మనసులు కలిసిన ప్రేమికులు, కొంగుముడి వేసుకున్న కొత్త దంపతుల తొలి విహారంలో ఆగ్రా తప్పనిసరిగా ఉంటుంది. పండు వెన్నెల్లో వెండికొండల్లే మెరిసిపోయే తాజ్‌మహల్ సాక్షిగా.. ఊసులు పంచుకుంటారు. ప్రేమసౌధం నీడలో ప్రేమను పెంచుకుంటారు. ముంతాజ్‌కు గుర్తుగా యమునా తీరంలో షాజహాన్ కట్టించిన ఈ పాలరాతి కట్టడాన్ని అణువణువూ చూసి తరించడంతో మీ విహారం పూర్తవ్వదు. షాజహాన్, ముంతాజ్లా ముస్తాబై.. ఫొటో దిగి మురిసిపోతే సరిపోదు. రెండు పూటలుండి ఆగ్రా వీధుల్లో ఆహార విహారం చేయండి. అక్కడి చిరుతిళ్లు, ఘనమైన పాకాలదే ఆగ్రాలో అగ్రస్థానం అంటారు.

Rambabu Paratha
ముంతాజ్ స్మృతిచిహ్నం ప్రపంచవింతల్లో ఒకటిగా నిలిచింది. తాజ్‌మహల్‌కు చిరునామాగా నిలిచిన ఆగ్రాలో వీధివీధిలో వింత రుచులెన్నో పలకరిస్తాయి. ముఖ్యంగా చిరుతిళ్ల విషయానికి వస్తే… షాజహాన్ వీటి రుచి మరిగి ఉంటే, ముంతాజ్ కోసం అంత పరితపించేవాడు కాదేమో! ఆగ్రాకేగే పర్యాటకులు సైతం.. అక్కడి స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేసే వరకే ‘వాహ్ తాజ్’ అంటారు. వాటిని రుచి చూశాక.. జఠరాగ్ని ఆగ్రహం చల్లారిన తర్వాతే… ముంతాజ్ అయినా, తాజ్‌మహల్ అయినా అంటారు.
ఆగ్రాలోని ప్రతాప్పూర్ డాక్ఘర్ సమీపంలోని నమ్కీన్వాలా దగ్గర చోలే కుల్చా యమ ఫేమస్. కుల్చా నంజుకోవడానికి ఇచ్చే చోలే స్టఫ్‌లో పచ్చిమిర్చీ పిచ్చిగా వేసేస్తాడు. అంతకు రెట్టింపు ఉల్లిపాయలు కలుపుతాడు. ఆపై టమాటాలు, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు దట్టించి.. ఉడికించిన శనగలు కలగలిపి దొప్పలో వేసి ఇస్తాడు. వేడివేడి కుల్చా ప్లేట్లో పెట్టిస్తాడు. ఆ కుల్చాలో ఒక ముక్క తుంచుకొని, చోలే ఘనంగా అద్దుకొని.. నోట్లోకి పంపితే ఆగ్రా రుచుల ప్రస్థానం ఘనంగా మొదలవుతుంది. నశాలానికి అంటే కారం పడనివాళ్లు.. బగర్ మిర్చీ చోలే ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం మంచిది.
‘ముంతాజ్‌ను మించిన సౌందర్య రాశి కిన్నిత్. ఆమె పరవశంలోనూ ఓలలాడాడు ఆ షెహన్షా’ అని జంఘాలశాస్త్రి కల్పిత కలను సాక్షి సహచరులతో పంచుకున్నాడు. ఆగ్రా వీధుల్లో తిరుగుతున్నప్పుడు వెంటాడే ఘుమఘుమలు.. తాజ్‌పై ఇన్నాళ్ల మమకారాన్ని కలగా మార్చేస్తాయి. ఇక్కడి ‘అంకల్’ పనీర్ కీ కచోరీ వాలే కొట్టు దగ్గర పొట్ట నింపుకోవడానికి వచ్చిన వాళ్లు వెర్రిగా వెయిట్ చేస్తూ ఉంటారు. సాదా సీదా కచోరీ కోసం ఇంతగా ఎందుకు ఎదురు చూస్తారు? ‘అంకల్’వాలా వేసిచ్చే పనీర్ కచోరీ కోసమే ఆ ఆత్రం. పదిహేను రూపాయలు చదివిస్తే చాలు.. తాజా పనీర్ తురుముతో చేసిన కచోరీ కచేరీ చేతికి అందగానే రుచుల రాగానికి జిహ్వ తాళం వేయడం మొదలుపెడుతుంది.

