ఉదయం పార్కులో పరుగులు తీస్తున్న వారిని చూడటం సాధారణమే. కానీ, చేతిలో ఓ సంచి పట్టుకుని, దారిలో కనిపించే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, వ్యర్థాలను ఏరుకుంటూ పరిగెత్తేవారిని ఎప్పుడైనా గమనించారా? వాళ్లు కేవలం వ్యాయామం చేయడం కాదు… పర్యావరణానికి తమవంతు సేవ చేస్తున్నారు. ఈ వినూత్న జీవనశైలే ప్లాగింగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువత ఈ కొత్త రకమైన పరుగును అలవాటు చేసుకుంటున్నది.
పరిగెడుతూనే.. దారిలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి పారేసే ఒక అద్భుతమైన పద్ధతే ఈ ‘ప్లాగింగ్’. స్వీడన్ దేశంలో పుట్టిన ఈ సరికొత్త ట్రెండ్ ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా, యువత మెచ్చిన జీవనశైలిగా రూపాంతరం చెందింది. స్వీడిష్ భాషలో ‘ప్లోకా ఉప్’… అంటే ఏరుకోవడం, ఇంగ్లిష్ పదం ‘జాగింగ్’… ఈ రెండిటినీ కలిపి ‘ప్లాగింగ్’ అనే పదాన్ని సృష్టించారు. 2016లో ఎరిక్ అల్‌స్ట్రోమ్ అనే పర్యావరణ ప్రేమికుడు స్వీడన్లో దీనిని మొదలుపెట్టాడు. రోజూ జాగింగ్ చేసేటప్పుడు దారి పొడవునా పడి ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి చలించిపోయిన అతను… ఒక చేతిలో రీసైక్లింగ్ బ్యాగ్ పట్టుకుని, పరిగెడుతూ వాటిని ఏరడం ప్రారంభించాడు.
సాధారణ జాగింగ్‌తో పోలిస్తే ప్లాగింగ్ వల్ల శరీరానికి ఎక్కువ వ్యాయామం లభిస్తుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో కేవలం పరిగెత్తడమే కాకుండా.. దారిలో పడి ఉన్న చెత్తను వంగి అందుకోవడానికి స్క్వాట్స్, లెంజెస్వం లాంటి శారీరక కదలికలు చేయాల్సి ఉంటుంది. పరిగెడుతూనే చెత్తను తీసేందుకు వంగడం, కూర్చోవడం, లేవడం వంటివి చేయడం వల్ల కాళ్లు, నడుము, చేతుల కండరాలు మరింత చురుకుగా పనిచేస్తాయి. సాధారణ జాగింగ్ వల్ల అరగంటలో దాదాపు 235 క్యాలరీలు ఖర్చయితే… ప్లాగింగ్ చేయడం వల్ల అదే అరగంటలో ఏకంగా 288 క్యాలరీల వరకు కరిగిపోతాయి. అంటే అటు పర్యావరణం శుభ్రపడటంతో పాటు ఇటు శరీరానికి రెట్టింపు ఫిట్నెస్ లభిస్తుందన్నమాట!
మన దేశంలో ప్లాగింగ్ అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తి రిపు దమన్ బెవ్లీ. ఈయనను ప్లాగింగ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ‘క్లీన్-అప్ రన్స్’ ద్వారా దేశంలోని ఎన్నో నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ఆయన పెద్ద ఎత్తున యువతను భాగస్వామ్యం చేశారు. కొన్ని వేల కిలోల చెత్తను దీని ద్వారా ఆయన తొలగించారు. కేంద్ర ప్రభుత్వం కూడా *స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఏటా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా అధికారికంగా ప్లాగింగ్ రన్స్ నిర్వహిస్తున్నది. నేడు ఎందరో ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ఆదివారం వచ్చిందంటే చాలు… గ్రూపులుగా ఏర్పడి తమ నగరాల్లోని పార్కులు, పర్యాటక ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఈ ప్లాగింగ్ రేసుల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, ఢిల్లీ వంటి నగరాల్లో అనేక ప్లాగింగ్ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. ప్రతి వారాంతంలో సరస్సులు, పార్కులు, కొండ ప్రాంతాలు, బీచ్‌ల దగ్గర ప్రత్యేక ప్లాగింగ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. కొన్నిచోట్ల కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్లాగింగ్ చేయడానికి ఖరీదైన పరికరాలేమీ అవసరం లేదు. ఒక జత షూస్, చేతి తొడుగులు, చెత్త సేకరించే సంచి ఉంటే చాలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పిల్లలతో కలిసి దీన్ని అలవాటుగా మార్చుకోవచ్చు. ఇప్పటికే అనేక నగరాల్లో ప్లాగింగ్ క్లబ్‌లు, స్వచ్ఛంద బృందాలు ఏర్పడి దీనిపట్ల అవగాహన కల్పిస్తున్నాయి. స్వార్థం కోసం పరిగెత్తే ప్రపంచంలో… సమాజం కోసం, ప్రకృతి కోసం పరిగెత్తడమే నిజమైన ఫిట్నెస్ అని నిరూపిస్తున్నది ఈ ప్లాగింగ్. కేవలం జిమ్‌లకే పరిమితం కాకుండా, ఆదివారం పూట కాసేపు మన చుట్టూ ఉన్న పరిసరాల కోసం చేసే ఈ చిన్న ప్రయత్నం… దేశానికి స్వచ్ఛతను, మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. నిజంగానే ఇదొక అద్భుతమైన గ్రీన్ ట్రెండ్ కదూ!