– కె. శ్రీలత, వైరా
మన జీవితం ఈ జన్మతోనే మొదలు కాలేదు. ఎక్కడో హిమాలయాలలో పుట్టిన నది.. మన ప్రాంతంలో, మన మధ్య సాగిపోయినంత మాత్రాన అది కేవలం మన ప్రాంత అనుభవాలతోనే ఉండదు కదా! ఆ నది ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో సంప్రదాయాల సంబంధాలతో మునిగి, నడిచి వస్తూ.. మన వద్దకు చేరుతుంది. జీవితం కూడా అంతే! ఎన్నో జన్మల ప్రయాణం మనది. ఈ జన్మలో మాత్రమే మనవి మనకు అర్థం అవుతాయి. కాబట్టి, కొన్ని సంఘటనలు, సంఘర్షణలు ఎదుర్కోక తప్పదు. అలాగని శాస్త్ర జీవన విధానం నిష్ప్రయోజనం కాదు. గత కర్మల ఫలితాలకు వర్తమాన కర్మలు నివృత్తిని కలిగిస్తాయి. పనితోనే పనిని చక్కదిద్దాలి. ముడివేసిన చేతులే.. ముడి విప్పాలి. అందుకు శాస్ర్తాలు, విధానాలు దోహదపడతాయి. ‘స్క్రూ’ని ఒకవైపు తిప్పితే ఓపెన్ అవుతుంది. మరోవైపు తిప్పితే బిగుసుకుంటుంది. ఇక్కడ స్క్రూ మారదు. అలాగే, శాస్త్రపద్ధతులతో అదే జీవితాన్ని మనకు అనుకూలమైన విధానాలతో కొనసాగిస్తే.. తప్పకుండా విషాదాల నుంచి మహా శాంతి జీవనాన్ని పొందగలం. మహర్షుల మార్గం మనది. ఆ దారిలో నడిస్తే కాస్త ఆలస్యం అయినా.. ఆనంద జీవనం అందకుండా పోదు.
– కె.వి. బాలరాజు, రాజేంద్రనగర్.
ఇంటికి చుట్టూ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఉపగదులు కట్టుకోవచ్చు. అందుకు కిచెన్‌కు ఏ విధమైన సంబంధం లేదు. తూర్పు ఆగ్నేయంలో ఇంటి దక్షిణం పారును అనుసరిస్తూ, ఇంటికి దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని అలాగే వదిలి సర్వెంట్ గదిని కట్టాలి. అలాగే, ఇంటి పడమర పారును చూసుకొని ఆ వరుసలోనే వాయవ్యంలో అనగా.. ఉత్తరంవైపు వాయవ్య భాగంలో స్టాఫ్ రూమ్‌ను వేసుకోవచ్చు. ఈ విధానం పాటిస్తే చాలు.

రెండు కిచెన్లు అనేది గృహశాస్త్రంలో అన్నదమ్ములు పాలు పంచుకున్నప్పుడు వస్తుంది. ఉండాల్సింది ఒక్క కిచెన్ మాత్రమే. మనిషికి కడుపు ఒక్కటే ఉంటుంది. అలా కొన్ని నిర్దుష్ట నిర్మాణ స్థానాలు, నియమాలు ఉంటాయి. అందులో భాగమే వంటగది. ఏవైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంటి బయటి స్థలంలో ఆగ్నేయ-వాయవ్యాలలో అదనపు కిచెన్ వేసుకొని ఉపయోగిస్తారు. అదికూడా తాత్కాలికమే కదా!
– కె. చంద్రం, చౌటుప్పల్.
చెట్టు ఎదురుగా ద్వారం రాకూడదు. ద్వారం పెట్టే స్థానానికి ఎదురుగా చెట్టు ఉంది అంటే.. ఆ చెట్టు సరైన స్థానంలో లేదు అని, లేదా మీరు పెట్టే ద్వారం సరైన స్థానం అవునో కాదో గమనించాలి. తూర్పు ద్వారం అయినా, దక్షిణ ద్వారం అయినా చెట్టు ద్వారంలో పడేలా ఉండొద్దు. మీరు దక్షిణం ఆగ్నేయంలో ద్వారం పెట్టినప్పుడు ఆ ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే.. ద్వారాన్ని తప్పించి చెట్టు పడకుండా చూసుకొని, ద్వార నిర్ణయం చేయండి.

దక్షిణం ముఖద్వారం వచ్చిన గృహాలకు దక్షిణ ఆగ్నేయం సింహద్వారం రావడం అవసరం. అలాంటప్పుడు చెట్లు ఆ దిశలో లేకుండా దక్షిణంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ పెట్టుకోవాలి. ముఖ్యంగా, మామిడి, చింత మొదలైన వృక్షాలు ఇంటికి దగ్గరలో ఉండవద్దు. అవి ఇంటిని పెకిలిస్తాయి. పెట్టుకోవాల్సిన చెట్లు పెట్టుకున్నా.. ఇంటి శరీర భాగాలు అయిన ద్వారాలు, కిటికీలను అడ్డుకునేవి కాకూడదు. జాగ్రత్త చేసుకోండి.
– బి. అరుంధతి, వారాసిగూడ.
మానవులను తరింపజేయడానికి నిర్మితమైనవే మఠాలు, ఆలయాలు తదితర ప్రార్థనా స్థలాలు. వీటిని నిర్మించేటప్పుడే మానవ నివాసాలకు దూరంగా, మాడవీధులు వదిలి నిర్మించాల్సి ఉంటుంది. మఠాలలో సాధువులు, యోగులు, గురువుల శిక్షణ, కదలికలు, యోగానుష్ఠానాలు నడుస్తూ ఉంటాయి. పదుగురు భక్తులు వచ్చీపోతూ ఉంటారు. ఆ విధంగా ఆలయాలకు అవి తీసిపోవు. అలాగని ఆలయాలు కావు.

అయితే, అవి జనం మధ్య ఉండకూడదు అనేది లేదు. వాటి పవిత్రతకు, వారి కార్యకలాపాలకు దూరంగా జనావాసాలు ఉండాలి. అంతేకానీ, అవి ఎదురుగా ఉంటే, పక్కన ఉంటే నష్టం-కష్టం వస్తుంది అనే భయం అక్కర్లేదు. మన భారతీయ సంప్రదాయంలో ఉండే ఇలాంటి ప్రార్థనా మందిరాలు మనుషుల జీవితాలను ఉద్ధరించడానికి వెలసినవే! కానీ, అవి మనల్ని కృంగదీసేవి కావు. మన వ్యవహారాల వల్ల వాటికి ఇబ్బంది రాకుండా చూసుకుంటే చాలు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143