Mamitha Baiju | మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో తిష్టవేస్తారు కొందరు హీరోయిన్లు. ఆ కోవకే చెందుతుంది మమితా బైజు. ఇటీవల విడుదలైన ‘ప్రేమలు’ సినిమాతో ఈ కేరళ సౌందర్యం తెలుగువారిని పలకరించింది. దక్షిణాది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు అందుకుంది. సహజత్వం ఉట్టిపడే నటనతో ఆకట్టుకుంటున్న మమితా బైజు తన గురించి పంచుకున్న
ఆసక్తికరమైన విషయాలు..
‘ప్రేమలు’ తర్వాత అభిమానుల ఆదరణ చూసి సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన చిత్రాలు, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ కథలంటే నాకు చాలా ఇష్టం.
ప్రస్తుతం తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ సినిమాలో చేస్తున్నాను. నా కెరీర్ ఇప్పుడు వేగం పుంజుకున్నట్టు అనిపిస్తున్నది. సాయిపల్లవి నా అభిమాన నటి. ఆమె నాకు స్ఫూర్తి. ‘ప్రేమలు’లో నా యాక్టింగ్ చూసి అలాంటి గొప్పనటితో పోలుస్తుండటం ఆనందంగా ఉంది.
మొన్నీమధ్య విడుదలైన ‘ప్రేమలు’ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా నాకు కొత్తగా రెక్కలు తొడిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. చాలా కథలు వింటున్నా. కానీ, నాకు నచ్చితేనే ఓకే చెప్తా!
‘ప్రేమలు’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు భలేగా అనిపించింది. ఈ నగరానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇక్కడి మనుషుల్ని చూసినప్పుడు అందరూ మనవాళ్లే అనిపించింది. తెలుగు సినిమాలు చూసిన అనుభవం ఉంది కదా, భాష కూడా బాగానే అర్థమైంది. ఎస్పెషల్లీ.. హైదరాబాద్ బిర్యానీని బాగా ఎంజాయ్ చేశాను.
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారిగా సినిమా అవకాశం వచ్చింది. ‘సర్వోపరి పలక్కరన్’ నా మొదటి సినిమా. ఏడేండ్లలో దాదాపు 15 సినిమాల్లో నటించాను. షార్ట్‌ఫిల్మ్స్ కూడా చేశాను. చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అఫ్కోర్స్ ఓ మోస్తరు విద్యార్థినే అనుకోండి. ప్రస్తుతం నటిస్తూనే సైకాలజీలో డిగ్రీ చేస్తున్నా!
మా నాన్న డాక్టర్. నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ, నాకేమో చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే ఇష్టం. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. కూచిపూడి కూడా నేర్చుకున్నా. నటనపై ఆసక్తితోనే పాఠశాల రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఎన్నో బహుమతులూ గెలుచుకున్నా! అలాంటి ఓ ప్రదర్శన ఫొటో ద్వారా చూసే నాకు సినిమా అవకాశం వచ్చింది.
నేను చూసిన తొలి తెలుగు సినిమా ‘మగధీర’. ‘ఈగ’ సినిమా కూడా చాలాసార్లు చూశాను. ఆ రెండు సినిమాలకూ దర్శకుడు రాజమౌళి గారే! ‘ప్రేమలు’ చూశాక ఆయన నన్ను ప్రత్యేకంగా మెచ్చుకోవడం ఏనుగు అంబారీ ఎక్కినంత సంతోషంగా అనిపించింది. ఇక టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలాసార్లు చూశాను. బన్నీతో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. మంచి కథ, ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే వెంటనే ఓకే చెప్తా!