టాలీవుడ్లో తెలుగు టాలెంట్ వెలిగిపోతున్నది. పరభాషా భామలు పెత్తనం చేసిన ‘టీటౌన్’లో.. ప్రస్తుతం లోకల్ టాలెంట్ హవా నడుస్తున్నది. ఇప్పటికే పలువురు తెలుగింటి అమ్మాయిలు అగ్ర కథానాయికలుగా
వెలుగొందుతుండగా.. శ్రీగౌరిప్రియ కూడా వారి సరసన చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. బాల్యంలోనే బుల్లితెరపై సందడి చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత యూట్యూబ్ వేదికగా మెరిసింది. అక్కడి నుంచి వెండితెరకు పరిచయమైంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న శ్రీగౌరి ప్రియ.. పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి..
ఇన్‌స్టాలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటా.
చిన్నప్పటి నుంచీ కల్చరల్ యాక్టివిటీస్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా పాల్గొనేదాన్ని. టీవీ యాంకర్‌గానూ పనిచేశాను. నేను మంచి గాయనిని కూడా! చిన్నప్పుడే ‘బోల్ బేబీ బోల్’ ప్రోగ్రాంలో పాల్గొన్నా. నాకు డ్యాన్స్ చేయడమన్నా చాలా ఇష్టం.
ఇంట్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతా! పెయింటింగ్ కూడా వేస్తుంటా! అడ్వెంచర్లు చేయడమంటే భలే సరదాగా ఉంటుంది. కుదిరినప్పుడల్లా స్కైడైవింగ్ చేస్తుంటా. అది నా మనసును ఎంతో రిఫ్రెష్
చేస్తుంది.
2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలవడం.. నా జీవితాన్ని మలుపుతిప్పింది. అక్కడి నుంచే సినీరంగంవైపు అడుగులు వేశాను. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్లే వచ్చేవి. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించా. అయితే అందులో నా పాత్రకు పెద్దగా గుర్తింపులేదు. ఆ తర్వాత కూడా ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లోనూ నటించా. 2021లో చేసిన ‘మెయిల్’ అనే వెబ్ సిరీస్‌లో మంచిపాత్ర పోషించా!
2023లో వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. తమిళ వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ చెన్నై’తో
కోలీవుడ్‌నూ పలకరించా! ఇక ‘మ్యాడ్’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన ‘శ్రుతి’ పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా! ఇప్పుడు ‘చెన్నై లవ్‌స్టోరీ’తో మరోసారి మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది. చెన్నై నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ఇది. ప్రతిఒక్కరి హృదయాన్ని స్పృశిస్తుంది.
ఫొటోగ్రఫీతో నన్ను నేనే మరిచిపోతా! ఇక ఏకాస్త ఫ్రీటైమ్ దొరికినా.. కెమెరా పట్టుకొని ప్రకృతిలో ఒడిలో వాలిపోతా! ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం సరదాగా ఉంటుంది.