శారంగం-అక్షయ తూణీరం
దైవవాణి సూచనల ప్రకారం.. వాన నీటిని తన ముఖానికి రుద్ర మర్దనం చేసుకోవడంతో గాండీవం తేలికపడింది. దీంతో గాండీవానికి నారి బిగించాడు రుద్ర. అనంతరం దైవవాణి మళ్లీ మాట్లాడుతూ.. ‘భేష్.. వీరాధివీరా.. అనుకొన్నట్టుగానే, సరిగ్గా సమాధానాలు చెప్పావ్. ఇక, గాండీవం ద్వారా జలకలశం నీ సొంతం కావాలంటే, ఆ పదునైన అక్షయ తూణీరాలతో (బాణాలతో) నీ ముఖాన్ని ఛిద్రం చేసుకో!’ అంటూ రుద్రతో దైవవాణి పలికింది.
అది ఎవరు?.. ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా-10
దీనికి అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ‘సార్.. ఏంటి సార్ ఇదంతా? నేనిచ్చిన పిచ్చి సలహా వల్లే ఇదంతా జరిగిపోయింది. మీ ముఖాన్ని ఛిద్రం చేసుకోవడమేంటి సార్..?’ అంటూ రామస్వామి ఏడుస్తూ కూలబడ్డాడు. అసలేం జరుగుతున్నదో అర్థంకాక మిగతావారందరూ టెన్షన్‌తో భయపడిపోతున్నారు. రుద్రకు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ మాట్లాడిన దైవవాణి.. ‘వీరా..ఈ కార్యసాధనలో ఇప్పుడు వెనుదిరిగినా, ధైర్యంతో ముందుకు పోయి ఓడిపోయినా.. శమంతకమణి ప్రసాదించిన బంగారు పళ్లెం కూడా సాధారణ కంచంగా మారిపోతుంది. ఈ విషయాన్ని ముందే నీకు హెచ్చరించా. బంగారు పళ్లెం దక్కలేదంటే, భవిష్యత్తులో లోక వినాశనానికి కారణమయ్యే భయంకర వ్యాధులకు విరుగుడు నీకు దక్కదు. ఇది జరగకుండా ఉండాలంటే, ధైర్యంగా ముందుకు అడుగువేసి నీ ముఖాన్ని, కండ్లను, ముక్కును, పెదవులను, దంతాలను ఈ పదునైన అక్షయ తూణీరాలతో ఛిద్రం చేసుకొని జల కలశాన్ని, దాని ద్వారా అక్షయాన్న పాత్రను గెలుచుకో.. లేదూ.. ప్రాణంపై తీపితో వెనుదిరిగి పోతాను అంటావా?? మహిమాన్విత బంగారు పళ్లేన్ని కూడా మరిచిపో. ఇక నిర్ణయం నీదే! పది నిమిషాల్లో ఈ కార్యాన్ని పూర్తిచేయాలి’ అంటూ దైవవాణి మళ్లీ ఇలా కొనసాగించింది.
‘వీరా.. ముందు శారంగం గురించి చెప్తా విను. శారంగానికి సారంగం, శార్ఙం అని కూడా పేరు. విశ్వకర్మ రూపొందించిన ఈ విల్లు ఆ శ్రీమహావిష్ణువుకు అలంకారంగా మారింది. లంకేశ్వరుడిని సంహరించడానికి ఆ శ్రీరామచంద్రుడికి ఈ విల్లే సాయపడింది. ఇప్పుడు భవిష్యత్తులో సంభవించే ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ఈ విల్లే మహా ప్రసాదంగా మారబోతున్నది. ఎన్నటికీ క్షీణించని మహిమాన్విత అక్షయ తూణీరాలను ఈ విల్లు సాయంతో ఎక్కుపెట్టి నేలపై సంధించు. అనంతరం అక్కడ పడే రాతలే, భవిష్యత్తు ఆహార సంక్షోభాన్ని నివారించే అన్నపూర్ణాదేవి చేతిగీతలుగా భావించు. ఆ రాతలను భద్రపరుచుకో. రెండో వరం జలకలశం తర్వాత ఇదే నీకు దక్కే మూడో వరం. అయితే, ఇవి నీకు దక్కాలంటే, నీ ముందున్న కార్యాన్ని పూర్తి చెయ్యి’ అంటూ దైవవాణి ఆగిపోయింది.
