తెలుగునాట రామయ్య పెండ్లి సంబురం మిథిల కన్నా మిన్నగా జరుగుతుందేమో! శ్రీరామనవమి వచ్చిందంటే చాలు.. ఊరూరా, వాడవాడలా.. రామకల్యాణోత్సవాలు కన్నులపండువగా సాగుతాయి. ఈ వేడుకలో త్యాగరాజు కృతులు, రామదాసు కీర్తనలు ముచ్చటగా వినిపిస్తాయి. వీటికి తోడు..ఓ గీతం తప్పకుండా వినిపించి తీరుతుంది. అదే.. ‘స్వాతిముత్యం’ సినిమా కోసం మన సినారె రాసిన ‘రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా’ గీతం. సీతాస్వయం వరం ఘట్టానికి తన పదాలతో పట్టం కట్టారు సినారె. హరికథ, చిరుతల రామాయణ విన్యాసాలతో సాగిపోయే మనోహర గీతాన్ని ఒకసారి చదివేయండి..“
మంచికి మారుపేరైన మనిషి కథే రామకథ! మమతల విలువలు తెలిపే మధురకథే రామకథ” అని ‘పల్లెటూరి చిన్నోడు’ కోసం రాసిన సినారె, మరోచోట “రాముడెప్పుడూ రాముడే! రఘురాముడెప్పుడూ రాముడే/ అయోధ్యలో తానున్నా! కారడవులలో పోతున్నా” అని చెబుతారు. సినారె నిత్య ప్రయోగశాలి, పద్యం మొదలుకుని గజల్, జావళీ, హరికథ, బుర్రకథ… ఇలా దాదాపు ముప్పై వరకు ప్రక్రియలు, రూపాల్లో సినిమాల కోసం రచనలు చేశారు. ఈ కోవలోనే సంగీత, సాహిత్య, నృత్య, అభినయ సమాహారమైన హరికథను రామకథా గానామృతంగా ‘స్వాతిముత్యం’ సినిమా కోసం రాశారు. కథా సంవిధానంలోని సన్నివేశానికి అనుగుణంగా చేసిన రచన ఇది. ఇందులోని ప్రధాన ఇతివృత్తం సీతా స్వయంవరం.
పల్లవి:
రామ కనవేమిరా.. ॥2॥
శ్రీ రఘురామ కనవేమిరా… రామ కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ.. ॥రామ॥
వచనం
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట/ జనకుని కొలువులో ప్రవేశించిన జానకిని… సభాసదులందరు పదే పదే చూడగ / శ్రీరామచంద్రమూర్తి కన్నెతి చూడడేమయా అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామ కనవేమిరా.. రామా కనవేమిరా..
శ్రీ రఘురామ కనవేమిరా… రామ కనవేమిరా
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు…
సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదృస విక్రములు…
సగరిగ మనిదమని
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు…
తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదృస విక్రములు…
తకఝుణు తకదిమితక
మీసం మీటే రోషపరాయణులు
నీ దమ పమా గరిగమ
మాసరి ఎవరను మత్తగులోల్గణులు ఆహా..
సినిమా కథ విషయానికి వస్తే గ్రామంలో జరిగే రామనవమి ఉత్సవాల సందర్భం లోనిది ఇది. అయితే ఈ గీతంలో అటు హరికథ, ఇటు చిరుతల రామాయణం రెండిటినీ ఒకే గీతంలో జుగల్బందీలాగా రాశారు సినారె. గమ్మత్తైన విషయం ఏమిటంటే హరికథలో కథను ముగించినచోట చిరుతల రామాయణం, చిరుతల రామాయణం ముగిసినచోట హరికథను ఎత్తుకుని దీనిని అత్యంత ఆసక్తి కలిగే విధంగా మలిచారు. “రామా కనవేమిరా..” అంటూ ప్రారంభమైన హరికథలో కథకుడు వచనంలో సందర్భానుసారంగా కథ చెబుతూ ప్రస్తావన చేస్తాడు. “సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట….” అంటూ మళ్లీ కీర్తన మొదలవుతుంది. రామచంద్రమూర్తి సీత వైపు కన్నెత్తి చూడడేమని సీతమ్మ చెలికత్తెలు అనుకుంటున్నారట. ఇందులో సీతా స్వయంవరానికి వచ్చిన రాజులను, వారివారి రూపాలను, ప్రవర్తనలను వర్ణించిన సినారె ఇందులో చక్కని స్వర జతులను ప్రయోగించారు. ఇది దీనికి లయాత్మక ఊనికతో పాటు విశేషమైన అందాన్నిచ్చింది. లయకు ఊనికనిచ్చిన ప్రాస ‘స’ కారం ఇందులో చూడవచ్చు. ఇంకా… ‘ఒసపరి చూపుల అసదృశ విక్రములు’ వాక్యం కవి మార్కు ప్రౌఢపద ప్రయోగానికి ఉదాహరణ. కిందివాటిలో ‘క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై’ అన్న వాక్యంలో ‘క్షణం నిరీక్షణం’ అన్న ప్రాసాత్మకత ఈ వాక్యానికి అందాన్నివ్వగా, ఇది మనకు కనిపించే సాధారణ జాతీయమే అయినా అతిశయోక్తి ఇది.
