బేకరీ తిండ్లు, బుస్సుమని పొంగే పానీయాలు, చక్కెర ఎక్కువగా ఉన్నవి, రెడీ టు ఈట్ ఆహారాలను ఎక్కువగా తింటున్నారా? అయితే ‘ద బీఎంజే’ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అతిగా తినడం వల్ల జీవిత కాలం తగ్గొచ్చట, ముందస్తు మరణం ముప్పు పెరుగొచ్చట. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల్లో కృత్రిమ రంగులు, ఎమల్సిఫయర్లు, ఫ్లేవర్లు ఇతర పదార్థాలు ఉంటాయి.
వీటిలో క్యాలరీలు, చక్కెరలు, శాచురేటెడ్ కొవ్వులు, ఉప్పు ఎక్కువగా… విటమిన్లు, ఫైబర్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల అల్ట్రా ప్రాసెస్డ్ పదార్థాలు అనారోగ్య కారకాలుగా ఉంటున్నాయి. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు ముప్పు పెంచుతాయి. ఈ సమస్యలు చివరికి గుండె జబ్బులు, క్యాన్సర్కు కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు అమెరికా, బ్రెజిల్, చైనా దేశాలకు చెందిన లక్షకు పైచిలుకు ఆరోగ్య వృత్తిలో ఉన్న నర్సులు, పురుషుల నుంచి సమాచారం సేకరించారు. దాదాపు ముప్పయ్యేండ్ల వివరాలను పరిశీలించారు. ఇది పరిశీలన మాత్రమే. స్పష్టమైన ఫలితాలకు మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
టీ, కాఫీలంటే భారతీయులకు చెడ్డ మోజు. కప్పులకు కప్పులే తాగేస్తుంటారు. అయితే టీ, కాఫీలు మోతాదు మించకుండా తాగాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తెలిపింది. అంతేకాదు.. భోజనానికి గంట ముందు, గంట తర్వాత కూడా టీ, కాఫీల జోలికి వెళ్లకూడదట. వీటిలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా శరీరం ఐరన్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయట.
ఐరన్ తగినంతగా అందకపోతే రక్తహీనత (ఎనీమియా) తలెత్తుతుందని తెలిసిన విషయమే. పైగా కాఫీ అతిగా సేవిస్తే రక్తపోటు పెరుగుతుంది. గుండె కొట్టుకోవడంలో సమతుల్యత లోపిస్తుంది. కాబట్టి టీ, కాఫీలను మోతాదు మించకుండా సేవించండి. వీటితోపాటు నూనె, చక్కెర, ఉప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది. మరి మోతాదు ఎంత అంటే రోజుకు కెఫిన్ పరిమాణం 300 మిల్లీగ్రాములకు మించకుండా తీసుకుంటే మంచిదట.
బాల్యం ఆటపాటలకు చిరునామా. అయితే ఇప్పటి పిల్లలు బడిలో తరగతి గదులు, ఇండ్లలో డిజిటల్ చెరలో చిక్కుకుని ఆటలకు దూరమవుతున్నారు. కానీ, ఆటలు విద్యార్థులకు శారీరక వ్యాయామంతోపాటు ఎన్నో ఇతర ప్రయోజనాలు చేకూరుస్తాయి. సహచరులతో కలిసి ఆటలాడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. జట్టుగా పనిచేయడం అలవడుతుంది. జీవితంలో రాణించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో తెలుస్తుంది. కష్టాలను దాటడం, నాయకత్వ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, తీరైన శరీర పెరుగుదల, భవిష్యత్తు అవకాశాలలో అభివృద్ధి మొదలైన వాటికి ఆటలు బాల్యంలోనే పునాది వేస్తాయి. పిల్లల్ని ఆడుకోనివ్వండి.