చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ ప్రేక్షకులను మెప్పించిన ఢిల్లీ బ్యూటీ మాళవికా నాయర్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అంటూ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ శర్వానంద్‌తో కలిసి ‘బైకర్’తో రైడ్‌కు సై అంటున్నది. ఈ సందర్భంగా మాళవిక పంచుకున్న కబుర్లు ఇవి..
నేను ఢిల్లీలో పుట్టాను. మా నాన్న ఇంటీరియర్ డిజైనర్. వర్క్ విషయంలో వివిధ ప్రాంతాలు తిరిగేవారు. అలా నా బాల్యంలో కొన్నాళ్లు మా కుటుంబం కేరళలో ఉంది. మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయాం. ప్రయాణాలు చేయడం వల్ల నా చదువు కేరళ, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో సాగింది. పద్నాలుగేళ్ల వయసులోనే ‘కుకూ’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో అంధురాలిగా నటించాను. ఆ తరువాత ‘బ్లాక్ బటర్ ఫ్లై’ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యాను.
సినీఫీల్డ్‌లో మనకు మనం హద్దులు పెట్టుకుని కూర్చుంటే వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. కొన్నిసార్లు ఎంత మంచి సినిమా అయినా అందులోని ఇంటెన్స్ సీన్లలో, బోల్డ్ సీన్లలో నటించాల్సి వస్తుంది. అవి కావాలని చేసేవి కావు కదా! సీన్ డిమాండ్ చేసినప్పుడు తప్పదు. అంతమాత్రానికే ఇబ్బందిపడితే ఎలా?
ఇప్పుడు నేను తెలుగు స్పష్టంగా మాట్లాడగలను. ఇక ‘బైకర్’ హీరో శర్వానంద్ నటన గురించి మీ అందరికి కొత్తగా చెప్పేదేముంది. షూటింగ్లో అందరితో సరదాగా నడుచుకుంటాడు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా చిత్రం. మూడు తరాల నేపథ్యం, ప్రేమ, కలలు వంటి అంశాల నేపథ్యంతో ముడిపడి ఉంటుంది.
మనం వెళ్లేదారిలో పూలతో పాటు ముండ్లు కూడా ఉంటాయి. ముండ్లు ఉన్నాయని వెనక్కి తగ్గితే.. గమ్యాన్ని చేరుకోలేం. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన ప్రయాణం ఆపాల్సిన పనిలేదు. నా కెరీర్లోనూ ఫ్లాప్‌లు ఉన్నాయి. అలాగని నేను సినిమాలు మానయ్యలేదు కదా! సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నటిగా ప్రేక్షకులు నన్ను ఎప్పటికీ మర్చిపోరు. వాళ్లు ఆదరించినంత కాలం నటిస్తూనే ఉంటాను!
ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాను. యోగా అంటే ఆసక్తి. అందులో శిక్షణ కూడా తీసుకున్నాను. రెగ్యులర్‌గా స్నేహితులతో కలిసి సాధన చేస్తుంటాను. అలాగే నన్ను నేను రిఫ్రెష్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్పులు, కెఫేలు చుట్టి వస్తుంటాను. ఒహానా కార్టూన్లంటే ఎక్కువ ఇష్టం. ఆ థీమ్‌తో ఉండే రెస్టారెంట్లకు రెగ్యులర్‌గా వెళ్తుంటాను. దర్శకురాలు నందినీ రెడ్డి, హీరోయిన్ సమంతాతో కలిసి అప్పుడప్పుడూ డిన్నర్ పార్టీలు ప్లాన్ చేస్తుంటాను.
మన సంప్రదాయాలను పాటించాలన్నది నా అభిప్రాయం. అందుకే పండుగలొస్తే నేత చీర కట్టుకుంటాను. షూటింగ్లలో వేసే దుస్తులకు వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఏ స్థాయిలో ఉన్నా పుట్టి పెరిగిన ఆచారాలను మరవొద్దనేది నా భావన. మార్పును స్వాగతిస్తూనే మన ఆచారాలను కూడా పాటించాలి కదా!
నా దృష్టిలో పుస్తకాలు చదవడం, వంట చేయడం కూడా ఫిట్నెస్ సీక్రెట్లుగానే భావించి ఆచరిస్తుంటాను.