ఖుల్లం ఖుల్లా మాట్లాడేవాళ్లను ‘కడుపులో ఏం దాచుకోరు పాపం’ అంటారు జనం. వాళ్ల సంగతేమోకానీ నిజంగానే కడుపులో ఏదీ దాచుకోలేని జీవులు కూడా ఉన్నాయి. గుండెలోనూ, బుర్రలోనూ.. చివరికి కాలిలోనూ, వేలిలోనూ కూడా ఏమీ దాచుకోలేవు. ఎందుకంటే ఇవి పారదర్శక జీవులు. ఒళ్లంతా గాజులా ఉండే వీటిలో కప్పల నుంచి చేపల దాకా ఎన్నో రకాలు. ఇదిగో మీరూ చూసేయండి…
ప్రకృతిలోని ప్రతి జీవికీ బతుకు పోరాటం తప్పదు. ఆ మనుగడ యుద్ధంలో కొన్ని ప్రాణులు తమ శరీరాన్ని పరిసరాల రంగులోకి మార్చుకుంటాయి. చుట్టుపక్కల వాతావరణంలో కలిసిపోతాయి. మరికొన్ని మాత్రం పరిసరాల్లో కలిసిపోయేలా గాజులాంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. తమను తాము కాపాడుకోవడానికి పదునైన పళ్లు కానీ, కోరల్లో విషం కానీ, వేగంగా పరిగెత్తే సామర్థ్యం కానీ లేని సముద్ర జీవులు ఇలాంటి రక్షణ వ్యవస్థను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మరికొన్ని జీవులూ ఇదే తరహాలో చిత్రంగా కనిపిస్తాయి.
కడుపులో ఏమీ దాచలేని జీవుల్లో నార్తెన్ గ్లాస్ ఫ్రాగ్ ముందు వరుసలో ఉంటుంది. దీని శరీరం మొత్తం.. మరీ ముఖ్యంగా పొట్ట భాగం అచ్చం గాజులా, పారదర్శకంగా కనిపిస్తుంది. ఈ కప్ప గుండె కొట్టుకోవడాన్ని కూడా మనం నేరుగా చూడొచ్చు. అలాగే కడుపులోని పేగులు, రక్తనాళాల్లాంటి అవయవాలూ బయటికి కనిపిస్తాయి. మధ్య, ఉత్తర అమెరికాల్లోని అడవుల్లో ఎక్కువగా నివసిస్తాయి. మెలకువగా ఉన్నప్పుడు కాస్త తక్కువ పారదర్శకంగా, పడుకున్నప్పుడు ఆకుల్లో కలిసి పోయేలా వీపు భాగం లేత ఆకుపచ్చ రంగులోనూ మిగతా శరీరమంతా పూర్తి పారదర్శకంగా ఉంచుకుంటాయట. శత్రువులకు దొరకకుండా తిరిగేందుకు రక్తానికి రంగునిచ్చే హిమోగ్లోబిన్లో అధిక భాగాన్ని కాలేయంలో దాస్తాయట. దాదాపు రోజులో పన్నెండు గంటలు సరైన ఆక్సిజన్ సరఫలా లేకుండానే ఇవి ఎలా బతుకుతున్నాయన్నది శాస్త్రవేత్తలకూ సవాలే.
పెరాంబాసిస్ రంగా… అన్నది ఇండియన్ గ్లాసీ ఫిష్ లేదా ఎక్స్‌రే ఫిష్ అసలు పేరు. ఇది కూడా పూర్తి పారదర్శకమైనదే. దాదాపు మూడు అంగుళాలు ఉండే దీన్ని అక్వేరియంలలో పెంచుకుంటారు. ఇందులోనే మరో రకం సైనోగాస్టర్ నోస్టివాగా. ఈ చిట్టి చేప కూడా ప్రకృతి చిత్రమే. వైట్ ష్రింప్గా పిలిచే రొయ్యల శరీరమూ పూర్తి పారదర్శకమే. వీటిని గల్ఫ్‌తో పాటు దక్షిణ అట్లాంటిక్, మెక్సికోల్లో ఆహారంగా పెంచుతారు. అచ్చం గాజులా ఉండే జెల్లీ ఫిష్‌లు నీళ్ల అలలతో కలిసిపోయి తమను తాము రక్షించుకుంటాయి.
గోల్డెన్ టార్టాయిస్ బీటిల్‌గా పిలిచే పురుగులు కూడా గాజులాంటి డొప్పని కలిగి ఉంటాయి. లోపలి రంగులు మారుస్తూ అసలు అదేంటో శత్రువుకి తెలియనివ్వకుండా బతికేస్తుందట ఈ పురుగు. ఇదే తరహాలో గాజులాంటి షెల్‌తో మాయ చేస్తూ సంచరించే నత్తగుల్లలూ ఉన్నాయి.
సీతాకోక చిలుక అంటేనే రంగుల చిరునామా. కానీ అసలు ఏ రంగూ లేని గాజులాంటి రెక్కలున్న సీతాకోక చిలుకలూ ఉన్నాయి. ‘గ్లాస్ వింగ్ బటర్‌ఫ్లై’గా పిలిచే ఇవి పారదర్శకంగా ఉంటూ పరిసరాల్లో ఇట్టే కలిసి పోతాయి. అదాటున చూస్తే అసలు అక్కడ సీతాకోక చిలుక ఉందని గుర్తించడమే కష్టం. ఈ వింతైన సీతాకోక చిలుకలు ఎక్కువగా అమెరికా, మెక్సికో దేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా సీతాకోక చిలుక రెక్కల మీద స్కేల్స్‌గా పిలిచే అతి సన్నటి వెంట్రుకల్లాంటివి ఉంటాయి. ముట్టుకుంటే మనకు అంటే రంగులు ఇవే… అయితే ఈ స్కేల్స్ రెక్కల అంచుల దగ్గర మినహాయిస్తే మిగతా ఎక్కడా లేకపోవడం వల్ల అవి పారదర్శకంగా కనిపిస్తాయి.