపేటలో నివసించే భూస్వామి కల్వకుంట్ల వెంకట రాజేశ్వర్‌రావు ఇంట్లో వంట మనిషికి సహాయకుడిగా చేరాడు. కొద్ది కాలానికి మెలకువలు తెలుసుకుని తానే వండటం మొదలుపెట్టాడు. రెండుమూడేండ్లు గడిచే సరికే అతని చేతి రుచి మెచ్చుకునే వాళ్లు తప్ప వంక పెట్టిన దాఖలాలు లేవు!
రాజేశ్వరరావు రాజకీయ నాయకుడు కూడా. కాబట్టి ఆ ఇంటికి నిత్యం ప్రముఖులు వస్తూ ఉండేవాళ్లు. వాళ్లను చేయి కడక్కుండా పోనిచ్చేవాడు కాదు. అలా ఆ ఇంట ఎంగిలిపడిన వారంతా… నారాయణ చేతి వంటను వేనోళ్లా పొగిడేవాళ్లు. అంతేనా వాళ్ల ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా వంట కోసం నారాయణను పిలిచేవాళ్లు. అలా, ఒక ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిరిన నారాయణ వంట మాస్టర్‌గా మారిపోయాడు. ఉదయం చాయ్‌తో మొదలుపెట్టి రాత్రి వరకు రకరకాల వంటలు ఇంటిల్లిపాదికీ వండి వడ్డించేవాడు నారాయణ. పండుగలు, పుట్టిన రోజుల కోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేసేవాడు. రకరకాల దినుసులతో ఘుమఘుమలాడే వంటకాలను అతిథులకు రుచి చూపించేవాడు. శాకాహార, మాంసాహార వంటలు, చిరుతిళ్లు, తిను బండారాల తయారీలో ఆరితేరాడు. 25 ఏండ్లు వచ్చే సరికి పాకశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు.

Thimmapur Chefis
ఇంతింతై.. వంట మాస్టారై..
కొన్నాళ్లకు నారాయణ వంట మనిషి ఉద్యోగం వదలిపెట్టాడు. ఇద్దరు సహాయకులను పెట్టుకుని వంట మాస్టార్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. శుభకార్యమైనా, అశుభకార్యమైనా కార్యక్రమానికి తగ్గట్టుగా మెనూని సమయానికి సిద్ధం చేస్తూ అందరి మన్ననలూ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పేరు మారుమోగడంతో సుదూర ప్రాంతాల నుంచీ పిలుపొచ్చేది. పెద్ద వేడుకలకు తగ్గట్టు ఎక్కువ మంది సహాయకులు అవసరం పడేది. అప్పుడు తన అయిదుగురు తమ్ముళ్లతోపాటు ఇరుగుపొరుగు వాళ్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లేవాడు. ఒకరిద్దరు మూకుడు పని చేపడితే, మరో ఇద్దరు ముగ్గురు కూరగాయలు తరిగేవారు. సరుకులు సర్దడం, సామాన్లు అందించడానికి కొంతమంది ఉండేవారు. వంటల తయారీ, అతిథుల సంఖ్యను బట్టి సహాయకుల అవసరం పెరుగుతూ ఉండేది. కాబట్టి తన చేతికింద మనుషుల సంఖ్యను పెంచుకుంటున్న నారాయణ కొత్తవాళ్లను వంటపనిలోకి దింపుతూ పోయాడు.
ఆరితేరిన అన్నదమ్ములు
బాగా వండుతాడని నారాయణకు ఎంత మంచి పేరుందో అంత డిమాండ్ ఉంది. కానీ, పిలిచిన వారికల్లా వండిపెట్టలేకపోయాడు. ఆ అవకాశాల్ని వదులుకోకుండా ‘మీరూ వంట మాస్టార్లుగా మారాల’ని తన అయిదుగురు తమ్ముళ్లను ప్రోత్సహించాడు. తీపి కోసం చక్కెర, కమ్మదనం కోసం ఉప్పు, కారం, పులుపు తగుపాళ్లలో కలపడం, వంటకాలను అమృతతుల్యం చేయడానికి మసాలా దినుసులను సమపాళ్లలో జోడించడం నేర్పించాడు. అన్న అడుగుజాడల్లో నడిచారు తమ్ముళ్లు గంగారాం, బాజన్న, రాములు, చిన్న గంగారాం, భూమన్నలు. పాక ప్రావీణ్యం సొంతం చేసుకొని వాళ్లూ వంట మాస్టార్లుగా మారిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ‘వస్తే నువ్వు రా.. లేకుంటే నీ వాళ్లను పంపు’ అని నారాయణను అడుగుతుంటే కాదనకుండా తన తమ్ముళ్లను పంపేవాడు. ఆ తమ్ముళ్లు తమ పిల్లలను వంటలో సహాయకులుగా పెట్టుకుని కొత్త జీవితం ప్రారంభించారు. కొన్నాళ్లకు వాళ్లూ వంటమాస్టార్లుగా ఎదిగారు. వాళ్ల పిల్లలు సహాయకులుగా పని చేస్తున్నారు. ఇలా పెద్ద నారాయణ వంటల వారసత్వంలో నడుస్తూ ఆ కుటుంబంలో పద్నాలుగు మంది వంటమాస్టార్లుగా స్థిరపడ్డారు. మరెందరో సహాయకులుగా ఇందులోనే బతుకుదెరువు వెతుక్కున్నారు.

