ఇన్‌స్టా రీల్స్‌తోనే ఇన్‌స్టంట్‌గా సినిమా చాన్స్ కొట్టేసింది సాక్షి వైద్య. పేరుకు తగ్గట్టే.. ఆమె వైద్యురాలు కూడా. ఫిజియో థెరపిస్ట్గానూ సేవలు అందించిందట. సోషల్ మీడియాలో దక్కిన పాపులారిటీతో.. ‘ఏజెంట్’తో జట్టుకట్టి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గాండీవధారి అర్జున’ సరసన మెరిసింది. పవర్‌స్టార్ పక్కన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో అవకాశం దక్కినా.. అనుకోకుండా సినిమాను మిస్ చేసుకుంది. తాజాగా, ‘నారీనారీ నడుమ మురారి’ అంటూ.. తెరపై సందడి చేస్తున్నది. సంక్రాంతికి హిట్ కొట్టేసి, ఫుల్ జోష్‌మీదున్న సాక్షి.. పంచుకున్న కబుర్లు!
కొవిడ్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు సరదాగా చేసిన కొన్ని రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. అప్పుడే నాకూ నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా! అలా ‘ఏజెంట్’లో సెలెక్ట్ అయ్యాను. సినిమా అవకాశం వచ్చిన తర్వాతే.. నటనపై మరింత శ్రద్ధ పెట్టాను.
ఏజెంట్ సినిమా షూటింగ్ సమయంలోనే నిర్మాత అనిల్ గారు నాతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ.. ‘నారీనారీ నడుమ మురారి’లో అవకాశం ఇచ్చారు. సినిమా కథతోపాటు నేను పోషించిన ‘నిత్య’ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ పాత్ర.. నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉంటుంది. నేను కూడా నిత్యలాగే.. ఇన్నోసెంట్, నిజాయతీగా ఉండే అమ్మాయినే.
‘ఏజెంట్’కు ముందుకూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. కొందరు నిర్మాతలు ఫోన్ చేసి సినిమా అవకాశాల గురించి చెప్పారు. కానీ, స్క్రిప్ట్ నచ్చక వాటిని అంగీకరించలేదు. ఆ తర్వాత ‘ఏజెంట్’ ఆఫర్ వచ్చింది. అందులో హీరో అఖిల్ అనీ, మమ్ముట్టి లాంటి అగ్రతారలు ఉంటారని మొదట నాకు తెలియదు. వాళ్లతో కలిసి ఎలా నటిస్తానా?! అని మొదట భయపడ్డాను. కానీ, సెట్లో వాళ్లందరూ చాలా సాయం చేశారు.
సినిమాల్లోకి రాకముందు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశా. సినిమాల మీద మక్కువతోనే ఈ రంగంలోకి వచ్చా.
ఖాళీ సమయం దొరికితే పుస్తకాలను బాగా చదువుతాను. కావాల్సినంత నిద్రపోతాను. నేను భరతనాట్యం కూడా నేర్చుకున్నా.
పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అవకాశం రావడమే అదృష్టం. వారం రోజులు షూటింగ్‌లోనూ పాల్గొన్నా! కానీ, డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశం వదులుకున్నా. పవన్ సర్ చాలా రేర్‌గా డేట్స్ ఇస్తారు. ఒకరోజు డైరెక్టర్ హరీశ్ శంకర్ కాల్ చేసి.. డేట్స్ కావాలని అడిగారు. ఎల్లుండే షూటింగ్ అని చెప్పారు. కానీ, ఆ సమయంలో నేను ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల వారం రోజులు అందుబాటులో లేకుండా పోయాను. అలా డేట్స్ ఇష్యూ వల్ల ఆ సినిమాను మిస్ అయ్యాను.