హెచ్ఐవీ వైరస్ దశాబ్దాలుగా మనకు సవాలు విసురుతున్నది. ఎప్పటికప్పుడు ఇది మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి, విరుగుడుగా ఓ మంచి టీకాను కనిపెట్టడం అసాధ్యమైపోయింది. కానీ ఇప్పుడు ఓ కొత్త ఆశారేఖ కనిపిస్తున్నది. mRNA అనే ప్రక్రియ ద్వారా హెచ్ఐవీ వైరస్‌కు టీకా కనుగొనే ప్రయత్నం చేశారు పరిశోధకులు. శరీరంలో చేరిన వ్యాధి కారకాలను అడ్డుకునేందుకు తగిన ప్రొటీన్లను ఉత్పత్తి చేయమంటూ సందేశాన్ని ఇచ్చేదే.. mRNA. కొవిడ్‌ను అడ్డుకునేందుకు కూడా ఈ తరహా ప్రక్రియతో టీకాలు తయారు చేస్తున్నారు. అదలా ఉంచితే… mRNA ద్వారా హెచ్ఐవీని పోలిన కొన్ని ప్రమాదరహిత కణాలను కోతుల శరీరంలోకి చొప్పించారు. వాటిని ఎదుర్కొనేందుకు శరీరం శక్తిమంతమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసింది. దీంతో నిజమైన
హెచ్ఐవీ వైరస్‌ను నిరోధించగల శక్తి లభిస్తుంది. ఈ టీకాను అందుకున్న కోతులు హెచ్ఐవీని కొంతమేర అడ్డుకోవడం విశేషం. ఈ టీకాను మరింతగా అభివృద్ధిపరచి, మనకూ ఉపయోగించవచ్చన్నది పరిశోధకుల ఆశ.