అటు దైవవాణి మాట్లాడటం ఆపేయగానే.. ‘ఒరేయ్.. బంగారు పళ్లెం వద్దూ.. ఏమీ వద్దూ.. మిగతా అస్ర్తాలూ అవసరం లేదు. అయినా, ఈ ప్రపంచానికి ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే, పరిష్కార మార్గాలు చూపడానికి సైంటిస్టులు ఉన్నారు. దానికోసం నువ్వు పిచ్చి పనులు ఏమీ చేయొద్దు’ అంటూ ఆవేదనతో కాస్త కఠినంగానే తన నిర్ణయాన్ని చెప్పింది జయ. మిగతావారు కూడా దాదాపుగా ఇదే తమ అభిప్రాయమంటూ చెప్పారు. ఇంతలో దైవవాణి మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. ‘వీరా.. నీకు ఇచ్చిన గడువులో 9 నిమిషాల సమయం ముగిసిపోయింది. ఇంకో నిమిషమే మిగిలి ఉంది. ఈ కార్యసాధన నుంచి వైదొలగాలని అనుకొంటే, తేలికపడిన ఆ గాండీవాన్ని ఆ పెట్టెలో ఉంచి.. దానిపై అక్షయ తూణీరాలను పేర్చి పెట్టెను మూసివేయి. అంతే, పెట్టె మునుపటి స్థితిలో బంధనం పొందుతుంది. బంగారు పళ్లెం కూడా సాధారణ పళ్లెంగా మారిపోతుంది. లేదూ.. ఈ కార్యసాధనలో ముందుకే వెళ్తా అంటావా?? అయితే, వెంటనే నీటితో తడిపిన నీ శరీర భాగాల్ని ఈ అక్షయ తూణీరాలతో ఛిద్రం చేసుకో. అప్పుడు విజయలక్ష్మి నిన్ను వరించి మిగతా రెండు అస్ర్తాలను గెలుచుకోవడానికి నీకు దారి చూపుతుంది’ అంటూ దైవవాణి ఆగిపోయింది.
‘సార్.. బాణాలతో ముఖం, కండ్లు, నోరు, ముక్కును ఛిద్రం చేసుకొన్నాక.. మీరు బతుకుతారా? చనిపోయిన మీరు మిగతా రెండు అస్ర్తాలను ఎలా సాధిస్తారు చెప్పండి?? ఇదంతా ఏదో కుట్రలాగా ఉంది. మనకివ్వేమీ వద్దు సార్. ఇక్కడితో ఆపేద్దాం. వెనక్కి వెళ్దాం పదండి’ అంటూ గద్గద స్వరంతో రామస్వామి అన్న మాటలకు అందరూ సమ్మతిస్తూ కదలబోయారు. ఇంతలో రుద్ర మెదడులో లీలగా ఏదో అనిపించింది. ‘అక్షయ తూణీరాలతో ముఖాన్ని ఛిద్రం చేసుకొంటే నాకు విజయం లభిస్తుంది. కానీ, అలా చేసుకొంటే, నేను చనిపోతాను కదా.. మరి, చనిపోయి నేనెలా గెలవగలను? అలా గెలిచిన నా శవం మిగతా అస్ర్తాలను ఎలా సాధిస్తుంది?? ప్రాణం లేని శరీరం అస్ర్తాలను గెలువలేదు. అంటే నేను ప్రాణాలు కాపాడుకొనే మార్గం ఉండే ఉంటుంది’ అని రుద్ర చెప్తూపోయాడు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. సమయం అర నిమిషం కూడా లేదు. ఇంతలో కరణ్ చెవిలో ఏదో చెప్పిన రుద్ర.. మరో 20 సెకండ్లలో తన పక్కనున్న అక్షయ తూణీరాలతో తన ముఖం, కండ్లు, ముక్కు, పెదవులు, పండ్లను ముక్కలు ముక్కలుగా ఛిద్రం చేసుకొన్నాడు. అంతే, అందరూ నిశ్చేష్టులుగా మారి చూస్తుండిపోయారు. ఇంతలో దైవవాణి మాట్లాడుతూ.. ‘తెలివితో ప్రాణాలను నిలుపుకొంటూనే.. సాహసం చేసి, విజయం సాధించావు వీరాధివీరా’ అంటూ అభినందనలు తెలియజేసింది. ఇంతకీ, రుద్ర ఏం చేసినట్టు?
సమాధానం
నీటితో తడిపిన శరీర భాగాల్ని అక్షయ తూణీరాలతో ఛిద్రం చేసుకోవాలంటూ దైవవాణి చెప్పినట్టు చేస్తే, రుద్ర చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి గెలవడం జరుగదు. అయితే, అలా చేస్తేనే విజయం వరిస్తుందని దైవవాణి చెప్పడంతో రుద్ర బాగా ఆలోచించాడు. అంతే, తన ముందు ఓ పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి.. అద్దంలో కనిపిస్తున్న తన ముఖం, కండ్లు, ముక్కు ఇలా శరీరభాగాల ప్రతిబింబాలను బాణాలతో ఛిద్రం చేశాడు. అలా భౌతికంగా తనను తాను గాయపరుచుకోకుండానే రుద్ర విజయం సాధించాడు.
– రాజశేఖర్ కడవేర్గు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