Chefs
కేరాఫ్ తిమ్మాపూర్
తిమ్మాపూర్‌లో వంట మాస్టార్లు పెరగడం, తిమ్మాపూర్ వంటమాస్టార్లకు డిమాండ్ పెరగడంతో వాళ్ల చేతికింద సహాయకులూ పెరిగారు. నారాయణ కుటుంబ సభ్యుల వంట బృందాల్లో చేరిన ఇతర కుటుంబాల వాళ్లూ వంట మాస్టార్లుగా ఎదిగారు. తిమ్మాపూర్‌కు, సమీప తండాల్లో ఇప్పుడు వంట మాస్టార్లే అరవై మందికి పైగా ఉన్నారంటే… నారాయణ నాటిన బీజం ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. వీరికి సహాయకులు వందల్లో ఉన్నారు. మెట్పల్లి, కోరుట్ల, నిజామాబాద్, జగిత్యాల, ఆర్మూర్ ప్రాంతాల నుంచి వందల మంది తిమ్మాపూర్ వంట మాస్టార్ల చేతికింద పనికి వచ్చి పనిలో పట్టు సాధించారు. వారంతా ఎక్కడెక్కడో నలభీములుగా స్థిరపడినా.. తమను తాము తిమ్మాపూర్ వంట మాస్టార్లుగానే పరిచయం చేసుకుంటారు.
ఎల్లలు దాటిన ఖ్యాతి
శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో తిమ్మాపూర్ నలభీములకు అస్సలు తీరిక ఉండదు. ముహూర్తాలు లేని రోజుల్లో.. పుట్టిన రోజు వేడుకలు, పూజలు, ఉత్సవాలు, రాజకీయ కార్యక్రమాలు, అశుభ కార్యాలు ఇలా ఏడాదంతా బిజీబిజీగానే ఉంటారు. మొదట్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోనే తిమ్మాపూర్ పాకయాజుల పేరు వినిపించేది. కాలక్రమంలో వీరి కీర్తి రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో తిమ్మాపూర్ వంట మాస్టార్ ప్రణీత్ తన చేతి మాధుర్యాన్ని వడ్డించాడు. ఫామ్ హౌజ్‌లో యాగం నిర్వహించిన సందర్భంలోనూ తనే వంటలు వండివార్చాడు. రాజకీయ సభలు, సమావేశాలు, నేతల ఇళ్లల్లో ఫంక్షన్లు కూడా తిమ్మాపూర్ వంటమాస్టార్లు లేనిదే జరగవు. తిమ్మాపూర్‌లో నేర్చుకున్న మాస్టార్లు కొందరు దుబాయ్, మస్కట్, బహ్రెయిన్‌లో వంట చేస్తూ ఉపాధి, గౌరవం పొందుతున్నారు.
ఈ టేస్టే వేరు
తిమ్మాపూర్ వంట మాస్టార్లు శాకాహారం వండినా, మాంసాహారం వడ్డించినా భోజన ప్రియులు వహ్వా అనాల్సిందే. నాటు కోడి కూర, నాటు కోడి పులుసు, కోడి గుడ్డు-చికెన్ మసాలా, బిర్యానీలు, పులావు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యాని, చికెన్ పులావ్, చికెన్ 65 బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ.. ఇట్ల ఏదైనా సరే దట్టించిన మసాలాతో హాట్ హాట్‌గా వడ్డిస్తారు! మాంసం కూరలే కాదు శాకాహార వెరైటీలకూ వీళ్లకు వీళ్లే సాటి. తెలుగింటి కూరలతోపాటు మష్రూమ్ బిర్యానీ, దమ్ వెజ్ పులావ్, జీరా రైస్, చట్నీలు, పచ్చళ్లతో షడ్రుచులు సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు!
మిఠాయి లేకుండా విందు భోజనం పూర్తవ్వదు కదా! తిమ్మాపూర్ వంట మాస్టార్లు తియ్యని తినుబండారాల తయారీలోనూ ఆరితేరారు. లడ్డు, బాదుషా, అరిసెలు, భక్ష్యాలు లాంటి సంప్రదాయ తీపి వంటకాలతోపాటు నైజాం నవాబ్ జమానాలో ప్రఖ్యాతి గాంచిన షాహీఖా తుఖుడా, బాస్మతి ఖీర్, ఖద్దుకా ఖీర్, డబల్ కా మీటా, ఖజూర్ కా మీటా, కుర్బానీ కా మీటా, డ్రై ఫూట్ ఖీర్, షీర్ ఖూర్మా లాంటి స్వీట్స్ అత్యద్భుతంగా చేసి పెడతారు.

Food Prepare
మా రెసిపీ మాదే
మా తిమ్మాపూర్ వంట మాస్టర్ల రెసిపీ మాకే సొంతం. ఇది ఎవరికీ రాదు… మా కుటుంబ సభ్యులకు, మా వద్ద పనినేర్చుకున్న వారికి ఈ రెసిపీ రహస్యం తెలుసు. ఈ వంటల తయారీ విధానం ఇలా ఉండాలని మా పెద్దవాళ్లు పుస్తకాలు రాయలేదు. వాళ్లను చూసి మేం నేర్చుకున్నాం.
– రాజేశుని బోజేందర్ (వంట మాస్టార్)
కుకింగ్ స్కూల్ పెడతా
మా కుటుంబం 70 ఏండ్లుగా వంట పనిలోనే ఉన్నది. మూడు తరాల ఇదే వృత్తి. సంప్రదాయ తెలంగాణ వంటకాల రుచి, మజా ఇప్పటి తరాలకు తెలియట్లేదు. కారణం వండేవాళ్లు లేకనే. అందుకే ఒక కుకింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దాని ద్వారా ఈ వృత్తిని భవిష్యత్ తరాలకు అందిస్తాం.
– రాజేశుని గంగాధర్ (వంట మాస్టార్)

Culinery Items

Curries

Boti
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

