మనసులోని ప్రేమను మాటల్లో చెప్పలేనప్పుడు.. అక్షరాలను అరువు తెచ్చుకుంటారు. ఆ అక్షరాలతో అందమైన కవితలు అల్లి.. ప్రేమ లేఖలుగా మలుస్తారు. మనసుపడ్డ మగువ హృదయాన్ని గెలుచుకుంటారు. అదంతా.. గతం! ఇప్పుడంతా ఏఐ మయం! ఇప్పటితరం ‘చాట్ జీపీటీ’లోనే చకచకా లవ్ లెటర్లు రాస్తున్నది. ‘జెమినీ’ అండతో మినీ కవితలు అల్లేస్తున్నది. ‘డేటింగ్ యాప్స్’లో అవతలి వ్యక్తిని మెప్పించడానికి ఇలా ఏఐని ఆశ్రయిస్తున్నది. అయితే, కృత్రిమ మేధ అండతో అందిన ఆ బంధం కూడా కృత్రిమమైనదే అవుతుంది.
ప్రేమ లేఖ రాయడం ఓ అందమైన కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే, ఇప్పుడు చాలామంది ‘ఏఐ’ని ఆశ్రయిస్తున్నారు. లవ్ లెటర్స్ రాసుకోవడంలో కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. ఏఐ కూడా.. వీళ్లకు పర్ఫెక్ట్ ఓపెనింగ్ లైన్ ఇస్తున్నది. ఏం రాయాలో తెలియని వారికి సలహాలు కూడా అందిస్తున్నది.
ఒకరకంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా సామాజిక ఆందోళన ఉండేవారికి, సంభాషణను ప్రారంభించడంలో ఇబ్బంది పడేవారికి ఏఐ ఒక సపోర్ట్ టూల్‌గా పనిచేస్తుంది. కానీ, పూర్తిగా దానిపైనే ఆధారపడితే.. విశ్వసనీయత దెబ్బతింటుంది. డేటింగ్లో విశ్వసనీయత అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు. అది బంధానికి పునాది! మీ కోసం ఏఐ ఒక మెసేజ్ రాస్తే.. మీ భాగస్వామి అదే నిజమని నమ్ముతుంది. మీ నిజమైన మనసు, మీ వాక్చాతుర్యం, మీ ఆలోచనను అర్థం చేసుకోలేక పోతుంది.అందుకే, ఏఐ అనేది తొలి దశల్లో సహాయం అవ్వొచ్చు. కానీ దీర్ఘకాలికంగా, రిలేషన్షిప్ పక్కాగా సెట్ అవ్వాలంటే.. మీ మాటలు, మీ ఎమోషన్స్ తప్పకుండా ఉండాల్సిందే! టెక్నాలజీ అనేది ఓ టూల్ కావచ్చు.. కానీ కనెక్షన్‌కి హ్యూమన్ టచ్ అవసరం!
అంచనాలన్నీ తలకిందులే..ఏఐ రాసిన మెసేజులు చాలా పాలిష్డ్గా, డీప్‌గా ఉండవచ్చు. కానీ, నిజ జీవితంలో మీరు అలా మాట్లాడలేకపోతే.. మీ భాగస్వామిలో అసంతృప్తి కలగవచ్చు. ‘చాట్‌లో అంత స్మార్ట్‌గా ఉన్నావు.. కానీ ఇప్పుడేంటి డిఫరెంట్‌గా ఉన్నావు?’ అనే ప్రశ్న రావొచ్చు. మీపై పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులై పోవచ్చు. అంతేకాకుండా, మీరు పూర్తిగా ఏఐ పైనే ఆధారపడితే.. మీ సొంత భావోద్వేగాలు, భావాలు అంతగా వృద్ధి చెందక పోవచ్చు. చర్చల్లో సందేహాలు రావడం, మనస్పర్థలు వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం, సానుభూతి చూపించడం లాంటి స్కిల్స్.. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తాయి. దీనిని ఏఐ షార్ట్‌కట్ చేయలేదు. ఏఐ వాడటం వల్ల మీలో తాత్కాలిక కాన్ఫిడెన్స్ వచ్చినా.. దీర్ఘకాలంలో మీపై మీకే కాన్ఫిడెన్స్ తగ్గొచ్చు. ‘నేను నిజంగా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలనా?’ అనే ప్రశ్న మీ మనసులోనే ఉదయించవచ్చు. అందుకే ఏఐని సపోర్ట్ టూల్‌గానే వాడుకోవాలనీ, రీప్లేస్‌మెంట్‌గా కాదని క్లినికల్ సైకాలజిస్ట్‌లు అంటున్నారు. డేటింగ్ అంటే ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు అర్థం చేసుకోవడం. కానీ ఏఐ టూల్స్ అందించే సందేశాలలో మీ నిజమైన గొంతుక ఉండదు. అది కేవలం పదాల కూర్పు మాత్రమే. అవతలి వ్యక్తి ఆ మెసేజ్ చూసి ఫిదా అవ్వచ్చు. కానీ, నేరుగా కలిసినప్పుడు మీ అసలు వ్యక్తిత్వం బయటపడితే.. ఆ బంధం ఒక్క క్షణంలో ముక్కలైపోవచ్చు.
ఏఐతో వచ్చే ఇబ్బందులివే.. ఎమోషనల్ కనెక్షన్ లోపించడం: ఏఐ ఇచ్చే సమాధానాల్లో డెప్త్ ఉండదు. అది అల్గారిథమ్స్ ఆధారంగా ఇచ్చే జవాబు కాబట్టి, మనసుతో పలకరించే ఆత్మీయత అందులో కనిపించదు.నమ్మకం దెబ్బతినడం: మీరు పంపిన మెసేజ్ ఏఐ రాసిందని తెలిస్తే, అవతలి వ్యక్తికి మీపై ఉన్న గౌరవం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇది మోసం కిందికే వస్తుంది.కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడం: అన్నిటికీ ఏఐపై ఆధారపడటం వల్ల.. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. ఒక విషయాన్ని సొంతంగా ఎలా చెప్పాలో, భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సహజత్వం మిస్ అవ్వడం: రిలేషన్షిప్లో మీ భయాలు, బలహీనతలు చెప్పినప్పుడే బంధం బలపడుతుంది. ఏఐ ఎప్పుడూ ‘పర్ఫెక్ట్’గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఇది మనుషుల మధ్య ఉండాల్సిన సహజత్వాన్ని దెబ్బతీస్తుంది.
అదో ఫేక్ మాస్క్ డేటింగ్ యాప్స్‌లో ఏఐని వాడటం అనేది ఒక ‘ఫేక్ మాస్క్’ వేసుకోవడం లాంటిది. ప్రాథమికంగా పరిచయం పెంచుకోవడానికి ఇది పనికొచ్చినా, దీర్ఘకాలిక బంధాలకు ఇది విషం లాంటిది. మీ కవితలు ఏఐ రాసినవి కావచ్చు.. కానీ మీ కన్నీళ్లు, మీ నవ్వు కేవలం మీవే కావాలి. ప్రేమలో కావాల్సింది పర్ఫెక్ట్ పదాలు కాదు. ప్యూర్ మనసు!
జాగ్రత్త సుమా!