తాయత్తుకే పిల్లలు పుడితే ఇగ తానెందుకు?
మనుషులపై నమ్మకం లేకుండా.. మూఢనమ్మకాలను విశ్వసించే వారిని ఉద్దేశించిన సామెత ఇది. కొందరంతే. కష్టాన్ని నమ్ముకోరు. కష్టించి పనిచేసేవారిని గుర్తించరు.
మనుషులపై నమ్మకం లేకుండా.. మూఢనమ్మకాలను విశ్వసించే వారిని ఉద్దేశించిన సామెత ఇది. కొందరంతే. కష్టాన్ని నమ్ముకోరు. కష్టించి పనిచేసేవారిని గుర్తించరు. ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకుండా ప్రతీది ‘దైవాధీనం’ అన్నట్లు ఉంటారు. గాల్లో దీపం పెట్టి ‘దేవుడా’ అంటారు. పూర్వం ఒకావిడ భర్తతో సంసారమే చెయ్యకుండా.. పిల్లలు పుట్టాలంటూ కనిపించిన దేవుళ్లకంతా మొక్కేదట. పీరు సాయబులు, బాబాలు ఇచ్చే తాయత్తులు కట్టుకునేదట. ఈ విషయమై ఓ రోజు దంపతులిద్దరూ తీవ్రంగా గొడవపడి పంచాయతీ పెట్టారు. అంతమంది సమక్షంలో భార్య పరువు తీసుకోవడం ఇష్టంలేని ఆ భర్త.. ‘తాయెత్తుకే పిల్లలు పుడితే.. ఇక నేనెందుకు?’ అంటూ ఒక్కమాటలో తేల్చేశాడు. విషయం అర్థం చేసుకున్న పెద్దలు ఆవిడకు సంసార బాధ్యతల గురించి వివరించారట. ఇప్పటికీ చాలామంది కష్టపడి చదవకుండా పరీక్షలు పాసవ్వాలని, తమవంతు ప్రయత్నం చెయ్యకుండా ఉద్యోగం రావాలని, నచ్చిన అమ్మాయే వచ్చి ప్రపోజ్ చెయ్యాలని పూజలు చేస్తూ, తాయెత్తులు కట్టుకొని తిరుగుతుంటారు.
ఈనగాసి నక్కల పాలుజేసినట్టు

ఎన్నో కష్టాలను భరించి, అనేక నష్టాలను అనుభవించి.. తీరా ప్రతిఫలాన్ని అనుభవించే సమయానికి ఆ పనిని పక్కన పెట్టేవాళ్లను ఉద్దేశించిన సామెత ‘ఈనగాసి నక్కల పాలుజేసినట్టు’. ఇది వ్యవసాయ సంబంధ సామెతే అయినా.. అన్ని కాలాలకు, అన్ని పనులకూ వర్తిస్తుంది. ఏ పనిచేసినా ఓర్పు, అధ్యయనం, సహనం, తెలివితేటలు అవసరం. పని మొదలుపెట్టినప్పుడు ఉన్న ఓర్పు.. చివరి వరకూ ఉండాలి. లేకపోతే అప్పటి వరకు పడిన శ్రమ, వెచ్చించిన సమయం వృథా అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరే. ఓ వ్యక్తి ఆరుగాలం కష్టపడి దుక్కిదున్ని, మొక్కనాటి, నీరుపెట్టి, మందులుకొట్టి.. రోజూ కాపలా వెళ్లేవాడట. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి (ఈనే దశ) ఆ కష్టం తనవల్ల కాదంటూ పంటను వదిలేశాడట. అప్పటికే కాచుకొని కూర్చున్న నక్కలు, అడవి పందులు పంటనంతా నాశనం చేశాయట. మన కష్ట ప్రతిఫలాన్ని అనుభవించకుండా పరులపాలు చేసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు జానపదులు.
నంగనాచి తుంగబుర్ర!

అమాయకంగా కనిపిస్తూ.. ఏమీ ఎరగనట్లు నటిస్తూ.. గొడవలు పెడుతుంటారు కొందరు. అలాంటి వాళ్లు తారసపడగానే ‘వచ్చిందయ్య నంగనాచి తుంగబుర్ర’ అనుకుంటారు జనం గుసగుసగా. ఈ పదబంధంలో ‘నంగనాచి’ అనే పదాన్ని హిందీలో ‘నంగే నాచ్’ అంటారు. అంటే ‘దిగంబరంగా నాట్యమాడే’ అని అర్థం. తుంగబుర్ర మాత్రం అచ్చమైన మన పలుకుబడి. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసి, ఏమీ ఎరగనట్లు నటించేవారిని ‘నంగనాచి’ అంటారు. అమాయకత్వం నటించే ‘నెరజాణ’ అనే అర్థం కూడా వస్తుంది. హిందీలో ‘నంగ’ అంటే సిగ్గుమాలిన, నగ్న, దిగంబరమైన అనే అర్థాలు వస్తాయి. అలాంటి పనులు చేసేవారిని ‘నంగనాచి’ అని పిలుస్తారు. ఇక ‘తుంగబుర్ర’కు మిగిలిన దుంపల్లా రక్షణ కవచం ఉండదు. ఇది కూడా ఓ దిగంబరి దుంపే. పైకి అందంగా కనిపించినా.. లోపల లొట్టబుర్ర. అలా.. పైకి అందంగా కనిపిస్తూ.. లోపల విషం నింపుకుని, గొడవలు సృష్టించే వారిని ‘నంగనాచి తుంగబుర్ర’గా వ్యవహరిస్తారు. ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండాలి.
అర్థ వివరణ

తొగరిపప్పు = కందిపప్పు (సజ్జమీద తొగరిపప్పు బస్తా ఉంది. వెళ్లి కొంచెం సర్వలో వేసుకొనిరా పో బిడ్డా!)
శీగుడ్డు = పాడైపోయిన / మురిగిపోయిన గుడ్డు (గంపకింద ఎర్రకోడి ఐదు పిల్లల్నే చేసింది. మిగిలినవి శీగుడ్లు అయినయ్. పగిలినయో ఏమో..! చెడ కంపు కొడుతున్నది)
లంకంత కొంప = పెద్ద భవంతి (పిల్లల్ని ఇదేశాలకు పంపించి.. ఈ లంకంత కొంపలో ఇద్దరే ఎట్లుంటుర్రో ఏమో! నాకర్తమైతలేదు)
మారువెట్టు = రెండోసారి వడ్డించడం (రాకరాక ఇంటికొస్తివి.. ఎప్పుడు తిన్నవో ఏమో మారువెట్టుకో.. కడుపునిండా తిను బిడ్డా)
సగవల్కుడు = సమర్థించడం / వంతపాడటం (ఏమ్రో.. ఆని తప్పులకు నువ్ సగవల్కుతున్నవ్ ఏంది కత? ఆ పాపంలో మీ ఇద్దరికీ భాగముందా ఏంది?)
-డప్పు రవి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Mana samethalu
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

