మెదక్ కల.. సాకారమయ్యేలా!
2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన రాగానే.. మెదక్ జిల్లా సంబురాలు చేసుకుంది. అప్పటికే జిల్లాగా ఉన్న మెదక్ మళ్లీ వేడుకలు చేసుకోవడం ఏమిటి? అనుకోవచ్చు. అన్ని ప్రాంతాల డిమాండ్ ఒక రకమైతే.. మెదక్ పరిస్థితి మరో రకం. ఉమ్మడి రాష్ట్రంలో మెతుకు సీమది చిత్రమైన అనుభవం.
2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన రాగానే.. మెదక్ జిల్లా సంబురాలు చేసుకుంది. అప్పటికే జిల్లాగా ఉన్న మెదక్ మళ్లీ వేడుకలు చేసుకోవడం ఏమిటి? అనుకోవచ్చు. అన్ని ప్రాంతాల డిమాండ్ ఒక రకమైతే.. మెదక్ పరిస్థితి మరో రకం. ఉమ్మడి రాష్ట్రంలో మెతుకు సీమది చిత్రమైన అనుభవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలోనే.. మెదక్ జిల్లా ఏర్పాటైంది. కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రం సంగారెడ్డిగా నిర్ణయించారు అప్పటి పాలకులు. జిల్లాగా గుర్తింపు దక్కినా.. అందుకు తగ్గ ఆర్భాటలేవీ లేకుండా అరవై ఏండ్లు నెట్టుకొచ్చిందీ ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక గానీ, మెదక్ నిజమైన జిల్లాగా రూపుదిద్దుకోలేదు. వైవిధ్యతకు మారుపేరుగా నిలిచిన మెదక్.. ఇప్పుడు పరిపాలనా కేంద్రంగానూ మారి పరిపూర్ణతను సంతరించుకుంది.
పురాతన ఖిల్లా.. ఆసియాలోనే రెండో అత్యంత ఎత్తయిన చర్చి.. పచ్చని పైర్లు.. మెండుగా జలవనరులు.. హైదరాబాద్‌ను మించిన సమశీతోష్ణ వాతావరణం.. ఇవన్నీ మెతుకు సీమ ప్రత్యేకతలు. జిల్లాగా ఏర్పాటైన 1956లోనూ మెదక్ ఇంతే గొప్పగా ఉండేది. పైగా హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల లోపే ఉండటంతో.. జిల్లాగా మారాక మెదక్ దశ, దిశ మహోజ్వలంగా మారుతాయని అందరూ భావించారు. కానీ, జిల్లా కేంద్రం సంగారెడ్డిగా నిర్ణయించడంతో ఆదిలోనే హంసపాదులా మారింది మెదక్ పరిస్థితి. మెదక్ పట్టణంలో ఉంటున్నామన్న మాటే కానీ, ప్రతి పనికీ సంగారెడ్డి బాటపట్టడం స్థానికులకు చిన్నతనంగానే అనిపించేది. ఈ క్రమంలో మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అడపాదడపా ఉద్యమాలు పుట్టుకొచ్చేవి కూడా! ఎన్నికల వేళ.. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేస్తామన్న హామీలూ వినిపించేవి! కానీ, ఆ హామీలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. 1980లో ఇందిరాగాంధీ మెదక్ ఎంపీ స్థానం నుంచి గెలిచి ప్రధాని పీఠం అలంకరించినా.. మెదక్వాసుల కల తీరింది లేదు.

Medak Chrch
పారిశ్రామికవాడగా పేరుగాంచిన పటాన్చెరు ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగం. సాగుబడికి పూర్తి అనుకూల క్షేత్రంగా గుర్తింపు పొంది.. వ్యవసాయ పరిశోధనల నిమిత్తం ఏర్పాటైన ఇక్రిశాట్ కూడా మెదక్ జిల్లాలోనిదే! బీహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర సంస్థలు మెతకు సీమ వైభవాన్ని చాటినవే! ఇన్ని ఉన్నా.. జిల్లా కేంద్రం కాకపోవడంతో మెదక్ అభివృద్ధి నత్తనడకన సాగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మెదక్ జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేసింది. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్‌కు మెదక్ అంటే ప్రత్యేక అభిమానం. ఉద్యమ సమయంలోనూ మెతుకుసీమ బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచింది. జిల్లా గురించి ఆనూపానూ తెలిసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మెదక్వాసుల ఆరు దశాబ్దాల కలను నెరవేర్చారు. ఈ జిల్లాను విభజన చేసి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా ప్రకటించారు.
ఒకప్పుడు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా విద్యాధికారి కార్యాలయం అన్నీ.. సంగారెడ్డిలోనే ఉండేవి. 2016 అక్టోబర్ 11 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మెదక్ పట్టణంలోనే కోట్ల రూపాయల వ్యయంతో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వెలిశాయి. జిల్లా కోర్టు, జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటయ్యాయి. మెడికల్ కళాశాల అదనపు హంగు తెచ్చింది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మెదక్, తూప్రాన్, నర్సాపూర్ పట్టణాలు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఏ మారుమూల పల్లె నుంచి అయినా జిల్లా కేంద్రానికి దూరం 60 కిలోమీటర్లకు మించదు. దీంతో పరిపాలన ప్రజలకు మరింత దగ్గరైంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు రావడంతో… అన్నిటా మార్పు మొదలైంది. చుట్టుపక్కల పల్లెల నుంచి వందల కుటుంబాలు మెదక్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డాయి. పట్టణ జనాభా పెరగడం, జిల్లా కార్యాలయాలు రావడంతో వస్తు వినిమయం పెరిగింది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. అన్నిటికీ మించి.. పేరుకే జిల్లా అయినా, అందుకు తగ్గ గుర్తింపు లేదని తరాలుగా పేరుకుపోయిన భావన మంజీరా ప్రవాహంలో కొట్టుకుపోయింది.
– గౌని దౌలయ్య, మెదక్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

