తేనె తెలుగు పాటలో.. తీపి ఉర్దూ మాటలు!
‘జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యె’ దీపం నిరంతరం వెలుగుటకు జ్యాల (మంట) ఎంత అవసరమో. జీవితానికి ప్రేమ అంతటి అవసరం. ఇది మీర్జా అసదుల్లాఖాన్ గాలిబ్ ఉర్దూ గజళ్లకు దాశరథి చేసిన తెలుగు అనువాదం. గాలిబ్ మేలిముత్యముల వంటి గజళ్లలో ఎంపిక చేసి 407 తెలుగు పద్యాల్లో రాశారు దాశరథి.
దాశరథి సినీరంగంలోకి ప్రవేశించకముందే, అన్నపూర్ణ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావు, తరచు ఆకాశవాణికి వెళుతూ ఇతర సాహితీ మిత్రులతో పాటు దాశరథి కవితలు కూడా ఆస్వాదించేవారు. ఆయనే దాశరథిని అక్కినేనికి పరిచయం చేశారు. అలా బాపు ముఖచిత్రంతో ఎమెస్కో వారు ప్రచురించిన ‘గాలీబు గీతాల’ కావ్యాన్ని అక్కినేనికి అంకితమిచ్చారు. ఆ గీతాలలోని పారశీక కవితా శిల్పానికి ఎంతో ముగ్ధులైన దుక్కిపాటి తను తీయబోయే ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో పాటలు రాయాల్సిందిగా ఆహ్వానించారు. దాశరథి తొలుత సంశయించినా, తరువాత సమ్మతించి తన తొలి సినీ రచనకు ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. ఆ తరువాతే ఆత్రేయ ‘వాగ్దానం‘ చిత్రంలో రాయించుకున్నారు.
ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా దాశరథితో పాటు ప్రముఖ నటి శారద, ఇ.వి.సరోజ, మాటల రచయితగా కొర్రపాటి గంగాధర రావు పరిచయమయ్యారు. వీరితోపాటు సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వర రావు ఈ చిత్రంతో తొలిసారిగా అన్నపూర్ణలో అడుగు పెట్టారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కూడ ఇదే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్న ఇద్దరు మిత్రులు చిత్రంలో దాశరథి రాసిన రెండు పాటలూ హిట్ అయ్యాయి. దాశరథి తొలిసారిగా ఉర్దూ పదాలను ప్రయోగించి రాసిన,‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ హమేషా ఆపాతమధురంగా అలరిస్తుంది.
మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. హార్మోనియం ముందు రాజేశ్వరరావు కూర్చుని ‘దాశరథి సినిమా ఫీల్డుకు కొత్త కదా మరి ట్యూన్‌కు రాస్తాడో, లేడో’ అని సంశయించారు. ‘ట్యూన్‌కు రాయడం అంటే ఏమిటి?’ అని అడిగారట దాశరథి. ‘ఏం లేదండి.. నేను ‘తనా తనానా తన్ననా’ అంటే మీరు వాటి బదులు అవే అక్షరాలలో గురు లఘువులు మార్చకుండా అర్థవంతంగా, ఆకర్షణీయంగా రాయాలి’ అని ఒక చాలెంజ్ లాగ వివరించారు. దానికి దాశరథి ప్రశాంతంగా సరేనన్నారు. రాజేశ్వరరావు అమెరికన్ ఫోక్ బ్యాండ్ ది కింగ్ స్టన్ ట్రయో (1958)వారి ‘టామ్ డూలీ‘ పాటలోని హ్యాంగ్ డౌన్ యువర్ హెడ్ టామ్ డూలీ’ ఆధారంగా చేసిన ట్యూన్ ఇస్తూ,‘సార్, నా ట్యూన్ కొంచెం కష్టంగా ఉంటుంది.. ఫరవాలేదు రేపటి వరకు టైం తీసుకోండి’ అని అనగానే, దాశరథి కేవలం పది నిమిషాల్లోనే ఈ పాట రాసి ఇచ్చారు. దాంతో రాజేశ్వరరావు అక్షరాల లెక్క చూసుకొని ఎంతో ఉప్పొంగిపోయి, దుక్కిపాటితో ‘అమ్మో ఈయన అసాధ్యుడు సార్’ అని ప్రశంసించారు. ఈ గీతాన్ని ఘంటసాల, సుశీల పాడగా, తెరపై అక్కినేని ఇ.వి.సరోజ అభినయించారు.

