టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో రాశి సింగ్‌ది ప్రత్యేక స్థానం. శశి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పాగావేసి ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్, ప్రసన్న వదనం వంటి సినిమాల్లో మంచి నటనను ప్రదర్శించింది. ఆశించిన బ్రేక్ రాకున్నా నటిగా సక్సెస్ కావడంతో ఆమెకు చక్కటి అవకాశాలు వస్తున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత హీరో వడ్డె నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’లో కథానాయికగా నటిస్తున్న రాశి పంచుకున్న కారవాన్ కబుర్లివి…
మాది ఛత్తీస్‌గఢ్. చిన్నప్పటినుంచి సీరియల్స్ చూసే అలవాటు ఉండేది. అవి చూసి యాక్టర్ కావాలనుకున్నాను. అందులోని పాత్రలను అద్దం ముందు ప్రాక్టీస్ చేసేదాన్ని. 14 ఏండ్లు ఉన్నప్పుడు ఓ కమర్షియల్ యాడ్ అవకాశం వచ్చింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయాను. సినిమాల్లోకి రాకముందు మూడేండ్లపాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశాను. నటనమీద ఆసక్తిని చంపుకోలేక ఉద్యోగానికి స్వస్తి పలికి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను.
కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కావొద్దన్నది నా ఆలోచన. అందుకే డిజిటల్ ఫ్లాట్ఫామ్నూ నా టాలెంట్‌కు వేదికగా మలుచుకున్నాను. పాపం పసివాడు, త్రీ రోజెస్-2 లాంటి వెబ్‌సిరీస్‌ల ద్వారా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాను. సినిమాల్లో సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాను.
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డె నవీన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన సినిమాల్లో కొన్నిటిని చూశాను. ఈ సినిమాలో ఆయన సీరియస్ పోలీస్‌గా నటించినా సెట్లో మాత్రం చాలా కూల్‌గా ఉండేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక నేను కూడా గతంలోనే తెలుగు డైరెక్టర్లతో కలసి పనిచేసిన అనుభవం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
ప్రస్తుతం అంతా సోషల్‌మీడియానే ఏలుతుంది కదా. అందుకే నేను అందులో యాక్టివ్‌గా ఉంటాను. నిత్యం ఏదో ఒక ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటాను. ట్రెడిషనల్, గ్లామరస్ ఫొటోలంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాటిని అభిమానులందరితో పంచుకుంటాను. కొన్నిసార్లు చీరలు ధరించినప్పుడు తెలుగమ్మాయిననే అనుకుంటారు కూడా. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువ ఇష్టపడతాను.
కాలేజ్ టైంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతను మాకు లెక్చరర్ కూడా. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్‌గా ఉండేవాడు. పరీక్షలు ఉన్నప్పుడు ముందు రోజు సీక్రెట్‌గా నాకు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలోనూ ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వదిలేసేవాడు. ఇద్దరం సరదాగా కూర్చోని కబుర్లు చెప్పుకొంటూ టైమ్‌పాస్ చేసేవాళ్లం. ఏనాడూ హద్దు
మీరలేదు. కొంతకాలానికి ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.