క్షణమే ఒక దినమై… నిరీక్షణమే ఒక యుగమైతరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరిచి చూడగ ॥రామ॥
అటు తరువాత మళ్లీ దరువులో రాసిన సినారె “ముందుకేగి విల్లందబోయి” అన్న దరువును అచ్చంగా చిరుతల రామాయణం పద్ధతిలో కూర్చారు. బహుశా ఇది ఆయనకు తన ఊరు అందించిన వారసత్వమే మరి. ఇవేకాదు ఎం.నారాయణశర్మ వంటి విమర్శకుల ప్రకారం సినారె గేయాల్లో కన్నడ షట్పదుల ఛాయలు కూడా కనిపిస్తాయి తరచి చూస్తే.
ముందుకేగి విల్లందబోయిముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు.. అహ గుండెలు జారిన విభులు విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు తమ వొళ్లు వొరిగి రెండు కళ్లు తిరిగి వొగ్గేసిన పురుషాఘనులు ఎత్తేవారు లేరా ఆ విల్లు ఎక్కుపెట్టేవారు లేరా ఆ.. ఎత్తేవారు లేరా విల్లు ఎక్కుపెట్టేవారు లేరా అహ ఎత్తేవారు లేరా.. ఆ విల్లు ఎక్కుపెట్టే..వారు లేరా..
తకతయ్యకు తాధిమితా శివధనుస్సును పైకెత్తడానికి రాజులు పడ్డ ప్రయాసను కవి చెబుతున్నారిందులో. తొడగొట్టి ఓడిపోయి వెనకకు వచ్చిన వాళ్లు, ‘వొళ్లు వొరిగి, కళ్లు తిరిగి వదిలేసిన’ వాళ్లు ఆ రాజకుమారుల్లో ఉన్నారు. దీనిలో ‘విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు’, ‘తమ వొళ్లు వొరిగి రెండు కళ్లు తిరిగి వొగ్గేసిన పురుషాఘనులు’ వంటి వాక్యాల్లోని ‘త’, ‘ళ’ ప్రయోగించి, లయ, వేగాన్ని చెప్పడం వంటివి సినారెకే చెల్లుతాయి.
‘అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీదా చెయ్యి వేసినాడు..
సీతవంక వోరకంట చూసినాడు.. ॥2॥
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు..
చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు.
పెళ పెళ.. పెళపెళ.. పెళ పెళ.. పెళ పెళ..
పెళ పెళ.. విరిగెను శివధనువు
కళలొలికెను సీతా నవవధువు’
పై దరువులో రాముడు లేచి విల్లు ఎక్కు పెడతాడు, శివుని విల్లు విరుగుతుంది. సీత ఆనంద పరవశంతో కథా భాగం ముగుస్తుంది. పై వాక్యాల్లో సినారె ప్రయోగించిన ‘విరిగెను ఒలికెను’, ‘ధనువు వధువు’, ‘పెళపెళపెళపెళ’ వంటి వాటిలో చక్కని ప్రాస కనిపిస్తుంది.
జయ జయ రామ రఘుకుల సోమ…
జయ జయ రామ రఘుకుల సోమ
దశరథ రామ దైత్యవిరామ..
దశరథ రామ దైత్యవిరామ….
సీతా కల్యాణ వైభోగమే..
శ్రీరామ కల్యాణ వైభోగమే ॥2॥
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమణీయమే
సీతా కల్యాణ వైభోగమే..
శ్రీరామ కల్యాణ వైభోగమే…
-పత్తిపాక మోహన్