Khushi Khushi Ga
పల్లవి:
ఖుషీ ఖుషీగా నవ్వుతూ-
చెలాకి మాటలు రువ్వుతూ
హుషారుగొలిపేవెందుకే-
నిషా కనుల దానా
చరణం 1:
మేనాలోన ప్రియునిజేర వెళ్లింది- నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం- పొంగిపొరలె నాలోన
చరణం 2:
ఒహో చెలియా నీవు కూడ-ఓ పెళ్లి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో-
వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు- మజ్నువవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా- లోకమే చీకటై పోవునే
చరణం 3:
ఆకాశంలో ఇంద్రధనస్సుపై- ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రథముపై- తేలిపోదామీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై-
కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై- ఏకమౌదమా తీయగా
కథాపరంగా నాయిక నాయకులు తమ ప్రణయం, పరిణయంగా మారే పరిణామాన్ని ఊహించుకొన్న తీరును దాశరథి రమ్యాతి రమ్యంగా అక్షరీకరించారు. వారిని పెళ్లి పల్లకి ఎక్కించి, తర్వాత నీలిమేఘాల రథం తేలించి ఇంద్రధనుసుపైన ఆడుకొన్నట్లు వర్ణించి దృశ్యమానం చేశారు.
‘ఖుషీ, నిషా, హుషారు’ వంటి ఉర్దూ పదాలతో పల్లవిని అల్లడమే ఓ ప్రయోగం. పాటంతా ‘మీనా,లోన, చూసుకో, వేసుకో’ మొదలైన పదాలతో అంత్య ప్రాస శబ్దాలంకార శోభితం. ఉర్దూ పదాలు వాడారు కాబట్టి, భగ్నప్రేమకు ఏ దేవదాసునో తీసుకోకుండా లైలా మజ్నూలనే పోలికగా ఎంచుకున్నారు. పాట చివరి చరణంలో ప్రేమికులు ఒకరినొకరు ప్రకృతిలోని అందాలతో, సంగీతంతో పోల్చుకుంటూ అభేదాన్ని (ఒకటే అనే భావాన్ని) వ్యక్తపరుస్తారు. ఇది రూపక, ఉపమాలంకార శైలికి అద్దం పడుతుంది. చంద్రుడు-వెన్నెల, వీణ-నాదం వంటి అందమైన పోలికలతో పాటను ఎంతో రసవత్తరంగా మార్చారు.
‘మేనాలోన ప్రియునిజేర వెళ్లింది – నా చెలి మీనా’ అనే పంక్తికి అర్థం ఏంటంటే హీరో చెల్లెలి పేరు మీన (శారద) ఆమె హీరోయిన్ (ఇ.వి.సరోజ) చెల్లెలు కూడా. ఆమె వైవాహిక జీవితం గాడిలో పడిందని, ఇక తమ పెళ్లి అంతా సానుకూల వాతావరణమేనని హీరోయిన్ సంతోషిస్తుంది. ఇదే సినిమాలో దాశరథి ‘నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి’ అని ఖవ్వాలి శైలిలో మరోపాట రాశారు. ఈ రెండు పాటలతో దాశరథి అన్నపూర్ణ వారికి ఆస్థాన కవి అయ్యారు. అటుపై దాశరథి వెనుతిరిగి చూసుకోలేదు.. ఓసారి ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ గారు పిచ్చాపాటి మాట్లాడుతూ, ‘ఉర్దూ శాయరీ ‘షహద్’ (తేనె)ని తెలుగు పాటలకు అద్దిన షీరీన్ కలాం షాయిర్’ (మధురకవి) దాశరథి!’ అని కితాబు ఇచ్చారు.
రచయిత డాక్టర్ వివి రామారావు.. దాశరథి సినీ గీతాలపై సమగ్ర పరిశోధన చేసి ‘మదిలో వీణలు మ్రోగే’ శీర్షికతో గ్రంథం రాశారు.
డాక్టర్ వి.వి. రామారావు
రచయిత, వ్యాఖ్యాత, గాయకుడు
9849237663
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