Bedwi Puri
ఆగ్రాకేగిన వాళ్లు తాజ్‌మహల్ చూడకుండా తిరిగొస్తే.. ప్రేమంటే అస్సలు గిట్టని వాళ్లని తీర్మానించవచ్చు. ఇక్కడికి వచ్చి.. గోపాల్‌దాస్ పేటావాలా మిఠాయి భండార్‌లో పేటా తినకుండా తిరిగొచ్చిన వారిని వాటాలేసుకొని మరీ తిట్టేయొచ్చు. సాదా పేటా, అంగూరీ పేటా, కేసర్ పేటా, కోకోనట్ ఇలాయిచీ పేటా.. ఇలా రకరకాల పేటాలు. దేని కోటా దానిదే అనుకొని లాగించండి. పేటా పంచిన మీఠా కరిగిపోవాలంటే.. మరోసారి నమ్కీన్ రుచి చూడాల్సిందే! అందుకోసం దేవీరామ్ స్వీట్స్కేగి.. బేడ్వీ పూరి ఆర్డర్ ఇవ్వాలి. పూరికి ఎక్కువ, కచోరీకి తక్కువ సైజులో ఉండే బేడ్వీ పూరిని అలా కొరికి ఓ ముక్కను నోట్లోకి లాక్కోగానే, మిగిలిన ముక్కలోంచి రేగే చిన్న పొగ నన్నూ అమాంతం తినేయమంటూ సొద పెడుతుంది.
బేడ్వీ పూరి రుచి మరుగున పడకముందే.. రాంబాబూ పరాఠా భండార్‌ను దర్శించుకోవాలి. ఇక్కడ పరోఠా సాదాసీదాగా ఉండదు. పొట్టలో మిక్స్వెజ్ కర్రీ తురుముకొని, శుద్ధమైన ఆవు నెయ్యిలో వేడివేడిగా స్నానమాడి.. దోర గోధుమ రంగును రంగరించుకొని టేబుల్ మీదికి వస్తుంది. దహీ పాలక్ జోల్, ఆలూ కుర్మా, మరో చట్నీతో ముస్తాబై వచ్చే రాంబాబూ పరాఠాను టేస్ట్ చేయని సెలెబ్రిటీ లేడట. అంబానీ నుంచి ఆనంద్ మహీంద్రా వరకు ఈ పరాఠాను ఇష్టంగా లాగించారట. అక్కడి సర్వర్లు ఆ సంగతులు చెబుతుంటే పొంగిపోయి మీ పొట్టకు అన్యాయం చేయకండి. ఆ రుచిని మనసారా ఆస్వాదించగలిగితే.. ఆ క్షణంలో మీరూ అపర కుబేరులే!
టిఫినీల సంగతి సరే! మరి మెయిన్ మెనూ మాటేమిటి? అంటారా! బీఆర్ఫుడ్ ప్యాలెస్‌కు వెళ్లండి. అక్కడ పనీర్‌తో వండిన వెరైటీలు డజన్ వరకు ఉంటాయి. పాలక్ పనీర్, కడాయ్ పనీర్, పనీర్ జైపురీ, షాహీ పనీర్, పనీర్ లవాబ్దార్, పనీర్ ఖలేజీ ఇలాగన్నమాట! రకరకాల పనీర్ పాకాలను కుల్చాలు, రోటీలతో లాగించేసి, పలావ్, జీరా రైస్ కూడా జోడిస్తే.. మీ డిన్నర్‌కు ఇంపైన పెంపు ఇచ్చినట్టు అవుతుంది. చివరిగా ఫోజ్దార్ టీ స్టాల్లో ఓ చాయ్ చుక్క తాగేసి.. ఆగ్రా రుచుల విహారానికి స్వస్తి పలకొచ్చు
– కణ్వస